రాజకీయ యాత్రికులు 'సిద్ధం'

అధికార, ప్రతిపక్ష నేతలు ఈనెల 27వ తేదీన రాయలసీమ నుంచి బస్సు యాత్రలు చేపడతారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు రెండు రోజుల ముందే కుప్పం చేరుకున్నారు.

Update: 2024-03-25 11:41 GMT
గంగమ్మ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న చంద్రబాబు

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: వేసవి కాలం ప్రారంభంలోనే మండుతున్న ఎండలకు తోడు రాజకీయ హీట్ కూడా పెరుగుతోంది. రాయలసీమ ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ వాతావరణానికి రాజకీయ కాక కూడా తోడు కానున్నది... ఈనెల 27వ తేదీ రాయలసీమకు చెందిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పులివెందులలోని ఇడుపులపాయ నుంచి, ప్రతిపక్ష నేత ఎన్ చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.

ఇందుకోసం కుప్పం నుంచి బస్సు యాత్ర చేపట్టడానికి వీలుగా రెండు రోజుల ముందే విపక్ష నాయకుడు ఎన్ చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గానికి సోమవారం మధ్యాహ్నం హెలికాప్టర్లో చేరుకున్నారు. కుప్పంలోని గంగమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మంగళవారం కూడా ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తారు. అలాగే, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా 27వ తేదీన ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించనున్నారు.

ఆ రోజు ఉదయం ఆయన ఇడుపులపాయకు చేరుకుని, తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్లో నివాళులర్పించిన తర్వాత బస్సు యాత్రను ప్రారంభించనున్నట్లు వైఎస్ఆర్సిపి వర్గాలు గతంలో కార్యాచరణ ప్రకటించాయి. ఈ బస్సు యాత్ర ఉత్తరాంధ్ర వరకు సాగనుంది. ఐదేళ్ల అధికారంలో ప్రజలకు తామేమి మేలు చేశామనేది ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరిస్తారు.

ఈ కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలసిల రఘురాం పర్యవేక్షిస్తారు. ఇందులో భాగంగా ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారథ్యంలో సన్నాహక సభలు నిర్వహించారు. పార్టీ నాయకులతో నిర్వహించిన సమీక్షల్లో స్త్రీలను ఎక్కడెక్కడ సంసిద్ధం చేయాలని, సభలో నిర్వహించే తీరు ప్రాంతాలను కూడా ఎంపిక చేశారు.


కుప్పం చేరుకున్న బాబు

ఈ నెల 27వ తేదీన కుప్పం నుంచి బస్సు యాత్ర చేప్పట్టడానికి వీలుగా విపక్ష నేత ఎన్ చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం రెండు రోజుల ముందు నియోజకవర్గం చేరుకున్నారు. ప్రారంభం నుంచి దారి పొడవునా బస్సు యాత్ర సాగించాల్సిన విధానంపై ఆయన నాయకులతో సమీక్షిస్తున్నారు. రోజుకు మూడు, నాలుగు నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహించే విధంగా కార్యక్రమాలకు సిద్ధమయ్యారు.

చంద్రబాబు బస్సు యాత్ర ప్రారంభంలో ఈనెల 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో బాబు ప్రచారం నిర్వహిస్తారు. అనంతపురం జిల్లాలో 29న రాప్తాడు, శింగనమల, కదిరి. కర్నూలు జిల్లాలో 29న శ్రీశైలం, నందికొట్కూరు. జిల్లాలో 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత ప్రచారం నిర్వహిస్తారు. 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు పర్యటిస్తారు.

చంద్రబాబు ప్రచారం ఇలా..

మార్చి 27 నుంచి మార్చి 31 వరకూ చంద్రబాబు ప్రచారం కొనసాగనుంది. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు నిర్వహించేలా ప్రచారం షెడ్యూల్‌ సిద్ధమైంది. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో బాబు ప్రచారం నిర్వహిస్తారు. 29న రాప్తాడు, శింగనమల, కదిరి.. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు.. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత ప్రచారం నిర్వహిస్తారు. 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు పర్యటిస్తారు. నేడు రేపు మాత్రం సొంత నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తారు.


సీఎం వైఎస్ జగన్....

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రుల సారథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు మొదటి విడత సిద్ధం సభలను పూర్తి చేశారు. ఈ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం ఒకపక్క ఈ ఐదేళ్ల కాలంలో ప్రజల సంక్షేమం అభివృద్ధికి చేసిన కార్యక్రమాలను వివరించడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చివరి దశగా మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర చేపట్టనున్నారు. 27వ తేదీ ఉదయం ఆయన పులివెందుల నియోజకవర్గం వేంపల్లి సమీపంలోని ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకుంటారు.

ఇక్కడ తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. అదే రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. 28వ తేదీన నంద్యాల లేదా ఆళ్లగడ్డలో ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం నంద్యాలలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

29న యాత్ర కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రవేశిస్తుంది. ఆ రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమాలకు పార్టీ శ్రేణులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాయత్తం చేశారు. జిల్లాల వారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ సీనియర్ నాయకులతో సమీక్షలు నిర్వహించినాయన ప్రచార సామగ్రిని కూడా విడుదల చేశారు.

Tags:    

Similar News