మోదీతో జగన్ కుమ్మక్కయ్యారా?

మోదీతో జగన్ కుమ్మక్కయ్యారా? లేదంటే ఎందుకు విభజన సమస్యలపై గళమెత్తడం లేదు. దీని వెనుక ఏముందనేది ప్రస్తుతం రాష్ట్ర ప్రజలను వేధిస్తున్న ప్రశ్న.ఒక విశ్లేషణ

Update: 2024-03-20 11:26 GMT
PM Modi, AP CM YS Jagan




విశ్లేషణ


దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు ఒకే ధ్యేయంతో పనిచేస్తున్నారా?

వీరిరువురూ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్ల కాలంలో ఒక్క సారి కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పనితీరును వైఎస్ జగన్ తప్పు పట్టలేదు. అలాగే మోదీ కూడా వైఎస్ జగన్ ను తప్పుపట్టలేదు సరికదా పాలన తీరు కూడా బాగోలేదనే సంకేతం కూడా ఇవ్వడం లేదు.

కాంగ్రెస్ విమర్శిస్తున్నట్లు కేంద్రంలో ఉన్నది, రాష్ట్రంలో ఉన్నది ఒకే పాలన అనటంలో సందేహం వచ్చేలా ఇరువురి ధోరణి ఉంది.

సహజంగా కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలోనూ, రాజకీయ అంశాల్లోనూ స్పర్థలు వస్తాయి. అటువంటప్పుడు కొన్ని విమర్శలు రావడం కూడా సహజమే. అయితే అటువంటివేవీ పీఎం, సీఎం మధ్య చోటు చేసుకోలేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకపోయినా పట్టించుకునే వారు లేరు. సీఎం సైతం అడగటం లేదు. కేంద్రం గతంలో ఇచ్చిన హామీలైనా అమలు ఎందుకు చేయడం లేదనే ప్రశ్న రాష్ట్ర పార్టీ వేయడం లేదంటే లోపాయికారీ ఒప్పందం ఏదో జరిగి ఉంటుందనే అనుమానాన్ని రాష్ట్ర ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. 

ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 25 లోక్ సభ స్థానాలు గెలిపిస్తే ప్రత్యేక హోదా ఎలా రాదో చూసుకుంటానని చెప్పారు. అందరూ నిజమేననుకున్నారు. ఎన్నికలు జరిగిన తరువాత 22 మంది ఎంపీలను వైఎస్సార్సీపీకి రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. అలాంటప్పుడు ఎందుకు పార్లమెంట్ లో నిలదీయలేదనే ప్రశ్న రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి మనసులను తొలిచి వేస్తున్నది. గెలిచిన తరువాత కొద్దిరోజులకు ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు వచ్చాయి. అందువల్ల మనం అగ్రెసివ్ గా పోలేకపోతున్నామని చల్లగా చెప్పి తప్పించుకున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలోనైనా రాష్ట్రానికి ఇవ్వాల్సిన సాయం గురించి ఎందుకు అడగటం లేదు. విభజన హామీల అమలు గురించి ఎందుకు ప్రశ్నించడం లేదనే విమర్శ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉంది. ఇంతవరకు ఆ విమర్శకు సమాధానం కూడా వైఎస్ జగన్ నుంచి రాలేదు.

పొత్తులో టిడిపిని చూస్తూ బిజెపిని విస్మరిస్తే ఎలా?

ఇటీవల ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద జరిగిన ‘సిద్ధం’ సభలో సీఎం మాట్లాడుతూ ఒక జాతీయ పార్టీని జేబులో పెట్టుకున్నాడు చంద్రబాబు అంటూ చమత్కారాలు విసిరారు. కానీ బీజేపీ తీరును మాత్రం ఎక్కడా తప్పుపట్టలేదు. తెలుగుదేశం పార్టీ బిజెపి పొత్తు పెట్టుకోవడాన్ని విమర్శించినపుడు, పొత్తు కోసం వెంపర్లాడిని బిజెపి పల్లెత్తు మాట ఎందుకు అనడం లేదు?

బీజేపీ రాష్ట్రంలో వేళ్లూనుకునేందుకు పొత్తు అవతారం ఎత్తింది. చంద్రబాబును బెదిరించో అదిరించో ఏడు ఎంపీ సీట్లు, పది ఎమ్మెల్యే సీట్లు సంపాదించారు. టీడీపీ, జనసేనతో కలిసి ఎన్డిఏ కూటమి రంగంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసీటు సంపాదించడం చేతకాని బీజేపీ ఎన్డీఏ కూటమి అంటూ సీట్లు సాధించి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారి జుట్టు చేతిలో ఉంచుకోవాలనే ఆలోచనలో రంగంలోకి దిగి సక్సెస్ అయింది. అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సాధిస్తుందో లేదోననే అనుమానంతో మోదీ వైఎస్ఆర్సీపీని ఒక్క మాట కూడా అనటం లేదని స్పష్టమైంది.

ప్రధాన మంత్రి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేట వద్ద ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో మాట్లాడారు. అధికార పక్షంపై ఒక్క విమర్శ కూడా చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రులు అవినీతి పరులన్నారు. ఏకంగా సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ ను పళ్లెత్తు మాట కూడా అనలేదంటే రెండు కత్తులు ఒకే వరలో ఇమిడినట్లేననే వాదన రాష్ట్ర ప్రజల్లో ఉంది. పైగా విభజన సమస్యల పరిష్కారం, రాష్ట్ర సమస్యల ప్రస్తావన ఒక్కటి కూడా ప్రధానమంత్రి నోటి నుంచి రాలేదు. ఇదంతా చూస్తుంటే జగన్ కు, ప్రధాన మంత్రికి మధ్య అండర్ స్టాండింగ్ ఉందనే వాదన పూర్తి స్థాయిలో తెరపైకి వచ్చింది.

రాష్ట్రాన్ని గాలికొదిలేస్తారా?

రాష్ట్రంలో బోలెడు సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా మూడు ప్రాంతాలకు ప్యాకేజీలు, ప్రాజెక్టులకు నిధులు, రైల్వే జోన్ ఏర్పాటు పనులు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, తీర ప్రాంతంలో పోర్టుల నిర్మాణాలు, కేంద్ర ప్రభుత్వ విద్య, వైద్య సంస్థలు ఏర్పాటు చేయాలి. దీనిపై ఒక్క మాట కూడా ప్రధాన మంత్రి మాట్లాడకుండా ఓట్లు ఎలా అడుగుతారనేది పలువురి ప్రశ్న. అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా ఈ విషయంలో విఫలమైంది. పాము చావకుండా.. కర్ర విరగకుండా అన్న సామెత గుర్తుకు వచ్చేలా పాలకులు వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు.

కేంద్రంలో, రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయనడానికి వైఎస్సార్సీపీ, బీజేపీ వ్యవహారం ఒక ఉదాహరణ అని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కెవివి ప్రసాద్ అన్నారు. ఆయన ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతూ ఏపీలో అధికార పార్టీ అయిన వైఎస్సార్సీపీని ప్రధాన మంత్రి మోదీ విమర్శించలేదు. వైఎస్ జగన్ కూడా ప్రధానమంత్రిని విమర్శించడం లేదు. అంటే రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నట్లేనని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకుంటే నాయకులు సక్సెస్ అవుతారని, లేకుంటే ప్రజలు తిరస్కరిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.


Tags:    

Similar News