రోజా నామినేషన్ కి పార్టీ పెద్దలు ఎందుకు ముఖం చాటేశారు?

కుటుంబ సభ్యులు, స్టార్ క్యాంపెయినర్ వెంట రాగా, హ్యాట్రిక్ లక్ష్యంగా రోజా నామినేషన్ దాఖలు చేశారు. అసమ్మతి నేతలు గైర్హాజరయ్యారు.

Update: 2024-04-20 03:39 GMT

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: ఓ స్టార్ క్యాంపెయినర్ హాజరయ్యారు. కుటుంబ సభ్యులు వెంట నడిచారు. నగరి అసెంబ్లీ స్థానానికి మంత్రి ఆర్కే రోజా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట, నియోజకవర్గంలోని తిరుగుబాటు, అసమ్మతి వర్గ నాయకులు, వారి విధేయులు అనుచరులు కనిపించలేదు.

నామినేషన్ వేయడానికి వెళ్లే ముందు ఆమె నగరి వినాయక స్వామి ఆలయంలో పూజలు చేశారు. హాజరైన కార్యకర్తలతో ఆమె ఉల్లాసంగా ఉన్నట్లు కనిపించడానికి ప్రయత్నించారు. 2019, 2014 ఎన్నికల నాటి సహకారం, ఉత్సాహం కనిపించలేదు అని పూర్వ నామినేషన్ల ఘట్టాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, హాజరు కావడం ఉపశమనంగా భావిస్తున్నారు.

 ప్రత్యేక ఆకర్షణగా.. బైరెడ్డి

నగరి నియోజకవర్గం నుంచి మంత్రి ఆర్కే రోజా నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈయనతో సెల్ఫీలు తీసుకోవడానికి చాలామంది ప్రత్యేక ఆసక్తి కనబపరిచారు. రోజా వెంట వచ్చిన భర్త సెల్వమణి, కుమారుడు కౌశిక్, సోదరులు కుమారస్వామి రెడ్డి, రాంప్రసాద్ రెడ్డితో కలిసి నగరి పుదుపేట వద్ద ఉన్న వినాయక స్వామి ఆలయం వద్ద పత్రాలపై ఆర్కే రోజా సంతకాలు చేశారు. అనంతరం ఆలయంలో పూజలు చేసి ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు.

ముఖం చాటేసిన నేతలు

మొదటి నుంచి రోజా అభ్యర్థిత్వాన్ని నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు, కొందరు స్థానిక సంస్థల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆర్కే రోజా నామినేషన్ కార్యక్రమానికి తిరుగుబాటు నాయకులు అందరూ ముఖం చాటేశారు. మొదటినుంచి కీలక సహకారం అందించిన వారిలో నిండ్ర మండల పార్టీ నాయకుడు, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డిని స్వయంగా కలిసి మాట్లాడడానికి మూడు రోజులుగా ఆర్కే రోజా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అని తెలిసింది. " గడిచిన మూడు రోజుల్లో ఎన్నిసార్లు నిండ్ర మండలంలోని చక్రపాణి రెడ్డి ఇంటికి వెళ్లినా .. ఆయన లేడనే సమాధానం వచ్చింది" అని రోజా అనుచరులు చెబుతున్నారు. పనులు కల్పించుకున్న ఆయన పలమనేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెంకట గౌడ నామినేషన్ కార్యక్రమానికి హాజరైనట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

 ఆర్కే రోజా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం, ఆమె ఓటమికి తమ బాధ్యత కాదని బహిరంగంగా చెప్పిన వారిలో.. ప్రధానంగా నగరి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కేజే శాంతి, ఆమె భర్త కేజే కుమార్, మండలం నాయకుడు, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, విజయపురంలో లక్ష్మీపతి రాజు, వడమాల పేట జెడ్పిటిసి సభ్యుడు మురళీధర్ రెడ్డి, పుత్తూరు మున్సిపల్ నేత ఏలుమలై (అమ్ములు) ఆర్కే రోజా నామినేషన్ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఊర్లో ఉండే కొందరు మరో ప్రాంతానికి వెళ్లడం ద్వారా ఇంకొందరు ముఖం చాటేశారని వైఎస్సార్సీపీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. భర్త సెల్వమణి, సోదరుల మితిమీరిన జోక్యం వల్లే.. మండలాల్లో ప్రభావితం చేయగలిగిన నాయకులతో ఎమ్మెల్యే ఆర్కే రోజాకు సఖ్యత లేకుండా పోయిందనేది నియోజకవర్గంలో చెబుతున్న మాట.

పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించిన అసమ్మతినేతలు అందరూ మంత్రి పెద్దిరెడ్డికి సన్నిత విధేయులనేది బహిరంగ సత్యం. వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా 2014లో ఆర్కే రోజా పోటీ చేసే సమయంలో.. అందరి నివాసాలకు వెళ్లి మాట్లాడడం ద్వారా వారి కుటుంబ సభ్యులు ఒకరయ్యారు. అందులో ప్రధానంగా రెడ్డివారి చక్రపాణి రెడ్డిని ప్రస్తావించవచ్చు. మిగతా నాయకులకు కూడా పార్టీ పైన గౌరవం, తమ ఆధిపత్యాన్ని కూడా చాటుకోవాలని ఆర్కే రోజాకు సంపూర్ణ సహకారం అందించారు.

ఆ తరహాలోనే 2024 ఎన్నికలకు సమాయుత్తమైన ఆర్కే రోజా, తిరుగుబాటు దారులను కలవడం, నష్ట నివారణ చర్యలకు చొరవ తీసుకోవడంలో బింకంగా వ్యవహరించారనేది పార్టీ వర్గాల సమాచారం. తాము కూడా ఏమాత్రం తగ్గేది లేదని అసమ్మతి వర్గ నేతలు భీష్మించారు. రెండు పక్షాల నుంచి ఎవరికి వారు పరిమితం కావడం వల్ల అంతిమంగా మంత్రి ఆర్కే రోజాకు ఎఫెక్ట్ పడే పరిస్థితి అనివార్యమైంది.

 అందరూ కలిస్తెనే అంతంత మెజారిటీ

వైయస్సార్సీపి నియోజకవర్గ నేతలందరి సహకారంతో ఆర్కే రోజా నగరిలో రాజకీయ దిగ్గజాలను ఎదుర్కొన్నారు. ఒకపక్క కాంగ్రెస్ నుంచి రెడ్డివారి చెంగారెడ్డి, టిడిపి నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడుని ఢీకొట్టారు. ఇప్పుడు వారిద్దరూ లేకపోవచ్చు. నాయకులందరూ సహకరిస్తేనే, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా 2014లో 858 అత్తేసరు ఓట్లతో గెలుపొందారు. 2019లో 2,007 ఓట్లతో ఆర్కే రోజా గట్టెక్కారు.

ప్రస్తుతం కీలక నాయకులందరూ దూరంగా ఉన్నారు. దీంతో ఆర్కే రోజా సహాయ నిరాకరణ ఎదుర్కొంటున్నారు. ఈ ఎన్నికలు అధికార, ప్రతిపక్షానికి జీవనమరణ సమస్య అని చెప్పడంలో సందేహం లేదు. అమలు చేసిన పథకాలు బటన్ నొక్కుడు కార్యక్రమంతో లబ్ధి పొందిన పేదలు అండగా నిలుస్తారని వైఎస్ఆర్సిపి అధినాయకత్వం భావిస్తోంది. ఇవన్నీ జరిగినా ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ అనేది కీలకం. నాయకులు ధైర్యంగా ఉండి ప్రోత్సహిస్తేనే పార్టీ శ్రేణులు కూడా ముందుకు సాగుతాయి. నగరిలోని తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో హ్యాట్రిక్ కోసం పరితపిస్తున్న ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందనేది పోలింగ్ తర్వాత మాత్రమే తేలనుంది.

Tags:    

Similar News