పర్యాటక ప్రాంతంగా కొండవీడు అభివృద్ధి
పూర్వ చరిత్రకు అద్దంపట్టే కొండవీడు కోట ప్రాంతం సినిమా షూటింగ్ లకు అనుకూలంగా ఉంది. దీనిని పర్యాటక ప్రాంతంగా ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది.;
ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేటకు సమీపంలో ఉండే కొండవీడు కోట ప్రాంతం ప్రస్తుతం సినిమా షూటింగ్ లకు అనుకూలంగా మారింది. అటవీ ప్రాంతం కావటం, కోట ఉండటం, చరిత్రలో చెప్పుకో దగిన ప్రదేశం కావడంతో ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్ లు చేసుకునేందుకు బాగుంటుందని సినీ పరిశ్రమ వారు భావిస్తున్నారు. గ్రామీణ వాతావరణం నేపథ్యంగా తీసే సినిమాలు ఈ ప్రాంతంలో తక్కువ ఖర్చుతో నిర్మించుకునే అవకాశం ఉంది. ఔట్ డోర్ షూటింగ్ ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసుకోవచ్చు.
అడవులు ఆసరాగా నిర్మించే చిత్రాలు కూడా ఇక్కడ నిర్మించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఏది కావాల్సి వచ్చినా గుంటూరు నగరం, చిలకలూరిపేట పట్టణాలు అందుబాటులో ఉంటాయి. జాతీయ రహదారి 16 కేవలం 16 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటక అభివృద్ది ప్రాంతంగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాజులు, బ్రిటీష్ వారి హయాంలో ఈ ప్రాంతం విలసిల్లినట్లు ఆధారాలు ఉన్నాయి. పర్యాటక, ఆథ్యాత్మిక ప్రాంతంగా ఈ కొండవీడు ఒకప్పుడు ప్రసిద్ధి చెందిందని, ఇప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని పర్యాటకులు సంతోషించే విధంగా చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కొండ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంత వాతావరణంలో సినిమాలు నిర్మించుకునేందుకు ఈ ప్రాంతం చాలా బాగుంటుందని ప్రభుత్వం చెబుతోంది.
సినిమా షూటింగులకు కొండవీడు కోట చాలా అనుకూలం: మంత్రి రవికుమార్
కొండవీడు కోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. కొండవీడు కోట ప్రాంతం సినిమా షూటింగులకు అనుకూలమైన ప్రదేశమని చెప్పారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కొండవీడు కోటను చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో అభివృద్ధి చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. కొండవీటి కోటను అభివృద్ధి చేయడానికి నాడు చంద్రబాబు నాయుడు రూ. 40 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు. దీంతో కోటపైకి రోడ్డు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. రానున్న కాలంలో కొండవీటి కోటను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అవసరం అయితే పర్యటకశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు.
గ్రామీణ వాతావరణ నేపథ్యంలో హీరో శివాజీ నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా షూటింగ్ కొండవీడు కోటపై జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. పల్నాడు ప్రాంతంలో సినిమా షూటింగ్ జరగడంపై హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కే పరిమితం అయిన సినిమా ఇండస్ట్రీని, ఏపీకి కూడా ఆహ్వానిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.
చారిత్రక ప్రదేశం
కొండవీడు కోట పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం కొండవీడు అనే గ్రామంలో ఉన్న చారిత్రాత్మక మైన పురాతన కొండ కోట. ఈ ప్రదేశం గుంటూరు నగరానికి పశ్చిమాన 37కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రధాన కోట కాకుండా, సమీపంలో మరో రెండు కోటలు (పేర్లు తెలియవు) ఉన్నాయి. కొండవీడు కోటను యునెస్కో వారు ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కొండవీడు కోటను ప్రోలయ వేమారెడ్డి నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ ప్రాంతాన్ని 1328 - 1482 మధ్యకాలంలో రెడ్డి రాజులు రాజధానిగా ఉపయోగించుకున్నట్లు ఆధారాలు చెబుతున్నాయి. రెడ్డి రాజులు అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న సమయంలో కొండవీడుకు మార్చినట్లు చరిత్ర కారులు చెబుతున్నారు. విజయనగరం పాలించిన చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు 1516లో స్వాధీనం చేసుకున్నాడు. గోల్కొండ సుల్తానులు 1531-1536 ప్రాంతాలు, ఆ తరువాత 1579లోనూ ఈ కొండవీడు ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పోరాటాలు చేసినట్లు ఆధారాలు చెబుతున్నాయి. కులీ కుతుబ్ షా 1579లో కొండవీడు ను స్వాధీనం అప్పట్లో దానికి ముర్తజా నగర్ అని పేరు పెట్టినట్లు ఆధారాలు ఉన్నాయని చరిత్ర కారులు చెబుతున్నారు.
1788లో ఫ్రెంచ్ వలసదారుల చేతుల్లో నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది. ఆ తరువాత 19వ శతాబ్ధంలో గుంటూరు జిల్లాకు దానిని అప్పటి బ్రిటీష్ వారు అప్పగించారు. ప్రస్తుతం భారీ కోటలు, కోట గోడలు చరిత్రకు గుర్తుగా కనిపిస్తున్నాయి. గొప్ప కట్టడాలకు ఎటువంటి ఆదరణ లేకపోవడంతో కాల గర్భంలో కలిసిపోతున్నాయి. కోట ప్రాంతమంతా నివాసానికి నాడు ఎలా నిర్మించారో చూస్తే అర్థమవుతుంది. పచ్చని అటవీ ప్రాంతంలో ఈ కోట ఉంటుంది. ఎటు చూసినా కొండలు, గుట్టలు, పచ్చని చెట్లు, అహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది.
శత్రు దుర్భేద్యం..
సుమారు 1,500 అడుగుల ఎత్తైన కొండపై కోట నిర్మించారు. శత్రువులు ఎవరు ఎటు వైపు నుంచి వచ్చినా ఈజీగా గుర్తించేందుకు వీలుగా ఈ కోట ఉంటుంది. కోట వద్దకు వెళ్లేందుకు పూర్వకాలంలోనే దారులు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఘాట్ రోడ్స్ ను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో పాడు పడిపోయాయి. వరుసగా కొండలు ఉంటాయి. ఈ ప్రాంతంలో విద్యార్థులు అప్పుడప్పుడు ట్రెక్కింగ్ కూడా చేస్తుంటారు. కాలేజీల విద్యార్థులు తమ కాలేజీ యాజమాన్యాల అనుమతితో అప్పుడప్పుడూ వచ్చి పరిశీలించి ఆనందంగా గడిపి వెళుతుంటారు. ఈ ప్రాంత మంతా ఎక్కువగా సీతాఫలం చెట్లు ఉన్నాయి. ఇవే కాకుండా ఇతర రకాల చెట్లు కూడా బాగానే ఉన్నాయి. డవీడు ప్రాంతంలో హిందూత్వ వాదం, బౌద్ధ మత ప్రచారం జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి.
శిథిలావస్థలో కోట..
కొండ శ్రేణి పైన ఉన్న మూడు కోటలు ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి. కోట లోపల 21 నిర్మాణాలు గుర్తించారు. నాటి గ్రానైట్ రాళ్లతో నిర్మించిన కోటలలో భారీ ప్రాకారాలు, మ్యాగజైన్‌లు, గిడ్డంగులు, ధాన్యాగారాలు, నీటి బావులు ఉన్నాయి. కోటలలోకి ‘కోలేపల్లి దర్వాజా’, ‘నాదెళ్ల దర్వాజా’ అని రెండు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ప్రవేశ ద్వారం మూడు అంతస్తులు భారీగా మరియు గా గ్రానైట్ రాతి దిమ్మెలతో తయారు చేశారు. రాతి స్తంభాలు, రాతి పలకలతో కప్పిన భవనం 110 మీటర్లు ఉంటుంది. దాని పొడవున శాసనాలు ఉన్నాయి. రక్షణ బంకర్ కూడా కనిపిస్తుంది. కోటలో నివసించే వారి కోసం నీటి సరఫరాకు మూడు వనరుల నుంచి నీరు వచ్చేది. ముత్యాలమ్మ చెరువు, పుట్టలమ్మ చెరువు, వెదుళ్ల చెరువు నుంచి నీరు పైకి పంపింగ్ ద్వారా తెప్పించే వారు. కోటకు వెళ్ళే మార్గంలో కోట దిగువన రాజ కుటుంబ రాజభవనాలు, కోట ప్రధాన రక్షకుల ఇళ్లను రక్షించడానికి భద్రతా రింగ్ బండ్ గా ఒక కట్టడం కనిపిస్తుంది. కోట బురుజులు, ఇతర కట్టడాలు ఇప్పటికీ ఆకట్టుకుంటాయి. కొండ కింది భాగంలో గోపీనాథస్వామి ఆలయం ఉంది. కోటలో హిందూ, ముస్లిమ్ సాంప్రదాయ కట్టడాలు కూడా ఉన్నట్లు చరిత్ర కారులు చెబుతారు.
పునరుద్ధరణ పనులు
కోట వైభవాన్ని చాటి చెప్పే విధంగా చేయాలనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురావస్తు, మ్యూజియమ్స్ శాఖ పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు నిర్ణయించింది. ప్రతిపాదిత పనులలో కొండకు తూర్పు వైపు నుంచి 3.5 కిలోమీటర్ల పొడవున కొండ ఘాట్ రహదారి నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. రాతి మార్గం వెంట రీసెట్ చేయడం, రెయిలింగ్ అందించడం, వ్యూ పాయింట్లు, బురుజులు, గారిసన్ బ్యారక్‌లు, అంతర్గత రహదారులను పర్యాటక శాఖ సహకారంతో నిర్మించాలనే ఆలోచన ప్రభుత్వంలో ఉంది.
ఇస్కాన్ దక్షిణ భారతదేశం కూడా తమ ఆధ్యాత్మిక వారసత్వ పునరుజ్జీవన ప్రాజెక్టు ద్వారా ఈ చారిత్రాత్మక కోటకు ఒక పెద్ద రూపాన్ని ఇవ్వడానికి ముందుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొండవీడు కొండల దిగువన పురాతన వెన్న గోపాల దేవత కోసం మొదటి దశలో ఒక అందమైన ఆలయాన్ని నిర్మించడానికి 65 ఎకరాల స్థలాన్ని కేటాయించింది
వచ్చే విజయ దశమి ని విజయవంతంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం కొండ పైభాగంలో 150 ఎకరాలు అభివృద్ధి చేయడానికి ISKCON కు హామీ ఇచ్చింది. కొండ పైభాగానికి రూ. 3 కోట్ల తో రహదారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేస్తోంది. ప్రపంచంలోనే కృష్ణుడి విగ్రహం చాలా అరుదు అయిన ఆకారంలో ఇక్కడ కనిపిస్తుంది. చెగిజ్ఖాన్ పేట (కొండవీడు) లో ఉన్న కృష్ణుడి చిత్రం క్రింద ఉంది.
చిలకలూరిపేట కు 13 కిలో మీటర్ల దూరంలో కోట ఉంది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రోడ్డు, రైలు మార్గాల ద్వారా గుంటూరుకు సులభంగా చేరుకోవచ్చు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వారు కూడా వాహనాల్లో ఇక్కడికి ఈజీగా చేరుకునేందుకు అవకాశం ఉంది. గుంటూరు చేరుకున్న తర్వాత గుంటూరు-చిలకలూరిపేట సాధారణ బస్సు ఎక్కి భోయపాలెం-పిరంగిపురం రోడ్డులో దిగి, కోటకు వెళ్లొచ్చు. సొంత వాహనాలు వెళతాయి. అక్కడి నుంచి ఆటోలు అద్దెకు తీసుకోవచ్చు.