సినిమా చెట్టు విషయంలో చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారా..!

‘చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం ఏముంది.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది’ అన్న నానుడిని గోదావరి గట్టున ఉన్న సినిమా చెట్టు వ్యవహారం వాస్తవం చేస్తోంది.

Update: 2024-08-09 09:20 GMT

‘చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం ఏముంది.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది’ అన్న నానుడిని గోదావరి గట్టున ఉన్న సినిమా చెట్టు వ్యవహారం వాస్తవం చేస్తోంది. గోదావరి గట్టున ఉన్న ఈ చెట్టు కొన్నేళ్లుగా కోతకు గురవుతూనే ఉంది. కానీ ఎవరూ దీని యోగక్షేమాల గురించి పట్టించుకోలేదు. ఆఖరికి ప్రభుత్వం అందించిన పుష్కర నిధులతో కూడా అరాకొరా పనులే చేసి అధికారులు చేతులు దులిపేసుకున్నారని స్థానికులు చెప్తూనే ఉన్నారు. అలాగని ఊరికి కేరాఫ్‌గా ఉన్న ఈ చెట్టును కాపాడుకోవడానికి ఊరివాళ్లు ఏమైనా చేశారా అంటే అదీ శూన్యమే. కానీ ఇప్పుడు చెట్టు నేలకొరిగిన తర్వాత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అంటున్నారు.

ఎవరూ పట్టించుకో లేదే..!

చెట్టు ఉన్నంత కాలం.. దాంతో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయంటున్న స్థానికులు కానీ.. ఎన్నో సినిమాలు చిత్రీకరించిన.. ఆ చెట్టు ఉంటే సినిమా హిట్టు అనుకున్న నిర్మాతలు, దర్శకులు కానీ చెట్టును కాపాడుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చెట్టు నేలకొరిగిన తర్వాత అంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దర్శక రచయిత వంశీ కూడా నేలకొరిగిన గోదారిగట్టుపైన చెట్టును చూడటానికి అక్కడకు వెళ్లారు. ఆయన పర్యటన నేపథ్యంలోనే ఈ వాదనలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికి కూడా ఈ చెట్టును బతికించడానికి తన వంతు సహాయం చేస్తానని మాత్రం చెప్పట్లేదని వంశీని ఉద్దేశించి పలువురు అంటున్నారు. ఇంతకీ ఆయన అక్కడ ఏమన్నారంటే..

ఈ చెట్టంటే ప్రాణం..

సినిమా చెట్టు..కుమారదేవంలోని ఈ చెట్టుతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని ఆయన చెప్పారు. ఈ చెట్టు కూలిపోయిందన్న వార్తను మనసు భరించలేకుందని భావోద్వేగానికి లోనయ్యారు. కుమారదేవం చేరుకున్న వెంటనే ఆయన చెట్టు దగ్గరకు పరుగులాంటి నడకతో వెళ్లారు. అక్కడ నేలకొరిగిన సినిమా చెట్టును చూసి నిర్ఘాంతపోయారు. కాసేపు అలానే ఉండిపోయిన ఆయన తేరుకుని.. ఈ చెట్టుతో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయంటూ గతాన్ని నెమరేసుకున్నారు. ఎన్నో సినిమాల షూటింగ్‌ను అక్కడే చేశానని చెప్పుకొచ్చారు. అనంతరం అక్కడ చెట్టు పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్న రోటరీక్లబ్ ప్రతినిధులు, ప్రవాసాంధ్రులు, స్థాకులతో మాట్లాడారు. ఆ చెట్టంటే తనకు ప్రాణం అని ఆయన చెప్పారు.

చెట్టు బతికితే మళ్ళీ సినిమా తీస్తా..

రోటరీక్లబ్ వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని, మళ్ళీ గోదావరి గట్టున నిద్రగన్నేరు చెట్టు పచ్చగా కళకళాడాలని ఆయన కోరుకున్నారు. ‘‘ఈ చెట్టును బతికించడానికి చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రయత్నం ఫలించాలి. ఒకవేళ అదే జరిగిన చెట్టు మళ్ళీ యథాస్థితికి వస్తే నాకన్నా సంతోషపడే వారు మరొకరు ఉండరు. అంతేకాక చెట్టు చిగురించిన తర్వాత ఇక్కడ అధిక నిడివితో ఓ సినిమాను చేస్తాను. ఈ చెట్టుకు వాస్తవంలోనే కాకుండా.. సినిమాలో కూడా సెకండ్ ఇన్నింగ్స్‌ను అవకాశం కల్పిస్తా’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ చెట్టు తన సినిమాల్లోనే కాకుండా రచనల్లో కూడా చాలా కీలక పాత్ర పోషించదని కూడా ఆయన చెప్పారు.

ఆ నవలకు ఈ చెట్టే స్ఫూర్తి..

‘‘కుమారదేవం చెట్టుపై ఉన్న ఇష్టంతోనే ‘గోకులంలో రాధ’ నవల రాశాను. ఆ నవల కథ ఎక్కువ శాతం కుమారదేవం ఉళ్లోనే నడుస్తుంది. ఈ చెట్టు పరిసరాలే ప్రధానంగా సంఘటనలు ఉంటాయి. కుమారదేవం ఊరు ఎక్కడుందనేది పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఈ చెట్టు వల్లే ఈ ఊరుక ఖ్యాతి వచ్చింది. ఇప్పటి వరకు నేను 18 సినిమాల్లో ఈ చెట్టును ఎన్నో విధాలు చూపించాను. ఈ చెట్టు కింద భోజనం చేయడం ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది. సితార, ప్రేమ అండ్ కో, సరదాగా కాసేపు, గోపి గోపిక గోదావరి సినిమాల షూటింగ్‌లను కూడా ఇక్కడ చిత్రీకరించాం’’ అని ఆయన చెప్పారు.

ఇప్పటికీ అందని సాయం..

‘‘ఇన్నాళ్లూ చెట్టు ఉంటే దాని బాగోగులు పట్టించుకున్న వారు లేరు. ఇప్పుడు నేలకొరిగడంతో అంతా మాట్లాడుతున్నారు. ఎంతో కాలంగా చెట్టు కొతకు గురవుతున్న విషయం స్థానికులు, అధికారులు అందరికీ తెలిసిన విషయమే. కానీ అందరూ మాకెందుకులే అన్న విధంగానే ఉన్నారు. ఇప్పుడు మాత్రం చెట్టుపై ఎక్కడలేని ప్రేమ వొలకబోస్తున్నారు. ఇన్నాళ్లూ చెట్టుకు ఏమవుతున్నా మాకెందుకులే అనుకున్నారు. సినీ పరిశ్రమ ఇప్పటికి కూడా సరిగా స్పందించడం లేదు. వంశీ మాత్రమే వచ్చి.. ఇక్కడ చెట్టును చూశారు. చెట్టు బతికితే సినిమా తీస్తానని, చెట్టుతో తనకు ఎనలేని బంధం ఉందన్న ఆయన.. ఇన్నాళ్లూ చెట్టును ఎందుకు పట్టించుకోలేదో మాత్రం చెప్పట్లేదు. ఏది ఏమైనా.. ఎవరు ఎంత చెప్పినా.. దేని విలువైనా అది అందుబాటులో ఉన్నంత వరకు తెలియదు.. అది లేని రోజునే అందరికీ దాని విలువ తెలిసి వస్తుంది’’ అంటూ అక్కడి స్థానిక వ్యక్తి.. ఉక్రోశం వ్యక్తం చేశారు. ఇప్పటికి కూడా ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రావడం లేదని, రోటరీక్లబ్ వారు ఒక్కరే ఆ చెట్టుకు ఏదో చేయాలని తాపత్రయ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News