సీఎం రమేష్‌పై డిప్యూటీ సీఎం బూడి

సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు స్థానంలో కూటమి ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్‌పై డిప్యూటీ సీఎంను రంగంలోకి దించింది వైసీపీ.

Update: 2024-03-27 14:29 GMT
సీఎం రమేష్, బూడి ముత్యాలనాయుడు

(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: అనకాపల్లి లోక్‌సభ వైసీపీ అభ్యర్థిపై గత కొంత కాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ వీడింది. ఈ స్థానం నుంచి పోటీ చేయించేందుకు వైసీపీ అధిష్టానం సిట్టింగ్ ఎంపీ సత్యవతి‌తో పాటు పలువురు పేర్లు పరిశీలన చేసి చివరకు డిప్యూటీ సీఎం, మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యే బూడి. ముత్యాలనాయుడును ఖరారు చేసింది. ఇదే సమయంలో మాడుగుల అసెంబ్లీ స్థానానికి కే. కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లే. అనురాధను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను అనకాపల్లి మినహా అన్ని స్థానాలకు 2024 ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థుల పేర్లు ఈ నెల 16న పార్టీ అధిష్టానం ప్రకటించింది.

అప్పటి నుంచి అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి కోసం అధిష్టానం మల్లగుల్లాలు పడుతూ వచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి బూడి ముత్యాల నాయుడును ఖరారు చేయడంతో రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు వైసీపీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ పూర్తయింది. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అనకాపల్లి పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్న సీఎం రమేష్‌కు దీటైన అభ్యర్థిగా ముత్యాల నాయుడును భావించిన వైసీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.

వార్డు మెంబర్ నుంచి ఉపముఖ్యమంత్రి...

అధికార వైసిపి అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు ఉమ్మడి విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం తారువ గ్రామానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముత్యాల నాయుడు రాజకీయ ప్రస్థానం వార్డు మెంబర్‌తో ప్రారంభమైంది. 1984లో యూత్ కాంగ్రెస్‌లో చేరిన ఆయన పలు పార్టీ పదవులు నిర్వహించారు.

దేవరపల్లి మండలం తారువ గ్రామ సర్పంచ్ గాను, ములకలపల్లి ఎంపీటీసీ, దేవరపల్లి ఎంపీపీ, జడ్పీటీసీగా పలు పదవులు చేపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లోనూ గత ఎన్నికల్లోనూ మాడుగుల నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ విప్‌గా పనిచేసిన ఆయనను 2022 లో మంత్రి పదవి వరించింది. ముఖ్యమంత్రి జగన్ క్యాబినెట్‌లో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మంత్రిగా కొనసాగుతున్నారు.

తండ్రి పార్లమెంటు...తనయి అసెంబ్లీ...

డిప్యూటీ సీఎం, మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తుండగా... ఆయన కుమార్తె అనురాధ మాడుగుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు అనురాధ అభ్యర్థిత్వాన్ని వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. కె. కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్న అనురాధ తండ్రి రాజకీయ చతురతను పునికి పుచ్చుకున్నారు. గత కొంతకాలంగా వైసీపీ మహిళా విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అనురాధను వైసీపీ గుర్తించి మాడుగుల అసెంబ్లీ స్థానానికి ఎంపిక చేసింది.

'గవర' కు నో టికెట్...

అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట, పెందుర్తి నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో కాపు, వెలమ, గవర సామాజిక వర్గాలు అత్యధిక ఓటర్లుగా ఉన్నారు. అనకాపల్లి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అన్ని రాజకీయ పార్టీలు ఈ సామాజిక వర్గాలకే టిక్కెట్లు కేటాయిస్తూ ఉంటారు. గత ఎన్నికల్లో బీశెట్టి సత్యవతి గవర సామాజిక వర్గం నుంచే అనకాపల్లి ఎంపీగా గెలుపొందారు. అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి వైసీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన మలసాల భరత్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో ఎంపీ స్థానం మళ్ళీ గవర సామాజిక వర్గానిదే అనుకున్నారు.

అయితే టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడును వైసీపీ రంగంలోకి దింపింది. కూటమి అభ్యర్థిగా అనకాపల్లి అసెంబ్లీకి గవర సామాజిక వర్గానికి చెందిన కొణతాల రామకృష్ణను పోటీలో ఉంచగా... వైసీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన భరత్‌ను రంగంలోకి దింపింది. దీంతో అనకాపల్లి పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి.

Tags:    

Similar News