ఇది ’బీడీ‘ బడ్జెట్ : తులసిరెడ్డి
కేంద్ర బడ్జెట్.. నితీశ్ కుమార్ హీరో – చంద్ర బాబు జీరో అన్నట్లుందని తులసి రెడ్డి ఎద్దేవా చేసారు.;
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కడప జిల్లాకు, రాయలసీమకు, రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా వేంపల్లిలో కాంగ్రెస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని, నల్ల జెండాలతో నిరసన దీక్ష చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీ నిల్–బీహార్‌కు ఫుల్ పేరుతో చేపట్టిన నిరసన దీక్షలో రాజ్య సభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి మాట్లాడుతూ గతంలో జరిగినట్లే ఈ సారి కూడా కేంద్ర బడ్జెట్ లో కడప జిల్లాకు, రాయల సీమకు, రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కేంద్రంలో మోదీ ప్రభుత్వ మనుగడ టీడీపీ మీద ఆధారపడి వుంది. కనుక ఈ సారి రాష్ట్రానికి తప్పక న్యాయం జరుగుతుందని అందరూ భావించారు. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. విభజన చట్టంలో 13వ షెడ్యూల్ ప్రకారం కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగాలి. దీనికి కావలసిన భూమి, నీరు, విద్యుత్ శక్తి, రవాణా సౌకర్యాలు, ముడి పదార్థాలు అన్నీ జిల్లాలో వున్నాయి. కానీ నిర్మాణానికి నోచుకోలేదు. ఈ సారి బడ్జెట్‌లో కూడా ఆ ప్రస్తావన లేదు.