సాయంత్రం వరకు సచివాలయంలోనే సీఎం చంద్రబాబు

సొంతూరు నారావారిపల్లెలో సంక్రాంతి సంబురాలను జరుపుకున్న సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు.;

Update: 2025-01-16 05:32 GMT

సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ఉయదం నుంచి సాయంత్రం వరకు అమరావతి సచివాలయంలోనే ఉండనున్నారు. పలు శాఖల సమీక్షల కోసం గురువారం రోజంతా తన సమయాన్ని వెచ్చించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సచివాలయంలోనే ఉంటూ అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. తొలుత జీఎస్‌డీపీ మీద అధికారులతో సమీక్ష చేయనున్నారు. తర్వాత ఆదాయర్జాన శాఖలపైన రివ్యూ చేయనున్నారు. వీటికి సంబంధించిన సమాచారం ఆయా శాఖల అధికారులకు ఇదివరకే చేరవేయడంతో, దానికి సంబంధించిన నోట్స్‌తో సమీక్షలకు అధికారులు సిద్ధమయ్యారు. సంక్రాంతికి కోసం సొంతూరు వెళ్లిన సీఎం చంద్రబాబు బుధవారమే ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు.

మరో వైపు బుధవారం వరకు సంక్రాంతి సెలవులు కావడంతో సచివాలయం బోసి పోయింది. నేటి నుంచి రీ ఓపెన్‌ కావడంతో మళ్లీ కళకళలాడనుంది. వరుస సెలవుల నేపథ్యంలో అధిక శాతం సచివాలయ సిబ్బంది వారి సొంత ఊర్లకు వెళ్లారు. వారి వారి సొంత ప్రదేశాల నుంచి వచ్చి, అదే రోజు సచివాలయానికి రావడానికి కొంత మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వెనకడుగు వేస్తుంటారు. మరి ముఖ్యంగా కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఇతర అధికారుల్లో ఎక్కువ మంది ఇప్పటికీ హైదరబాద్‌లోనే తన నివాసాలను కొనసాగిస్తున్నారు. సిటీ కల్చర్‌కు అలవాటు పడిన అధికారులు హైదరాబాద్‌ వదిలి అమరావతికి వచ్చేందుకు ఆసక్తి కనబరచడం లేదు. దీంతో పాటుగా సచివాలయంలోని ఎక్కువ ఉద్యోగుల పరిస్థితి కూడా అంతే. హైదరబాద్‌లోనే తమ ఫ్యామిలీలను ఉంచి అక్కడ నుంచి అమరావతికి రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో బుధవారంతో సెలవులు పూర్తి కావడం, గురువారం వర్కింగ్‌డే కావడంతో ఏమేరకు విధులకు హాజరవుతారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయాలనికి వెళ్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే సచివాలయానికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటున్నారనే సమాచారం వారికి వెళ్తే తప్పకుండా విధులకు హాజరయ్యే అవకాశం ఉంటుందని తన పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ అధికారి పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే మంత్రుల్లో కూడా ఇది ప్రభావం చూపనుంది. సచివాలయానికి క్రమంగా వెళ్లి, ప్రజలకు అందుబాటులో ఉండాలని, శాఖల మీద పట్టు పెంచుకోవడంతో పాటు సమీక్షలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఇది వరకే మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే సీఎం ఆదేశాలు కొంత మంది మంత్రులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తమ సొంత పనుల్లో నిమగ్నమై, సచివాలయానికి సక్రమంగా వెళ్లడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సచివాలయానికి వెళ్తుండటంతో అమాత్యులు కూడా సచివాలయానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని టీడీపీ శ్రేణుల్లో చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News