వినోదం కోసం వక్రీకరించారు

హైందవ శంఖారావం సభకు పెద్ద ఎత్తున ప్రజలు, హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక, సేవా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.;

Update: 2025-01-05 15:12 GMT

హైందవ ధర్మంపై సినిమాల్లో దాడి జరుగుతోందని, వాల్మీకి రామాయణం, వ్యాస భారతం, భారత వాజ్మయానికి రెండు కళ్లులాంటివని, వినోదం కోసం అలాంటి వాటిని వక్రీకరించారని ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ అన్నారు. హైందవ శంఖారావం గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద విశ్వ హిందూపరిషత్‌(వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. అనంత శ్రీరామ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. హిందూ ధర్మాన్ని హననంచేసే సినిమాలను ప్రతి ఒక్కరూ బహిష్కరించాలని, అలా చేసినప్పుడే వక్రీకరించే సినిమాలకు డబ్బులు రావని.. డబ్బులు రాకపోతే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను తీయడానికి నిర్మాతలు ముందుకు రారని అనంత శ్రీరామ్‌ అన్నారు. పురాణాలు ఇతిహాసాల ఔన్నత్యాన్ని తగ్గించే విధంగా సినిమాల్లో పాత్రలు మార్చేస్తున్నారని అన్నారు.

సినీ పరిశ్రమలో జరిగే తప్పులను అదే రంగానికి చెందిన వ్యక్తిగా బాహాటంగానే విమర్శలు చేస్తన్నానని, ఇప్పటి వరకు సినిమాల్లో జరిగిన హైందవ ధర్మ హననానికి హిందూ సమాజానికి క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. కృష్ణా జిల్లాకు చెందిన సినీ దర్శకులు, సినీ నిర్మాతలే హైందవ ధర్మంపై జరుగుతున్న పొరపాట్లను చెప్పక పోతే ఎలా? అని ప్రశ్నించారు. సినిమాల్లో పాత్రలను మార్చేస్తే హైందవ ధర్మాన్ని ఆచరించినట్లు, పాటించినట్లు కాదని పేర్కొన్నారు. నిండు సభలో ద్రౌపది వస్త్రాన్ని తీస్తున్నా మౌనంగా ఉన్న కర్ణుడు ఎలా గొప్పవాడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఆలయాలకు ఆత్మగౌరవం పెంపొందించడం కోసం భారీగా హిందువులు ఈ కార్యక్రమానికి తరలి రావడం సంతోషంగా ఉందన్నారు. గత ఐదేళ్లల్లో హైందవ ధర్మంపై విపరీతమైన దాడి జరిగిందని రాజమండ్రి ఎంపీ, ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ధ్వజమెత్తారు. గత జగన్‌ ప్రభుత్వం తీరు వల్ల హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయన్నారు. వీహెచ్‌పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ హైందవ శంఖారావం సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు, హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక, సేవా సంఘాల ప్రతినిధులు, పీఠాధిపతులు భారీగా తరలి వచ్చారు.

Tags:    

Similar News