ఉత్తరాంధ్ర వైసీపీలో ఇంటి కుంపటి....

వైసీపీ అధిష్టానం సీట్లు ఖరారు చేసినా అభ్యర్థులకు పాట్లు తప్పడం లేదు. ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు...?;

Update: 2024-03-20 11:32 GMT
Source: Twitter

(తంగేటి నానాజీ)


విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అధికారపక్షంలో ప్రతిపక్షం తయారైంది... సీట్లు దక్కించుకొని ఎన్నికల బరిలోకి దిగిన ముఖ్య నేతలను సైతం అసమ్మతి వర్గం టార్గెట్ చేసింది. ఈ అసంతృప్తి వాదులను బుజ్జగించేందుకు అధిష్టానానికి తల ప్రాణం తోకకొస్తోంది. పరిస్థితులను చక్కదిద్దేందుకు వైసీపీ ముఖ్య నేతలను రంగంలోకి దించింది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తులు వెలుగులోకి వస్తున్నాయి. అసమ్మతి నేతలు కొందరు రాజీనామాలు చేస్తుండగా... మరికొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇంకొందరు బహిరంగంగానే పార్టీని, అభ్యర్థులను విమర్శిస్తున్నారు. ఉత్తరాంధ్రలో రాష్ట్ర మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు కూడా అసమ్మతి వర్గ బాధితులుగా మారారు.


మంత్రి అమర్‌కు అసమ్మతి సెగ...

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు పార్టీ అధిష్టానం ఎట్టకేలకు గాజువాక టికెట్టు కేటాయించింది. దీంతో అక్కడ అసమ్మతి సెగలు రేగాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల  నాగిరెడ్డి, మాజీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉరుకుటి చందు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరిచారు. అమర్నాథ్ తొలిసారిగా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి కూడా వీరు హాజరు కాలేదు. దీంతో రంగంలోకి దిగిన అధిష్టానం ఎమ్మెల్యే నాగిరెడ్డిని ఉమ్మడి విశాఖ డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్‌గా నియమించి శాంతింప చేశారు. ఉరుకూటి చందుకు కూడా నామినేటెడ్ పోస్ట్ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ముగ్గురిని సమన్వయపరిచి ఎన్నికల్లో కలిసి పనిచేసే విధంగా అధిష్టానం సర్దిచెప్పింది.

విశాఖ దక్షిణంలో...

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌కు కూడా అసమ్మతి సెగ తగిలింది. వాసుపల్లి అభ్యర్థిత్వాన్ని పలువురు కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాసుపల్లికి టికెట్ ఇవ్వొద్దంటూ నియోజకవర్గంలో పోస్టర్లు వెలిశాయి. మత్స్యకార నేత వాసుపల్లి జానకిరామ్‌కు ఈ టికెట్ కేటాయించాలంటూ ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఇక విశాఖ తూర్పు , ఉత్తర నియోజకవర్గాల్లో కూడా ఏర్పడ్డ అసమ్మతిని చక్కదిద్దే పనిలో అధిష్టానం ఉంది.

సిక్కోలులో కూడా ఇదే సీను....

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇదే సీను నడుస్తుంది. ఆముదాలవలస నియోజకవర్గంలో స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యర్థిత్వాన్ని నిరసిస్తూ పొందూరుకు చెందిన సీనియర్ నేత సువ్వాడ గాంధీ రాజీనామా చేశారు. జిల్లా గ్రంథాలయ చైర్‌పర్సన్ సువర్ణ కూడా అదే బాటలో నడిచారు. కొత్తకోట బ్రదర్స్, చింతాడ రవికుమార్ వర్గీయులు తమ్మినేనిని వ్యతిరేకిస్తున్నారు. ఇక పలాస నియోజకవర్గంలో మంత్రి సిదిరి అప్పలరాజు అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గంలోని కీలక నేత దువ్వాడ శ్రీకాంత్ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే అప్పలరాజును వ్యతిరేకిస్తూ సీనియర్ నేత హేమ బాబు చౌదరి పార్టీని వీడారు. ఇచ్చాపురంలో విజయ, టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్, పాతపట్నంలో రెడ్డి శాంతి అభ్యర్థిత్వాలను వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు రచ్చకెక్కుతున్నారు. అసమ్మతినేతలను బుజ్జగించేందుకు వైవీ సుబ్బారెడ్డి, మజ్జి శ్రీనివాసులు రంగంలోకి దిగారు.

విజయనగరంలో...

విజయనగరం జిల్లా వైసీపీలో అసంతృప్తి సెగలు రేగుతూనే ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రరావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం వైసీపీ నేత అవనాపు విజయ్ నిరసన ర్యాలీ చేసి పార్టీ నుంచి వైదొలగారు. వైసీపీ సీనియర్ నేత కాళ్ల గౌరీ శంకర్ తాజాగా కోలగట్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. సొంత పార్టీలోనే మరి కొందరు నేతలు ఈయనను వ్యతిరేకిస్తున్నారు. ఇదే జిల్లాలో ఎస్ కోట నియోజకవర్గంలో కూడా అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. కడుపుండు శ్రీనివాసరావు అభ్యర్థత్వాన్ని పలువురు వైసీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.

రంగంలోకి దిగిన అధిష్టానం...

ఉత్తరాంధ్ర జిల్లాల్లో రేగుతున్న అసంతృప్తి జ్వాలలను చల్లార్చడానికి పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. నియోజకవర్గాల అసంతృప్తి పంచాయితీలు అధిష్టానం దృష్టికి చేరడంతో వీటిని సరి చేసేందుకు ముఖ్య నేతలను పంపింది. అసంతృప్తి నేతలతో మాట్లాడి ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులను చక్కదిద్దే పనులను వీరికి అప్పగించింది. ఈ నేతలు ఎన్నికల సమయానికి అంతా చక్కదిద్దే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎందుకీ పరిస్థితి

వైసీపీలో  మొదలయిన ఒక తరహా రాజకీయ సంస్కృతియే దీనికి కారణమని సీనియర్ పాాత్రికేయుడు వి.వి రమణ మూర్తి వ్యాఖ్యానించారు.

వైసీపీలో జగన్ తో పాటు ఎమ్మెల్యేలు కూడా ఈ ఐదేళ్లలో సొంత పార్టీ నేతలకు, కార్యకర్తలకు విలువ ఇవ్వలేదని. అందుకే ఆశావహులను పక్కనపెట్టి ఎక్కడైతే సిట్టింగులకు అవకాశం ఇచ్చారో అక్కడే ఎక్కువ వ్యతిరేకత వ్యక్తం అవుతుందని ఆయన అన్నారు.

" ఈ విధంగా ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలలో పెల్లబుకుతున్ననిరసన పార్టీలో తమకు గౌరవం దక్కలేదన్న అసంతృప్తి నుంచి వచ్చిందే," అని రమణమూర్తి అన్నారు.

Tags:    

Similar News