ప్రజలు సంకుచితంగా ఆలోచిస్తున్నారు
ప్రపంచ వ్యాప్తంగా 1995 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడితే, 2025లో ఏఐ గురించి మాట్లాడుకుంటున్నారు.;
భారత దేశపు ప్రజలు చాలా నారోగా థింక్ చేస్తున్నారని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద సోమవారం చంద్రబాబు ఢిల్లీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం మంచి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని.. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి.. 2047 వికసిత్ భారత్ లక్ష్యాలు నెరవేర్చే విధంగా ఈ బడ్జెట్ ఉందని చంద్రబాబు చెప్పారు. ఈ బడ్జెట్ అర్థం చేసుకోవడంలో చాలా సంకుచితంగా ఆలోచనలు చేస్తున్నారని అన్నారు.
బడ్జెట్ ముఖ్యమైన అంశాలను ఒక సారి పరిశీలిస్తే ప్రధానంగా నాలుగు గ్రోత్ ఇంజన్‌లు, వాటి ప్రాధాన్యతలను తెలిపే విధంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు చెప్పారు. వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ, ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ వంటి రంగాలు చాలా కీలకమైనవని, వీటి మీద కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని, భవిష్యత్‌లో ఇవి గేమ్ ఛేంజర్లుగా మారనున్నాయని వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో భారత దేశం ఫుడ్ సెక్యూరిటీ అంశంలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందన్నారు. ఎంఎస్‌ఎంఈ కూడా ప్రపంచ స్థాయిలో బాగా రాణిస్తున్నాయని, రానున్న రోజుల్లో ప్రపంచంలో ఇది గేమ్ ఛేంజర్‌గా మారుతుందన్నారు. కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహకం వల్ల భారత దేశ వ్యాపారస్తులు ప్రపంచ వ్యాప్తంగా రాణిస్తున్నట్లు చెప్పారు. ఆ విధంగా ఎంఎస్‌ఎంఈ పాలసీని కేంద్ర ప్రభుత్వం రూపొందించిందన్నారు. ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ రానున్న రోజుల్లో అద్భుతాలను క్రియేట్ చేస్తుందన్నారు. దీని వల్ల పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు.
పన్నుల విధింపు పాలసీ కూడా చాలా బాగా రూపొందించారని అన్నారు. అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయన్నారు. ప్రతి రంగంలో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. పవర్ సెక్టార్‌లో సంస్కరణలు తొలి సారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే తీసుకొచ్చిందన్నారు. ప్రస్తుతం ఏపీలో పీ4 అనే మరో కొత్త విధానం తీసుకొచ్చామన్నారు. జీరో పావర్టీని సాధించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ పాలసీల వల్ల నూతన ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయని, దీంతో దేశంలో మౌలిక సదుపాయాల కల్పన పెరుగుతుందన్నారు. ప్రపంచంలోనే ఇండియా డెవలప్‌మెంట్ రేటు పెరిగే విధంగా శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందన్నారు. దావోస్‌లో కూడా ఇండియా డెవపల్‌మెంట్ గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పారు. ఆదివారం ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు సోమవారం మీడియాతో మాట్లాడారు.