తురకపాలెం మృత్యుఘోషకు యురేనియం కారణమా?
తాజా అధ్యయనంలో వెల్లడైన వాస్తవాలు ఏమిటీ..;
By : The Federal
Update: 2025-09-14 02:14 GMT
గుంటూరు రూరల్ మండలం.. తురకపాలెం.. ఊరు చిన్నదే.. రోగాల కథ పెద్దది.. ఈ ఉళ్లో ఇటీవల 8 నెలల కాలంలో సుమారు 45 మంది చనిపోయారు. హెల్త్ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ మృత్యుఘోష వెనుకున్న కారణాలను వెలికితీసేందుకు హైదరాబాద్, చెన్నై మొదలు ఎక్కడెక్కడి నుంచో శాస్త్రవేత్తలు వచ్చి పరిశీలనలు జరిపారు. ఇంకా జరుపుతున్నారు.
తాజాగా ఓ అధ్యయనంలో తెలిసిందేమిటంటే తురకపాలెం తీవ్ర అనారోగ్య సమస్యలకు యురేనియం అవశేషాలు కలిసిన జలాలే కారణమని తేలింది. ఈ గ్రామంలోని నీరు, మట్టి, స్థానికుల రక్త నమూనాలను సేకరించి చెన్నై సహా ఎయిమ్స్, గుంటూరు జీజీహెచ్ ప్రయోగశాలలకు పంపించి అధ్యయనం చేయిస్తున్నారు. చెన్నై ప్రయోగశాలకు పంపిన నీటి నమూనాల ఫలితాలు శనివారం వెల్లడైనట్లు తెలిసింది. అందులో తురకపాలెం పరిసరాల్లోని నీటిలో యురేనియం అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు.
చుట్టూ రాళ్ల క్వారీలు ఉండడం, వాటిలోనే ఈ పరిసర ప్రాంతవాసులు పనిచేస్తుండటం.. ఇక్కడ క్వారీ గుంతల్లోని నీటిని పలు సందర్భాల్లో వాడడంతో సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. స్ట్రాన్షియం అనే మూలకంతో పాటు ఈకొలి బ్యాక్టీరియా కూడా ఇక్కడి నీటిలో ఉన్నట్లు గుర్తించారు.
మరోవైపు, తొలుత గ్రామంలో సేకరించిన నీటి నమూనాల పరీక్ష ఫలితాల్లో ఒక్కచోట మినహా ఎక్కడా బ్యాక్టీరియా ఆనవాళ్లు లేవని అధికారులు ప్రకటించారు. చెన్నై నివేదికలో మాత్రం అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి.
యురేనియం శరీరానికి చాలా హానికరమని వైద్యులు చెబుతున్నారు. తాగునీరు, ఆహారం ద్వారా ఈ అవశేషాలు మానవ దేహంలోకి చేరితే ముందుగా మూత్రపిండాలకు నష్టం కలుగుతుంది. చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు, ఎముకలను దెబ్బతీయడం ద్వారా ప్రాణాంతకంగా పరిణమించవచ్చు.
తురకపాలెం గుంటూరు రూరల్ మండలంలో ఉంది. చుట్టూ క్వారీ గుంతలున్నాయి. అవి ఎప్పుడూ నిరంతరం నీళ్లతో నిండి ఉండి దోమలకు నిలయాలుగా మారాయి. ఈ ఊళ్లోని ఎస్సీ కాలనీలో పూటకొరకు మంచనా పడుతున్నారు. ఊళ్లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.