క్రాస్‌రోడ్డులో కామ్రేడ్స్
ఆంద్రప్రదేశ్‌లో కమ్యునిస్టులు క్రాస్‌రోడ్డులో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో వారి విధానమేమిటనేది వెల్లడి కావాల్సి ఉంది.;
Byline : G.P Venkateswarlu
Update: 2024-01-20 11:08 GMT
రాష్ట్రంలో ప్రజాపోరాటాలు చేస్తూ ఇప్పటి వరకు అధికార పార్టీని విమర్శిస్తూ వస్తున్నారు. ప్రధానంగా సీపీఐ రాష్ట్రంలోని అధికార పార్టీ పనితీరును ఎండగడుతూ వస్తున్నది. అలాగే సీపీఎం కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడుతున్నది. ఎప్పటికప్పుడు బీజేపీ, వైఎస్‌ఆర్‌సీపీల పనితీరును ప్రశ్నిస్తూ వస్తున్నారు.
ఇటీవల అంగన్‌వాడీల సమ్మె పెద్ద ఉద్యమంగా చెప్పవచ్చు. ఎక్కువగా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు. నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రానున్న ఎన్నికల్లో కమ్యూనిస్టుల దారెటు
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టులు స్వతంత్రంగా పోటీ చేస్తారా? ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? అనేది తేలాల్సి ఉంది. ఇప్పటి వరకు పొత్తుల విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రతి ఎన్నికల్లోనూ భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ తీరు దుర్మార్గంగా ఉందని, మతతత్వాన్ని రెచ్చగొడుతోందని కమ్యూనిస్టులు అంటున్నారు.
‘ఇండియా కూటమి’తో కలిసి ఎన్నికల బరిలోకి..
ప్రస్తుతం కేంద్రంలో ఏర్పాటైన ‘ఇండియా’ కూటమిలో కమ్యూనిస్టు పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ కూటమిలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారు. ఆ పార్టీపై తీవ్రమైన కోపంతో ఉన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇష్టానుసారం కాంగ్రెస్ వారు వ్యవహరించారని, అందువల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని భావించిన ఆంధ్రులు కాంగ్రెస్‌ను దూరం పెట్టారు. విభజన జరిగి పదేళ్లు కావస్తున్నందున కొంతైనా కాంగ్రెస్‌పై సానుకూలత ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్‌వారితో పాటు కమ్యూనిస్టులు కూడా భావిస్తున్నారు.
షర్మిలతో త్వరలో చర్చలు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఆదివారం బాధ్యతలు తీసుకుంటున్నారు. త్వరలోనే ఏపీసీసీతో సమావేశమై ఎన్నికల పొత్తుల విషయం చర్చించే అవకాశం ఉంది. ఈ విషయమై భారత కమ్యూనిస్టు పార్టీలోని ఒక ముఖ్య నాయకుడిని ప్రశ్నిస్తే ఇండియా కూటమితోనే మా ప్రయాణం ఉంటుందన్నారు.
బీజేపీపై తేలని టీడీపీ నిర్ణయం
తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోను రూపొందించి ఎన్నికల రంగంలోకి దిగాయి. జనసేన మాత్రం బీజేపీని కూడా కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నది. ఆ విషయమై ఇంతవరకు టీడీపీ నేత చంద్రబాబు ఎటువంటి మాట మాట్లాడలేదు. బీజేపీ వారే ఒకడుగు ముందుకేసి టీడీపీ వారు తమను ఆహ్వానిస్తే అప్పుడు మాట్లాడతామని చెప్పారు. ఇదే జరిగితే కమ్యూనిస్టులు తెలుగుదేశం, జనసేన కూటమికి దూరంగా ఉంటారు. లేదంటే పునరాలోచించే అవకాశం ఉంది.