ఆ విషయంలో పవన్ కల్యాణ్‌ను ఆదర్శంగా తీసుకుంటారా?

పవన్‌ కల్యాణ్‌ ఏది చేసినా స్పెషల్‌గానే ఉంటుంది. అతని చదవు, క్వాలిఫికేషన్‌లే కాదు, జీతం విషయం కూడా బహిరంగంగా చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచారు.

Byline :  The Federal
Update: 2024-07-05 07:10 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితుల రీత్యా ఉప ముఖ్యమంత్రిగా కానీ, మంత్రిగా కానీ, ఒక ఎమ్మెల్యేగా కానీ జీతం తీసుకోకూడదనే ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నిర్ణయం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. పవన్‌ కల్యాణ్‌ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర ప్రభుత్వ పెద్దలు కూడా ఇదే బాటలో నడవ గలిగితే కొంత మేరకు ఆర్థిక భారం నుంచి బయట పడేందుకు అవకాశం ఉంటుందనే టాక్‌ వినిపిస్తోంది. దీంతో పాటుగా ఆయన చదువు, క్వాలిఫికేషన్‌ అంశాలు కూడా బహిరంగా చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచారు. తన చదువు ఇంటర్‌తోనే ఆగి పోయిందని, డిగ్రీ కానీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌ చదువుకొని ఉండి ఉంటే అది ఇప్పుడు ఉపయోగపడి ఉండేదని, తన శాఖల ఫైళ్లను ఇంకా సులువుగా అర్థం చేసుకునే అవకాశం ఉండేదని ఇటీవల పిఠాపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో అందరి ముందు చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు. సహజంగా ఇలా ఏ మంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ చెప్పిన దాఖలాలు లేవనే చెప్పొచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ నాయకుల్లో పవన్‌ కల్యాణ్‌ భిన్నత్వాన్ని తొలి నుంచి ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఇటీవల కొలువు దీరిన ప్రభుత్వంలో ఆయనకు డిప్యూటీ సీఎంతో పాటు మరి కొన్ని మంత్రిత్వ శాఖలు కేటాయించారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన ఎమ్మెల్యేకు ఎంత జీతం ప్రభుత్వం ఇస్తుందో అంత మొత్తాన్ని తీసుకుంటానని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జీతం మీద ఆయన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఆయనకు కేటాయించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్న సందర్భంగా జీతం తీసుకోకూడదనే నిర్ణయానికి వచ్చారు. తమ శాఖల్లో ఆర్థిక పరిస్థితి బాగ లేదని, అప్పుల్లో కూరుకొని పోయాయని, నిధులన్నీ దారి మళ్లించారని ఇలాంటి పరిస్థితుల్లో తనకు జీతం తీసుకునేందుకు మనస్కరించలేదని బహిరంగంగానే వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేదని, అప్పుల్లో కూరుకొని పోయిందని కొత్తగా కొలువు దీరిన ఇతర ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారే కానీ పవన్‌ కల్యాణ్‌ మాదిరిగా తాము కూడా జీతం తీసుకోకుండా పని చేస్తామని, ప్రజలకు సేవలు అందిస్తామని, తమ జీతాలు కూడా ప్రభుత్వానికి భారం కాకూడదని, రాష్ట్రం ఆర్థికంగా పుంజుకున్న తర్వాత జీతాలు తీసుకుంటామని బహిరంగంగా చెప్పలేక పోతున్నారనే టాక్‌ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. జీతం విషయంలో పవన్‌ కల్యాణŠ నడిచిన దారిలోనే ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు నడిచినట్లైతే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదర్శవంతమైన ప్రభుత్వంగా చరిత్రలో నిలచిపోతుందనే చర్చ సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులైన వారు కానీ, ఎమ్మెల్యేలుగా గెలుపొందని వారు కానీ ఎక్కువ మంది కోటీశ్వరులే. అధిక శాతం మంది వ్యాపారస్తులు కాగా, ఉన్నత ఉద్యాగాల నుంచి పదవీ విరమణ పొంది రాజకీయాల్లోకి వచ్చిన వారే ఉన్నారు. తరాలకు సరిపడిన సంపద కలిగిన వారే ఉన్నారు. ప్రభుత్వం వారికి చెల్లించే జీత భత్యాలపై ఆధారపడిన వారు లేరనే చెప్పొచ్చు.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో అందరి కంటే అత్యధిక వేతన ముఖ్యమంత్రి అందుకుంటారు. ఎమ్మెల్యేకు అందించే వేతనంతో పాటు ముఖ్మమంత్రి పదవికి అదనంగా వేతనం, అలవెన్సులు అందిస్తారు. అవన్నీ కలిపి నెలకు రూ. 3.35లక్షల వరకు ఉంటుంది. తర్వాత ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అధిక మొత్తంలో వేతనాలు తీసుకునే వారి జాబితాలో ఉంటారు. ఉప ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేగా చెల్లించే వేతనంతో పాటు ఇతర అలవెలన్సులు, అన్నీ కలిపి రూ. 3లక్షల వరకు జీతం చెల్లిసారు. ఇతర మంత్రులందరికీ ఇతే తరహాలోనే వేతనాలు ఉంటాయి. ఇక ఇతర ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వేతనంతో పాటు కలిపి నెలకు రూ. 1.75 లక్షల నుంచి రూ. 2లక్షల వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనిలో ఇంటి అద్దెలు, సిట్టింగ్‌ అలవెన్సులు, టెలిఫోన్‌ అలవెన్సులు, కంటిజెన్సీ, కన్వేయన్స్, సెక్రటటేరియేట్‌ వంటి అలవెన్సులు వంటివి ఉంటాయి. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసన మండలి చైర్మన్, మండలి డిప్యూటీ చైర్మన్, ప్రధాన ప్రతిపక్ష నేత, ప్రభుత్వ చీఫ్‌ విప్, ప్రభుత్వ విప్‌లు, పీఏసీ చైర్మన్‌ వంటి వారికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కంటే అధికంగానే జీత భత్యాలు చెల్లిస్తారు.
Tags:    

Similar News