జగన్ నామినేషన్ డేట్ ఫిక్స్.. భారతికి ప్రచార బాధ్యతలు

సీఎం వైఎస్ జగన్ నామినేషన్ దాఖలుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నేపథ్యంలోనే పార్టీ ప్రచార పగ్గాలను ఆయన తన సతీమణికి భారతికి అప్పగించనున్నారట. ఈ చర్యలకు కారణమేంటో..

Update: 2024-04-12 13:02 GMT
Source: Twitter

ఆంధ్రలోని రాజకీయ నాయకులంతా ప్రస్తుతం పంచాంగాలు పట్టుకుని తిరుగుతున్నారు. మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయంటూ పండితులను ఆశ్రయిస్తున్నారు. ఇదంతా ఎన్నికల మహిహ. ఏప్రిల్ 18న రాష్ట్రంలో ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ తర్వాత నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది. అందుకే ఒకవైపు తాము నామినేషన్ వేయడానికి మంచి మహూర్తాలు జూడండి అంటూ పండితుల చుట్టూ తిరుగుతునే మరోవైపు ప్రచారాల్లో దుమ్ము రేపుతున్నారు. నామినేషన్లకు సర్వం సిద్ధం చేసుకుంటూ నామినేషన్ వేయడానికి రెడీ అవుతున్నారు. వీరిలో ఆంధ్ర సీఎం, వైసీపీ అధినేత జగన్ కూడా ఉన్నారు. నోటిఫికేషన్ వచ్చిన తొలి రెండు మూడు రోజుల్లోనే నామినేషన్ ఫైల్ చేసేయాలని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

జగన్ నామినేషన్ అప్పుడే..!

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 22న నామినేషన్ వేయడానికి జగన్ సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 22 ఉదయం 10:30 గంటలకు ఆయన పులివెందులలో తన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘మేమంతా సిద్ధం’ యాత్రలో బిజీగా ఉన్న జగన్.. ఏప్రిల్ 21 రాత్రి సమయంలో పులివెందులకు బయలదేరతారని, మరుసటి రోజు ఉదయాన్నే తన నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే ఆయన తిరుగు ప్రయాణం చేపట్టి మరుసటి రోజు అంటే ఏప్రిల్ 23 నుంచి మళ్లీ ‘మేమంతా సిద్ధం’ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపంచనున్నారు.

 

సతీమణి భారతికి ప్రచార పగ్గాలు

నామినేషన్ దాఖలు అనంతరం రాష్ట్రవ్యాప్త ప్రచారంలో జగన్ బిజీ కానున్నారు. ఈ నేపథ్యంలో పులివెందులలో పార్టీ ప్రచారానికి విఘాతం కలుగకుండా ప్రచార పగ్గాలను తన సతీమణి వైఎస్ భారతికి అప్పగించనున్నారని సమాచారం. ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకు పులివెందులలో ప్రచారాన్ని వైఎస్ భారతి దగ్గరుండి పర్యవేక్షిస్తారు. ఎప్పుడు ఎక్కడ సభలు నిర్వహించాలని, ర్యాలీలు నిర్వహించాలి అన్న అంశాలను కూడా ఆమే పర్యవేక్షిస్తారని, పులివెందులలోని పార్టీ పెద్దల సహకారంతో ఆమె పార్టీ ప్రచారాన్ని విజయవంతం చేయడానికి సన్నద్ధం అవుతున్నారని సమాచారం.

షర్మిల, సునీతపై భారతి అస్త్రమా!

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున ఏపీసీసీ అధ్యక్షురాలు పులివెందులలో ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా షర్మిల, వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత రెడ్డి.. సీఎం జగన్ టార్గెట్‌గా ధ్వజమెత్తుతున్నారు. ప్రజలు నమ్మి ఇచ్చిన అధికారాన్ని జగన్.. హంతకులను కాపాడటానికి వినియోగుస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా షర్మిల విమర్శలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వారిపైకి జగన్ వదులుతున్న అస్త్రమే భారతి అని కూడా ప్రచారం సాగుతోంది. షర్మిల, సునీతకు ఘాటుగా బదులు ఇవ్వడానికే భారతిని రంగంలోకి దింపాలని జగన్ నిశ్చయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమయితే జగన్ ప్లాన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News