ఒకటో తేదీన జీతాలు వేశారా?
కూటమి ప్రభుత్వ తీరును జగన్ ఎండగట్టారు. ఉద్యోగులు, వాలంటీర్లను ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు.;
తాము అధికారంలోకి వస్తే నెలలో మొదటి తేదీనే ఉద్యోగులకు జీతాలేస్తామని చెప్పారు.. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఉద్యోగులకు ఏ నెలలో అయినా ఒకటో తేదీన జీతాలు వేశారా? ఏ నెలలో ఒకటో తేదీన జీతాలు వేశారో చెప్పాలని సీఎం చంద్రబాబును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక కొత్త ఉద్యోగాల్లేవు. ఉన్న వలంటీర్లను తీసేశారు. ఎన్నికల ముందు రూ. 10వేలు ఇస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని తొలగించారు. 2.60లక్షల వలంటీర్లను తొలగించారు.
బేవరేజెస్‌లో ఉన్న మరో 18వేల ఉద్యోగాలను తీసేశారు. ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశారు. ఏ నెలలో కూడా 1వ తేదీన జీతాలు వేయలేదు. పీఆర్సీ చైర్మన్‌ను బలవంతంగా రాజీనామా చేయించి తొలగించారు. ఐఆర్ పేరుతో మోసం చేశారు. ఉద్యోగులకు మూడు డీఏలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఉద్యోగుల జీఎస్‌ఐ, జీపీఎఫ్‌లను కూడా వాడేసుకుంటున్నారు. ఆర్థిక విధ్వంసం అంటే ఇది. అని కూటమి ప్రభుత్వం మీద, సీఎం చంద్రబాబుపైన జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
గురువారం ఆయన తాడేపల్లి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నిక ముందు ఇచ్చిన ఉద్యోగ హామీలు ఏమయ్యాయని జగన్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ 9 నెలల కాలంలో బాబు ష్యూరిటీ.. చంద్రబాబు మోసానికి గ్యారెంటీ అని రుజువైందని జగన్ ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ అమలు చేయక పోతే చొక్కా పట్టుకోండని చెప్పారు. అలా చొక్కా పట్టుకునే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.