పోసాని కోసం పోటీ పడుతున్న పోలీసులు
మొన్న రాజంపేట..నిన్న నరసరావుపేట..నేడు ఆదోని.. ఇలా పోసాని జైలు యాత్ర కొనసాగుతోంది. ఏ రోజు ఏ జైలుకు తరలిస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.;
By : The Federal
Update: 2025-03-05 06:40 GMT
ప్రముఖ సినీ నటుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళి పరిస్థితి రోజుకో కేసు.. పూటకో జైలు అన్నట్టుగా మారింది. కూటమి ప్రభుత్వం ఆయనపై కేసులు మీద కేసులు నమోదు చేస్తూ జైలు మీద జైలుకు తరలింపులు చేపట్టారు. దీంతో పోసాని కృష్ణమురళిని పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్లకు తిప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తొలుత పోసానిపై అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మణి అనే జనసేన నాయకుడు ఫిబ్రవరి 24న ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కూలా పేరుతో దూషణలు, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారనే అభియోగాలతో 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఫిబ్రవరి 26న హైదరబాద్‌లో పోసానిని అరెస్టు చేసిన పోలీసులు ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌లో విచారించిన అనంతరం రైల్వేకోడూరు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. తెల్లవారు జాము వరకు ఇరు పక్షాల వాదనలు జరిగాయి. వాదనలను విన్న కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. పోలీసుల పిటీషన్ మేరకు తర్వాత ఆయన్ను పోలీసుల కస్టడీకి అనుమతించింది. విచారణలో తనకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ సజ్జల భార్గవ్‌రెడ్డి సూచించిన స్క్రిప్ట్ మేరకు తాను ప్రెస్ మీట్లు పెట్టి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇది సంచలనంగా మారింది.
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కేసు విచారణ జరుగుతుండగానే.. సోమవారం ఆయనను పల్నాడు జిల్లా నరసరావుపేటకు తరలించారు. నరసరావుపేట రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో పోసాని మీద కేసు నమోదు కావడంతో ఆయనను పీటీ వారెంట్ మీద ఇక్కడకు తరలించారు. నరసరావుపేట టూ టౌన్ పోలీసు స్టేషన్లో 153, 504, 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో రైల్వేకోడూరు నుంచి నరసరావు పేటకు తీసుకొచ్చిన పోలీసులు ఆయనను విచారించిన అనంతరం నరసరావుపేట కోర్టులో ప్రవేశపెట్టారు. వాదనలు విన్న కోర్టు పోసానికి 10 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో పోసానిని గుంటూరు జైలుకు తరలించారు. ఈ కేసు విచారణలో ఉండగానే కర్నూలు జిల్లా ఆదోనికి మంగళవారం తరలించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో పోసాని మీద కేసు నమోదైంది. ఆదోని త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌లో పోసానిపై కూటమి నేతలు ఫిర్యాదులు చేశారు. దీంతో గుంటూరుకు చేరుకున్న ఆదోని పోలీసులు పీటీ వారెంట్ మీద జైల్లో ఉన్న పోసానిని ఆదోనికి తరలించారు.
పోసాని కోసం పోలీసులు పోటీ పడుతున్నారు. తాము అరెస్టు చేస్తామంటే తాము అరెస్టు చేస్తామని పోటీ పడుతున్నారు.
పోసాని తొలుత ఉన్న రాజంపేట సబ్‌జైలు వద్ద ఇలాంటి విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పోసానిని అదుపులోకి తీసుకునేందుకు ఆయా జిల్లాలకు చెందిన పోలీసులు పోటీలు పడ్డారు. పల్నాడు జిల్లా నరసరావుపేట, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతపురం జిల్లా పోలీసులు రాజంపేట సబ్ జైలు అధికారులకు పీటీ వారెంట్లు ఇచ్చి పోసానిని తమకే అప్పగించాలని పోటీ పడ్డారు. ఒకే సారి మూడు జిల్లాలకు చెందిన పోలీసులు పోసాని కోసం పోటీ పడటంతో ఎవరికి అప్పగించాలనే దానిపై రాజంపేట సబ్ జైలు అధికారులు తలలు పట్టుకున్నారు. పోసానిని ముందు ఎవరికి అప్పగించాలనే దానిపై చర్చలు కూడా జరిపారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట పోలీసులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మరో వైపు పోసాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 18 కేసులు వరకు నమోదు చేసినట్లు సమాచారం. గుంటూరు, విజయవాడ, నర్సరావుపేట, అన్నమయ్య, అనంతపురం, బాపట్ల, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లా పుత్తూరు, కర్నూలు వంటి పలు జిల్లాల్లో కూటమికి చెందిన తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకుడు ఫిర్యాదులు చేశారు.