దేవినేనికి టిక్కెట్ ఔట్

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థుల ప్రకటన దాదాపు పూర్తయిందని చెప్పొచ్చు. పొత్తుల్లో భాగంగా నాలుగైదు సీట్లు ప్రకటించాల్సి ఉంది.

Update: 2024-03-22 08:16 GMT
దేవినేని ఉమా మహేశ్వరావు, టీడీపీ లీడర్

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అభ్యర్థుల ప్రకటన దాదాపు పూర్తయింది. మూడు సార్లు జాబితా ప్రకటించినా టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరావుకు తెలుగుదేశం పార్టీ సీటు ఇవ్వలేదు. తనకు తప్పకుండా సీటు వస్తుందని భావించిన దేవినేని భంగపాటుకు గురికాక తప్పలేదు. ఒక దశలో పెనమలూరు స్థానం దేవినేని ఉమామహేశ్వరావుకు ఇవ్వాలని చూశారు. అయితే అక్కడ గెలిచే అభ్యర్థి బోడె ప్రసాద్ మాత్రమేనని, ఆయనను దూరం చేసుకోవడం కంటే దేవినేని ఉమాను పక్కన బెట్టడమే మంచిదని భావించిన అధిష్టానం ఉమాను పక్కన బెట్టింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో దేవినేని 2014 ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు. ఇరిగేషన్ మంత్రిగా సక్సెస్ ఫుల్ గా భాధ్యతలు నిర్వహించారని పలువురు చెబుతుంటారు. తెలుగుదేశం వర్గాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఉమాకు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదు

ఆర్థికంగా ఉమా మహేశ్వరరావు వీక్ అయ్యారని పలువురు చెబుతున్నారు. ఎన్నికల్లో భారీ స్థాయిలో డబ్బు ఖర్చుపెట్టుకునే స్థాయి నాకు లేదని పార్టీ అధ్యక్షుని వద్దే చెప్పినట్లు సమాచారం. డబ్బులు లేకుండా ఈ ఎన్నికల్లో నెగ్గే అవకాశాలు చాలా తక్కువని, అందుకే ఈ సారికి పార్టీ నాయకత్వంలో పనిచేయాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. మైలవరం నియోజకవర్గ టిక్కెట్ వసంత కృష్ణప్రసాద్ కు ఇచ్చారు. కృష్ణప్రసాద్ ఇప్పటి వరకు వైఎస్సార్సీపీలో ఉన్నాడు. ఈ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్మే కావడం విశేషం. ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చి నందిగామ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. హోంశాఖ మంత్రిగా ఎన్టీ రామారావు నాయకత్వాన మంత్రి వర్గంలో పనిచేశారు. అప్పట్లో ఆయనకు ఎంతో మంచి పేరు ఉంది. వయసు పైబడటంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన కుమారుడు వసంత కృష్ణప్రసాద్ వైఎస్సార్సీపీ తరపున మొదటిసారి పోటీ చేసి గెలుపొందారు. తిరిగి ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు వైస్ జగన్ మోహన్ రెడ్డి నిరాకరించారు. దీంతో ఆయన పార్టీ మారారు. మొదటి రెండు జాబితాల్లో పేరు లేకపోయినా మూడో జాబితాలో దేవినేని ఉమామహేశ్వరావుకు బదులు వసంత కృష్ణప్రసాద్ పేరు చంద్రబాబు ప్రకటించారు.

దేవినేని ఉమా సీనియర్ టీడీపీ లీడర్

రెండు సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి నందిగామ ఎమ్మెల్యేగా గెలిచారు. మైలవరం నుంచి మూడో సారి గెలిచి మంత్రి పదవి చేపట్టారు. 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి సేవలందించారు. అధికారంలో వున్నప్పుడు ప్రతిపక్ష పార్టీని కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని కానీ విమర్శించడంలో దిట్ట. తన వరకు తాను పార్టీకి అండగా వుంటూ వచ్చారు. గెలుపు ఓటముల ఈక్వేషన్, ఆర్థిక వ్యవహారాలు పరిశీలించి టిక్కెట్ ఇవ్వలేకపోయారని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పార్టీలో ఉన్నత స్థాయి పదవి తప్పకుండా చంద్రబాబు ఇచ్చేందుకు హామీ ఇచ్చారని సమాచారం.

Tags:    

Similar News