ICA| 'సర్వజన శ్రేయస్సు- సహకార వ్యవస్థ లక్ష్యం' నినాదంతో ఐసీఏ సదస్సు

అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ ముస్తాబైంది. ప్రధాని మోదీ సదస్సును ప్రారంభిస్తారు. వారం రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు దేశదేశాల ప్రతినిధులు తరలివస్తున్నారు.

Update: 2024-11-25 04:51 GMT
ICA Global conference at New Delhi
(షేక్ అక్బర్ పాషా, ఢిల్లీ సభా ప్రాంగణం నుంచి)
అంతర్జాతీయ సహకార కూటమి (ఐసిఎ) 130 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా మన దేశ రాజధాని కొత్త ఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతున్న జనరల్ అసెంబ్లీ, శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలి ప్రతినిధులు, భూటాన్ ప్రధాని, ఫిజీ, మంగోలియా ఉప ప్రధానమంత్రులు, యునైటెడ్ నేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ (డి.ఇ.ఎస్.ఎ) ప్రతినిధులు పాల్గొంటారు.
దాదాపు 2,000 మంది భారతీయ, విదేశీ సహకారవాదులు, 150 మంది యువకులు, 50 మంది ఎగ్జిబిటర్లు, మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు గణనీయమైన సంఖ్యలో పాల్గొంటారు. ఈ శిఖరాగ్ర సదస్సు నవంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రధాన సందేశం ఇస్తారు. 

ఐసిఎ జనరల్ అసెంబ్లీ శిఖరాగ్ర సదస్సుతో పాటు ఐసిఎ జనరల్ అసెంబ్లీ వుంటుంది. ఆర్థిక నివేదికలు, వ్యూహాన్ని ఆమోదించడానికి ఐసిఎ సభ్యులు అధికారికంగా సమావేశమవుతారు. ఐసిఎను 1895లో స్థాపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల సహకార సంస్థలను, 100 కోట్లకు పైగా సహకార సభ్యులను ఏకం చేస్తోంది, ప్రాతినిధ్యం, సేవలందిస్తోంది.
ఐక్యరాజ్య సమితి 2025 అంతర్జాతీయ సహకార సంవత్సర (ఐవైసి 2025) కార్యక్రమం భారత్ మండపంలో జరిగే సదస్సు ప్రారంభంలో అధికారికంగా మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమవుతుంది.
సాయంత్రం స్వాగత విందు, మొదటి సహకార సంఘాల కథను వివరించే చిత్రం ‘ది రోచ్‌డేల్ పయనీర్స్’ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు. రోచ్‌డేల్ పయనీర్ అవార్డులు కూడా ఆ సాయంత్రం ప్రకటిస్తారు.
సహకార ఉద్యమంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన వ్యక్తులు లేదా సంస్థలను సత్కరిస్తారు.
మంథన్ చిత్ర ప్రదర్శన
భారతదేశం మిల్క్‌మ్యాన్ అని ముద్దుగా పిలుచుకునే మొదటి రోచ్‌డేల్ పయనీర్ అవార్డు గ్రహీత డాక్టర్ వర్గీస్ కురియన్ 103వ జన్మదినోత్సవం సందర్భంగా నవంబర్ 26న పాడిరైతుల సహకార ఉద్యమంపై తీసిన మంథన్ (ది చర్నింగ్) సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు.
ఈ వేడుకలో 2025 అంతర్జాతీయ సహకార సంవత్సరానికి సంబంధించిన వ్యూహాలపై ఐసిఎ సభ్యులు, అపెక్స్ ఫెడరేషన్లు, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య రౌండ్ టేబుల్ చర్చ జరుగుతుంది.
నాలుగు ప్లీనరీ సెషన్‌లు
ఇక్కడ నాలుగు ప్లీనరీ సెషన్‌లు వుంటాయి. ప్రతిదానితో పాటు నాలుగు సమాంతర సెషన్‌లు వుంటాయి. సుస్థిర అభవృద్ధి లక్ష్యాలను (ఎస్.డి.జి.లను) వేగవంతం చేయడానికి సహకారాల కోసం ఒక యాక్షన్ ఎజెండాను రూపొందించడానికి, దీనిని నెరవేర్చడానికి, కాన్ఫరెన్స్‌లో 4 ముఖ్య ఇతివృత్తాలు పొందుపర్చారు. పర్యావరణం, నాయకత్వం, గుర్తింపు, భవిష్యత్తు ప్రణాళిక తదితర అంశాలపై అవగాహన సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
25న ఏమి జరుగుతుందంటే...
గ్లోబల్ కో-ఆపరేటివ్ కాన్ఫరెన్స్-2024,ఐక్యరాజ్యసమితీ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కో-ఆపరేటివ్స్-2025 ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. భూటాన్ ప్రధానమంత్రి దాషో షరింగ్ టోబ్గే, ఫిజీ ఉపప్రధాని మనోవ్ కమికామికా ఈ సదస్సుకు గౌరవ అతిథులుగా హాజరవుతున్నారు.
"సర్వశ్రేయస్సు కోసం సహకార వ్యవస్థల లక్ష్యం" అనే ప్రధాన నినాదంతో ఈ సదస్సు జరుగుతుంది.
సహకారోద్యమంలో భారత్ పాత్ర కీలకం- ఐసిఎ డైరెక్టర్ జనరల్ డగ్లస్
ప్రపంచ సహకార ఉద్యమంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోందని ఐసిఎ డైరెక్టర్ జనరల్ జెరోయెన్ డగ్లస్ అన్నారు.

దేశంలో జరగబోయే సదస్సు ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ, ఇఫ్కో, ఇతర సహకార సంస్థల ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించారు. వరుసగా మూడేళ్లు ప్రపంచ సహకార మానిటర్‌లో నంబర్-1 ర్యాంకింగ్‌ లో నిలిచిన ఇఫ్కో ఒక ముఖ్యమైన భాగస్వామి అన్నారు. అనేక ప్రపంచ సవాళ్లను అధిగమించడానికి సహకార నమూనా ఒక ముఖ్యమైన పరిష్కారమని కూడా జెరోయెన్ డగ్లస్ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News