అమరావతిలో జంగిల్ తొలగింపు ఖర్చు ఎన్ని కోట్లో తెలుసా?

రాజధాని అమరావతి ప్రాంతంలో పెరిగిన పిచ్చిచెట్లు తొలగించేందుకు ఖర్చు ఎంత పెడుతున్నారో అంత కంటే నాలుగు కోట్లు ఎక్కువతో ప్రభుత్వ భవనాలు, రోడ్లు నిర్మిస్తున్నారు.

Update: 2024-08-07 10:02 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరాతిలో పిచ్చి చెట్లు (జంగిల్‌ క్లియరెన్స్‌) తొలగింపు ఖర్చు వింటే కళ్లు తిరుగుతాయి. అమరావతిలో ప్రభుత్వ భవనాలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేస్తున్నది జంగిల్‌ క్లియరెన్స్‌ ఖర్చుకంటే నాలుగు కోట్లు మాత్రమే ఎక్కువ. అయితే జంగిల్‌ క్లియరెన్స్‌ లేకుండా నిర్మాణాలు చేపట్టడం కూడా సమస్యగానే చెప్పొచ్చు. అమరావతిలో నిర్మాణాలు చేపట్టడమంటే డబ్బుతో చెలగాటమని పలువురు నిర్మాణ రంగ నిపుణులు వ్యాఖ్యానించడం విశేషం. 2019కి ముందు కూడా చాలా వరకు పిచ్చిచెట్లు పెరిగే ఉన్నాయి. అయితే ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాల ప్రాంతంలో మాత్రం చెట్లు తొలగించారు. ఇప్పుడు అమరావతి నిర్మాణాల వేగం పెంచారు. సచివాలయంతో పాటు అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవన నిర్మాణాలు వెనువెంటనే చేపట్టనున్నారు. ఇప్పటికే నిర్మాణరంగ నిపుణులు ఈ ప్రాంతంలో పర్యటించి గతంలో వేసిన బేస్‌మెట్స్, ఇతర నిర్మాణాలపై నివేదికలు తయారు చేశారు. ప్రాథమికంగా పరిస్థితిని పాలకులకు వివరించారు. వివరణాత్మకంగా నివేదికను ఒకటీ రెండు రోజులుల్లో ఇస్తారని మునిసిపల్, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి పి నారాయణ బుధవారం చెప్పారు. జంగిల్‌ క్లియరెన్స్‌ పనులను ఆయన ప్రారంభించి మీడియాతో మాట్లాడారు.

Delete Edit
జంగిల్‌ క్లియరెన్స్‌కు...
అమరాతిలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులను నాగార్జున కనస్ట్రక్షన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ టెండరు ద్వారా చేజిక్కించుకుంది. ఈ పనులకు బుధవారం రాష్ట్ర మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు. జంగిల్‌ క్లియరెన్స్‌ పనుల విలువ రూ. 36.5కోట్లు. పనులు టెండరు ద్వారా చేపట్టిన ఎన్‌సీసీ సంస్థ నెల రోజుల్లో పూర్తిగా అమరావతి ప్రాంతంలో పిచ్చి చెట్లు లేకుండా తొలగించాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల పంటలు కూడా ఉన్నాయి. ఐదేళ్లుగా పాలకులు పట్టించుకోనందున భూమి యజమానులు పంటలు వేసుకున్నారు. అరటి, పశువుల గడ్డి, పసుపు, క్యారెట్, ముళ్లంగి వంటి పంటలు పండించారు. మొత్తం అమరావతి విస్తీర్ణం 58వేల ఎకరాలు. అందులో పూర్తిగా పిచ్చి చెట్లతో నిండిన భాగం 23,429 ఎకరాలు ఉన్నట్లు అధికారులు నిర్థారించారు. ప్రస్తుతం ఈ భూ విస్తీర్ణంలో పిచ్చిచెట్లు తొలగించే కార్యక్రమాన్ని ఎన్‌సీసీ చేపట్టింది.
ప్రభుత్వ భవనాలు, రోడ్ల నిర్మాణాల కోసం...
అమరావతిలో ప్రభుత్వ భవనాలు, రహదారుల నిర్మాణాలకు రూ.41.484 కోట్లు ఖర్చు చేసేందుకు అధికారులు ప్రణాళిక తయారు చేశారు. ఈ ప్రతిపాదనల ప్రకారం భవనాలు, రోడ్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని రోడ్లు, కొన్ని భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి. అవన్నీ పూర్తిస్థాయిలో నిర్మించాల్సి ఉంది. అమరావతి ప్రాంతంలో లూజు సాయిల్‌ కావడం, కొన్ని చోట్ల బంకమన్ను ఉండటం వల్ల చప్టాలు, వంతెనలు నిర్మించాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ప్రధానమైన రహదారులు జాతీయ రహదారికి అనుసంధానిస్తూ నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాలకు ఎక్కువ ఖర్చు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. విచిత్రమేమిటంటే రాజధాని ప్రాంతంలో పిచ్చిచెట్లు తొలగించేందుకు భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సి రావడం. ప్రభుత్వ నిర్మాణాలతో సమానమైనంత డబ్బును జంగిల్‌ క్లియరెన్స్‌కు ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Tags:    

Similar News