మిర్చి రైతుల కోసం నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు.;
సహజంగా రైతులకు నష్టం లేకుండా.. వారు పండించిన పంటలు చేతికి అందేలోపే కనీస మద్ధతు ధర(ఎమ్మెస్పీ)లను ప్రభుత్వాలు ప్రకటిస్తాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్న మాటలు మాత్రం మరోలా ఉన్నాయి. కనీస మద్దతు ధర ప్రకటిస్తే రైతులు నష్ట పోతారని.. అందువల్లే మిర్చికి ఇప్పటి వరకు కనీస మద్దతు ధర ప్రకటించ లేదని వెల్లడించారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లో మిర్చికి గిట్టుబాటు ధర లభించక పోవడంతో కొన్ని రోజులుగా ఇటీవల గత కొద్ది రోజులుగా రైతులు ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అ«ధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. అక్కడ మిర్చి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మిర్చి రైతులను ఆదుకోవడంలోను, కనీస మద్దతు ధరను కల్పించడంలో కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ఘోరంగా ఫెయిల్ అయ్యిందని జగన్ ధ్వజమెత్తారు. బుధవారం ఉదయం చేపట్టిన ఈ జగన్ టూర్‌కు ఊహించని రీతిలో పెద్ద ఎత్తున రైతుల నుంచి మద్దతు లభించింది. దీంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించక తప్పని పరిస్థితి నెలకొంది. బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కనీస మద్దతు ధర ప్రకటిస్తే మిర్చి రైతులు నష్టపోతారనే ఉద్దేశంతోనే మిర్చికి కనీస మద్దతు ధరను ప్రకటించ లేదని స్వయంగా మంత్రే వెల్లడించారు.