‘మా నాన్నను ఓడించండి’.. బూడి ముత్యాలనాయుడు తనయుడు

అనకాపల్లిలో అన్నాచెల్లెళ్ల పోరు ఆసక్తికరంగా మారింది. చెల్లిని ఓడించడానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ నిలబడిన అన్న రవికుమార్. తండ్రి ముత్యాలనాయుడిని ఓడించాలంటూ జోరుగా ప్రచారం.

Update: 2024-05-01 05:36 GMT
Source: Twitter

ఆంధ్ర ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇది విన్న ప్రతిఒక్కరూ ఎందుకు.. ఆంధ్ర ఎన్నికలు అంత జ్యూసీగా ఎందుకు మారుతున్నాయి అన్న ఆలోచనలో పడుతున్నారు. అందుకు అక్కడ రాజకీయ సమాకరణాలే కారణం. ఏ క్షణాన ఎలాంటి మలుపు తీసుకుంటాయో అర్థం కాని వైనంలో ఉన్నాయి అవి. ఆంధ్రలో ఒకవైపు తమ తండ్రులను గెలిపించాలంటూ తనయులు ప్రచార బరిలో హోరెత్తిస్తుంటే.. మరోవైపు మా నాన్నను ఓడించండహో అంటూ కొడుకు ప్రజలను వేడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్లే ఆంధ్ర రాజకీయాలు రోజు గడిచే కొద్దీ మరింత ఉత్కంఠ భరితంగా, ఆసక్తిగా మారుతున్నాయి. ఇంతకీ తండ్రిని ఓడించమని కోరుతున్న కొడుకకు ఎవరో చెప్పలేదు కదూ.. ఆయనే రవికుమార్. ఆంధ్ర డిప్యూటీ సీఎం, వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు కుమారుడు.

‘మా నాన్న తులసి మొక్కే.. కానీ’

ఎన్నికల ప్రచారం చేస్తున్న రవి కుమార్.. ‘కన్న కొడుక్కు న్యాయం చేయలేని వ్యక్తి ఓటేసిన ప్రజలకు ఏం న్యాయం చేయగలరు? కాబట్టి ఓటర్లూ.. ఒకసారి ఆలోచించి ఓటు వేయండి. మా నాన్న బూడి ముత్యాలనాయుడిని ఓడించండి’’అని కోరారు. ‘‘మా నాన్న తులసి మొక్కే. 2019 తర్వాత ఆ మొక్కకి కొన్ని పురుగులు పట్టాయి. జగన్‌ని నమ్ముకుని ఆయన వెంట 9ఏళ్లు తిరిగాను. వైసీపీలో ఏనాడు బూడి ముత్యాలనాయుడి కుమారుడిగా చెప్పుకోలేదు. ఏమైందో ఏమో కానీ ఐదేళ్లుగా నన్ను రాజకీయంగా తొక్కడం ప్రారంభించారు’’ అంటూ రవి కుమార్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

ముత్యాలనాయుడికి తప్పని ఇంటిపోరు

ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఈ సమయంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడికి ఇంటి పోరు ఎదురుగాలిలే బలంగా వీస్తోంది. వైసీపీ అభ్యర్థిగా ఆయన కూతురు అనురాధ పోటీ చేస్తున్న మాడుగుల నియోజకవర్గం నుంచే ఆయన కుమారుడు రవికుమార్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి నిలబడ్డారు. దీంతో అనకాపల్లి రాజకీయం హాట్‌హాట్‌గా మారింది. ఇంతలోనే తండ్రిని ఓడించాలని రవికుమార్ చేస్తున్న ప్రచారం.. అటు ముత్యాలనాయుడితో పాటు వైసీపీకి కూడా మింగుడు పడటం లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వారు తలమున్కలవుతున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే ముత్యాలనాయుడికి ప్రత్యర్థి పోరు కన్నా ఇంటి పోరే గట్టిగా ఉందని అర్థం అవుతుంది.

చెల్లిపై పోటీ ఎందుకు?

రాష్ట్రంలో అన్నాచెల్లెళ్ల రాజకీయ పోరు రసవత్తరంగా మారుతోంది. కడపలో జగన్, షర్మిల మధ్య పరిస్థితులు వాడివేడిగా సాగుతుంటే.. అటువంటి పరిస్థితులే అనకాపల్లిలో కూడా కనిపిస్తున్నాయి. బూడి ముత్యాలనాయుడి కొడుకు రవికుమార్, కూతురు అనురాధ ఇద్దరూ మాడుగుల నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలబడుతున్నారు. మాడుగుల టికెట్‌ను వైసీపీ.. ముత్యాలనాయుడు రెండో భార్య కుమార్తె అనురాధకు ఇవ్వడంపై అతని మొదటి భార్య కుమారుడు రవి కుమార్ ఆగ్రహంగా ఉన్నారు. అందుకే అనురాధకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని గతంలో ప్రకటించి.. చెప్పినట్లుగానే నామినేషన్ వేసి ఎన్నికల బరిలో నిలబడుతున్నారు.

గతంలో కూడా అంతే

గతంలో కూడా జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేయాలని రవి కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. కానీ ఎందుకో అతన్ని నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా చేసి అదే స్థానం నుంచి అనురాధను నిలబెట్టారు. ఇప్పుడు కూడా మాడుగుల నుంచి పోటీ చేయాలని, ఈసారి మాడుగుల టికెట్ తనకే అని ఎన్నో ఆశలు పెట్టుకున్న రవికుమార్‌కు వైసీపీ మొండిచేయి చూపింది. ఈసారి కూడా టికెట్‌ను అనురాధకే కేటాయించింది. దీంతో కడుపు రగిలిన రవి కుమార్.. ఎదురుతిరిగి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

అయోమయంలో ఓటర్లు

ముత్యాలనాయుడి ఇంటి పోరు వల్ల ఓటర్లు అయోమయంలో పడిపోయారు. ముత్యాలనాయుడి వారసులకే ఓటు వేసి గెలిపించాలనుకున్న ఓటర్లు.. ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోలేకున్నారు. ఒకవైపు ముత్యాలనాయుడి రెండో భార్య కుమార్తె అనురాధ, మరోవైపు ముత్యాలనాయుడి మొదటి భార్య కుమారుడు రవి పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరికి ఓటు వేయాలి అన్న విషయంలో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. కాకపోతే కొందరు మాత్రం రాజకీయంగా రవికుమార్‌ను తొక్కేయాలని చూశారు కాబట్టి ఆయనకే ఓటు వేసి గెలిపించాలంటే.. పార్టీ ఇచ్చే టికెట్‌కు ఎవరు ఏం చేస్తారంటూ మరికొందరు అనురాధవైపు మొగ్గు చూపుతున్నారు. మాడుగులలో వైసీపీ ఈ ఇంటిపోరు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

రవి కుమార్ పోటీ వైసీపీకే దెబ్బ

అయితే మాడుగుల నియోజవర్గంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితులపై విశ్లేషకులు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. బూడి ముత్యాలనాయుడి ఇంటిపోరు వల్ల ఆ నియోజకవర్గంలో వైసీపీ ఓటమికి దారి తీసే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరిలో ఎవరికి ఓటేయాలో తేల్చుకోలేని ఓటర్లు.. అనూహ్యంగా ప్రత్యర్థి పార్టీకి ఓటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని, తద్వారా ఎంపీగా ముత్యాలనాయుడికి, ఎమ్మెల్యేగా అనురాధకు పడే ఓట్లను చీల్చడంలో రవి కూమార్ కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయని వారు వివరిస్తున్నారు. ఇది కూటమి అభ్యర్థికి ప్లస్‌గా మారుతుందని, ముత్యాలనాయుడి విషయంలో గందరగోళంలో ఉన్న ఓటర్లను తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేసి అందులో సక్సెస్ అయితే మాడుగులలో కూటమి అభ్యర్థినే విజయం వరిస్తుందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా గందరగోళంలో ఉన్న ఓటర్లు కూడా ప్రత్యామ్నాయంగా కూటమి అభ్యర్థి వైపు చూడొచ్చని భావిస్తున్నారు. మరి ఇక్కడ ఫలితాలు ఎలా ఉంటాయో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News