దేవి నవరాత్రులు: దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రులు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు దుర్గాష్టమి. దుర్గావతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు.
దేవీ నవరాత్రుల్లో ఎనిమిదో రోజుకు ప్రత్యేకత ఉంది. గురువారం అమ్మవారి అలంకరణకు విశిష్టత ఉంది. ఈ రోజు దుర్గాష్టమి. పవిత్ర దినం. ఈ రోజు అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గతులను నివారించే ఆదిపరాశక్తి దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ దుర్గదేవి అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహా రూపాల్లో తొలి రూపం దుర్గాదేవి రూపం. భవబంధాల్లో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాతగా దుర్గాదేవిని కొలుస్తారు. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మవారిని ఈ రోజు పూజించి దర్శిస్తే శత్రుపీడనం తొలగి పోతుందని భక్తుల విశ్వసిస్తారు. జీవితాల్లో సర్వత్రా విజయం పాప్తిస్తుందని నమ్ముతారు. ఈ రోజు దుర్గాదేవి రూపంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఎర్రని వస్త్రం సమర్పిస్తారు. ఎర్రటి అక్షింతలు, ఎర్రటి పూలతో అమ్మవారికి ఈ రోజు ప్రత్యేకంగా పూజలు చేసి ఆరాధిస్తారు.