చిన్నారుల సాయంపై చంద్రబాబు హర్షం.. జగన్‌పై విమర్శల వర్షం

ఆంధ్రను ముంచెత్తిన వరదలకు ప్రతి ఒక్కరూ తమకు తోచిన సహాయం స్వచ్ఛందంగా చేయాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపు భారీ విరాళాలను తెరలేపింది.

Update: 2024-09-09 13:47 GMT

ఆంధ్రను ముంచెత్తిన వరదలకు ప్రతి ఒక్కరూ తమకు తోచిన సహాయం స్వచ్ఛందంగా చేయాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపు భారీ విరాళాలను తెరలేపింది. ఎందరో సినీ తారలు, వ్యాపారవేత్తలు, వ్యాపార సంస్థలు, ఉద్యోగులు సైతం తమకు తోచినంత సీఎం సహాయనిధికి విరాళంగా ప్రకటిస్తూనే ఉన్నారు. కొందరు కోట్ల రూపాయలు విరాళం ప్రకటిస్తే మరి కొందరు తమ ఒక రోజు జీతాన్ని అందించారు. వీరిలో పోలీసు శాఖ కూడా చేరింది. పోలీసు శాఖ.. ఏపీ సీఎం సహాయనిధికి రూ.11 కోట్ల విరాళం ఇచ్చింది. ఈ విరాళాలకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వరద బాధితులను అందుకోవడానికి ఒక స్కూలులోని చిన్నారులు తమ వంతు సహాయంగా రూ.10, 20, 50, 100 ఇలా తోచినంత విరాళంగా అందిస్తున్నారు. ఈ వీడియోపై తాజాగా సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ వీడియో చూసిన తర్వాత తనకు చాలా ముచ్చటగా, సంతోషంగా అనించిందని, ఆ చిన్నారులు సహాయం ఎంతో హర్షనీయమని, ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు.

మనసు నిండిపోయింది

‘‘ఈ వీడియో ఈ రోజును ఎంతో ఉల్లాసంగా, ఆనందంగా మార్చేసింది. విజయవాడ వరద బాధితుల కోసం పశ్చిమ గోదావరి జిల్లా పడమర విప్పర్రు గ్రామంలోని శ్రీ విద్యా నికేతన్ పాఠశాల విద్యార్థులు తమ పాకెట్ మనీని విరాళంగా ఇవ్వడం చాలా గొప్ప విషయం. అదే విధంగా చిన్నారులకు ఇటువంటి ఉన్నత విలువలు నేర్పిస్తున్న యాజమాన్య ఆలోచన హర్షనీయం. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, ఇతరులను గౌరవంగా చూడటం వంటి లక్షణాలు మానవత్వాన్ని పెంచుతాయి. చిన్నారులను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దుతాయి’’ అంటూ కొనియాడారు. చిట్టి చేతుల పెద్ద సహాయమంటూ ప్రశంసించారు. అదే విధంగా మరోవైపు ప్రభుత్వంపై వైసీపీ నేతలు, శ్రేణులు చేస్తున్న విమర్శలు అంతే ఘాటుగా తిప్పి కొట్టారు.

వెనక్కు తేగ్గేదే లేదు..

‘‘ప్రజల కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. తనతో సహా మంత్రులు, అధికారులు బురదలో తిరుగుతున్నారు. తొమ్మిది రోజులుగా ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. బుడమేరుకు గండ్లు పడినా గత పాలకులు పట్టించుకోలేదు. బుడమేరు ప్రాంతాన్ని ఇష్టం వచ్చినట్లు కబ్జా చేశారు. ప్రభుత్వానికి ఎన్నో కష్టాలు ఉన్నాయి. రూ.10.5 లక్షల కోట్లు అప్పు చేసి జగన్ గద్దె దిగిపోయారు. వచ్చి ఈ బురదలో తిరిగి ఉంటే చేసిన పాపాలు కాస్తయినా పోయేవి. కానీ.. బెంగళూరులో కూర్చుని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ఇంత పెద్ద మహా యజ్ఞంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా అధిగమించుకుంటూ ముందుకెళ్తున్నాం. వరదల్లో నష్టపోయిన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటాం. వారికి ఆదాయం వచ్చచే మార్గాలు కల్పిస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.

Tags:    

Similar News