108 ambulance out of control | సంజీవని టైర్ల కింద నలిగిన యాత్రికులు

అంబులెన్స్ అదుపుతప్పింది. గాయపడిన ఐదుగురిని 108 పైలట్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరు మరణించారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-01-06 04:07 GMT

అత్యవసర సేవలు అవసరమైన వారికి 108 అంబులెన్స్ సంజీవనిగా సాయపడుతోంది. ప్రాణాపాయ స్ధితిలో ఉన్న రోగిని తరలిస్తున్న 108 వాహన అదుపు తప్పింది. శ్రీవారి దర్శనానికి వెళుతున్న పాదయాత్రగా వెళుతున్న యాత్రికులపైకి దూసుకుపోయిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు విడిచారు.

అంత ప్రమాదం జరిగినా 108 అంబులెన్స్ పైలట్ తన కర్తవ్యాన్ని మరువలేదు. గాయపడిన వారిని తన వాహనంలోనే తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. ఇంకొందరు గాయపడినట్లు సమాచారం. ఊహించని ఈ ఘటనతో శ్రీవారి భక్తుల్లో హాహాకారాలు మిన్నంటాయి. ఈ సంఘటన సోమవారం వేకువజామున జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే..

మదనపల్లె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఓ రోగికి అత్యవసర సేవలు అవసరం అయ్యాయి. 108 అంబులెన్స్లో ఆ రోగిని తీసుకుని తిరుపతి రుయా ఆస్పత్రికి బయలుదేరారు. చలికాలం కావడంతో మంచు తెరలు కమ్ముకున్నాయి. దారి కనిపించడం కూడా కష్టంగా ఉంది. మదనపల్లె నుంచి తిరుపతి వరకు మలుపులే కాదు. భాకరాపేట ఖాట్ రోడ్డులో ప్రయాణం కూడా ఇబ్బందికరమే. రోగి ప్రాణాలు కాపాడాలనే లక్ష్యం ముందు 108 వాహనం డ్రైవర్కు ఇవేమి పెద్దకష్టం అనిపించలేదు. ఆఘమేఘాలపై వాహనం వస్తోంది. అదే సమయంలో..
చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లె నుంచి యాత్రికుల బృందం తిరుమల శ్రీవారి దర్శనానికి పాదయాత్రగా బయలుదేరింది. స్వామివారిని దర్శించుకోవాలనే వారి కోరికకు చలి, మంచు ఏమాత్రం అడ్డంకి కాలేదు. అంతచలిలోనూ నడక సాగిస్తున్నారు.
చంద్రగిరి మండలం నరసింగాపురం వద్ద ఓ ప్రైవేటు కాలేజీ సమీపంలో శ్రీవారి యాత్రికులు రోడ్డు పక్కన నడకసాగుతోంది. అదే సమయంలో మదనపల్లె నుంచి రోగిని తీసుకుని బయలుదేరిన 108 అంబెలెన్స్ సైరన్ వేసుకుంటూ వస్తోంది. ఈ శబ్దం వినిన యాత్రికులు రోడ్డు పక్కకన నడక సాగిస్తున్నారు. అసలే చలికాలం, మంచుదుప్పటి ముసుగు వేసిన పరిస్థితిలో దారి కనిపించలేదో..? లేక దగ్గరకు వచ్చిన తరువాత కానీ అంబులెన్స్ పైలట్ గమనించే లోపు జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. రోడ్డు పక్కన నడుస్తున్న యాత్రికుల పైకి వాహనం దూసుకుని పోవడంతో యాత్రికుల్లో హాహాకారాలు మిన్నంటాయి.
అంతటి స్థితిలోనూ...
రోగులకు అత్యవసర సేవలు అందించడంలో 108 అంబులెన్స్ పాత్ర కీలకమైనది. అనుకోని ఘటనతో ఆ వాహన డ్రైవర్ ఆందోళన చెందినా, సమయస్ఫూర్తితో వ్యవహరించారు. యాత్రికులను గమనించిన పైలట్ వాహనం నిలిపివేశారని సమాచారం. వెంటనే తన వల్ల జరిగిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించకుండా, గాయపడిన యాత్రికులను అప్పటికే వాహనంలో ఉన్న రోగి పక్కన చేర్చారు. వెంటనే వారందరినీ రుయా ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. ఈ సంఘటనలో శ్రీవారి యాత్రికుల్లో రామసముద్రం మండలం పెంపాలపల్లకు చెందిన పెద్దరెడ్డెమ్మ (40) శేగంవారిపల్లకు చెందిన లక్షుమ్మ తోపాటు ముగ్గురు గాయపడ్డారు. వారందరినీ అంబులెన్స్ పైలట్ తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించగా, వారిద్దరు మరణించారు. గాయపడిన మరో ముగ్గురు చికిత్స తీసుకుంటున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News