Kuppam- Cm Chandrababu | టీడీపీ నేత కాళ్లు మొక్కిన సీఎం
రెండు రోజుల పర్యటన కోసం సీఎం కుప్పం చేరుకున్నారు. ద్రవిడ వర్సిటీ వద్ద స్వాగత కార్యక్రమాల్లో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-01-06 08:43 GMT
టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రెండోసారి సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వచ్చారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో కుప్పం సమీపంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు సోమవారం మధ్యాహ్నం నిర్ణీత 11.30 గంటలకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబుకు కడా (kuppam urban development authority- KADA) ప్రత్యేక అధికారి వికాస్ మర్మత్ (ఐఏఎస్) స్వాగతం పలికారు. ఆ తర్వాత జిల్లాలోని టిడిపి ప్రజాప్రతినిధులతో పాటు బిజెపి, జనసేన, నాయకులు కూడా సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
అలా టచ్ చేసి..
సీఎం చంద్రబాబు అను జిల్లాలోని టిడిపి ఎమ్మెల్యేలు ఎన్. అమర్నాథరెడ్డి, డాక్టర్ కే.మురళీమోహన్, వీయం థామస్, కోనేటి ఆదిమూలం, గాలి ప్రకాష్, పులివర్తి నాని, చిత్తూరు ఎంపీ దుగ్గిమల్ల ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్సీలు గౌని వారి శ్రీనివాసులు, దొరబాబు, కేంద్ర మాజీ మంత్రి కొనబాక లక్ష్మి, టిటిడి చైర్మన్ బి. నాయుడు తో పాటు అనేకమంది నాయకులు కలిశారు. వారు తీసుకువెళ్లిన పుష్పగుచ్చాలను సీఎం చంద్రబాబు అలా తాకి ఇలా వదిలేశారు.. వాటిని తీసుకొచ్చిన నాయకులు మళ్లీ వెంట తీసుకువెళ్లారు. శాలువలు కప్పుకోవడానికి కూడా చంద్రబాబు ఆసక్తి చూపించకపోవడం ఈ పర్యటనలో ప్రత్యేకంగా కనిపించింది. అధినేత కోసం నాయకులు తీసుకువచ్చిన ఫ్లవర్ బొకేలు, శాలవలు తిరిగి వారే తీసుకువెళ్లిన పరిస్థితి.
కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన ప్రారంభం నుంచి విభిన్నంగా ప్రారంభమైంది. తిరుపతి నుంచి వెళ్లిన టిడిపి సీనియర్ నేత నరసింహ యాదవ్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ వర్మ, మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ, ఎమ్మెల్యే భానుప్రకాష్, కుప్పం నేత గౌనివారి శ్రీనివాసులు, దొరబాబు తదితరుల వద్ద నిమిషం పాటు ఆగిన చంద్రబాబు కొద్దిసేపు మాట్లాడడం ఆసక్తికరంగా కనిపించింది. ప్రతి ఒక్కరి యోగక్షేమాలు తెలుసుకోవడానికి సీఎం చంద్రబాబు ప్రయత్నించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాళ్లు మొక్కిన బాబు..
తనను స్వాగతించడానికి వచ్చిన నాయకులతో ఫోటోలు దిగడానికి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమయం ఇచ్చారు. గతానికి భిన్నంగా వ్యవహరించిన ఆయన నాయకులను సంతృప్తి పరిచారు. జెడ్ ప్లస్ కేటగిరి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ రక్షణలో ఉన్న చంద్రబాబు దగ్గరకు వస్తున్న నాయకులను కూడా భద్రతా సిబ్బంది అభ్యంతరం చెప్పని విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు.
టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సభలో సీఎం చంద్రబాబు హెచ్చరిక లాంటి సూచన చేశారు.
" పాదాభివందనాలు చేయవద్దు. మీరు అలా చేస్తే, నేను మీ కాళ్లు మొక్కుతా" అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
సీఎం చంద్రబాబు రెండు రోజుల పర్యటనకు కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. హెలికాప్టర్ నుంచి కాస్త ముందుకు రాగానే అధికారులు నాయకులు ఆయనకు స్వాగతిస్తున్నారు. కొంతమంది మహిళా నాయకులు కూడా పాదాభివందనం చేయబోతే వారించారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు సీఎంతో కలిసి ఫోటోలు దిగారు. సందర్భంలో టిడిపి నాయకుడు ఒకరు దగ్గరకు రాగానే సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు.
వెంటనే ఆ నాయకుడు బాబుకు పాదాభివందనం చేయడానికి కిందికి వంగారు. చాలు చాలు.. ఇలా వద్దు స్వామి అని ఆ నాయకుడిని చంద్రబాబు హత్తుకున్నారు. ఫోటోలు తీయడం పూర్తిగా కాగానే..
"నువ్వు నా కాళ్ళు మొక్కావు కదా. నేను నీ కాళ్ళు మొక్కడం ధర్మం" అని వెంటనే సీఎం చంద్రబాబు ఆ నాయకుడికి పాదాభివందనం చేశారు. దీంతో అక్కడికి చేరిన అందరితో సీఎం చంద్రబాబు నవ్వులు పూజించారు. ఆ ఘటన తర్వాత ఎవరు కూడా సీఎం చంద్రబాబుకు నమస్కరించడం మినహా ఎవరూ పాదాభివందనం చేయడానికి మాత్రం సాహసించలేదు.