ఎపి సీఎం ఇంటి ముందు పొలాల్లో ఏమి జరుగుతుందో తెలుసా?
సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి ముందు క్రిష్ణా కరకట్ట పక్క పొలాల్లో ఏమి జరుగుతోంది. ఈ భూములు రాజధానకి ఉండవల్లి రైతులు ఎందుకు ఇవ్వలేదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటికి 150 మీటర్ల దూరం. కృష్ణా కరకట్టకు ఉత్తరం వైపున సీఎం గారి ఇల్లు. దక్షిణం వైపున తోటలు. ఏంటిది అనుకుంటున్నారా? అవును చంద్రబాబు ఇంటికి ఎదురుగా అమరావతిలో రాజధానికి పొలాలు ఇవ్వని రైతులు పంటలు వేస్తున్నారు. కొన్ని అరటి తోటలు ఉన్నాయి. మరికొన్ని పూల తోటలు, పసుపు, కంద తోటలు ఉన్నాయి. నేను నా మిత్రుడు కుమార్‌తో కలిసి బైకుపై ఉండవల్లి నుంచి చంద్రబాబు ఇంటి ముందు రోడ్డు మీదుగా సెక్రటేరియట్‌కు వెళుతున్నాం. చాలా మంది కూలీలు చంద్రబాబు ఇంటికి ఎదురుగా ఉన్న పొలంలో నాట్లు వేస్తూ కనిపించారు. చంద్రబాబు ఇంటి ముందు అరటి తోటలు ఉన్నాయి. ఇదేమిటి నాట్లు వేస్తున్నారు... చూద్దామని బైకు రోడ్డపై పక్కకు తీసి ఆపి దగ్గరికి వెళ్లాం. ఉల్లి నారు నాటే పనిలో కూలీలున్నారు. మగ కూలీలు మడులకు నీళ్లు కడుతూ దమ్ముచేసి చెంగత్తు కొడుతున్నారు. ఆడవాళ్లు ఉల్లి నారు నాటు తున్నారు. ఆ పనులు చూడగానే ముచ్చటేసి ఫొటోలు తీసుకున్నాం.