గర్జించిన స్వరంలో బేలతనం.. దేనికి సంకేతం..!?

"వై నాట్ 175" నినాదంతో సీఎం వైఎస్. జగన్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఎన్నికలు సరిగా జరుగుతాయనే నమ్మకం తగ్గుతోందనే మాటలతో ఆయన స్వరంలో మార్పు వచ్చింది.

Update: 2024-05-07 07:56 GMT

(ఎస్.ఎస్.వి..భాస్కర్ రావ్)

తిరుపతి: ఇక వారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు తుదిఘట్టం పోలింగ్ జరగనున్నది. పోస్టల్ బ్యాలెట్‌లో ప్రతికూల ఫలితం ఉన్నట్లు నింకేతాలు ఉన్నాయి. "రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథరెడ్డిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలి" అని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఆదేశించింది. అదే రోజు మచిలీపట్నం ఎన్నికల ప్రచార సభలో సీఎం వైఎస్. జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి.

"ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం రోజు రోజుకు సన్నగిల్లుతోంది. ప్రజలకు పథకాలు అందకుండా చేస్తున్నారు. ప్రజలకు మంచి జరగకుండా అడ్డుకుంటున్నారు. ఇష్టానుసారం అధికారులను మార్చేస్తున్నారు" అని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల వెనక అంతరార్థం లేకపోలేదనే సందేహాలకు ఆస్కారం కల్పించారు.

"ఆదివారం నుంచి రెండు రోజుల పాటు జరిగిన పోస్టల్ బ్యాలెట్ సమర్పణలో ఉద్యోగుల స్పందన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది" అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియలో ఉన్నప్పటికీ సీఎం జగన్‌కి ఇంటలిజెన్స్ నివేదికలు అందకుండా ఉండే పరిస్థితి లేకపోలేదు. దీనికితోడు ఏరి, కోరి నియమించుకున్న సొంతగడ్డ కడప జిల్లాకు చెందిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల విధులు నుంచి తప్పించడంపై సీఎం జగన్ ఆందోళన చెందినట్లు భావిస్తున్నారు.

 

గర్జించే స్వరంలో.. ఈ మాటలా?

ఈ పరిణామాల నేపథ్యంలో.. ఎప్పుడూ గర్జనలా ఉండే సీఎం వైఎస్. జగన్ మాటల్లో మొదటిసారి బేలతనం, పోలింగ్ సరళిపై ఆందోళన, అభద్రతాభావం ప్రతిధ్వనించాయి. ఇది ప్రతిపక్ష కూటమి నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో కలత చెందారా? ఆ విషయాలన్నీ చెబుతూ, సానుభూతి పొందాలని చూస్తున్నారా? అనే చర్చకు ఆస్కారం కల్పించారు. "బటన్ నొక్కినా పేదలకు సంక్షేమాలు అందకుండా అడ్డుకుంటున్నారు. నగదు బదిలీ కాకుండా అవరోధాలు సృష్టిస్తున్నారు" అని ఆరోపించిన వైఎస్ జగన్ .. గత ఐదేళ్లుగా డిబిటి, నాన్ డిబిటి ద్వారా లబ్ధి పొందిన వారి సానుభూతి సంపాదించాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఉద్యోగులు సమర్పించిన "పోస్టల్ బ్యాలెట్"లో ప్రభుత్వానికి ప్రతికూల స్పందన ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో.. "టిడిపి కూటమికి ఓటు వేస్తే ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలు లేకుండా పోవచ్చు" అని ఆరోపించిన సీఎం వైఎస్. జగన్ ఇప్పటివరకు లబ్ధిపొందిన అభిమానం చూరగొనడానికి ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాష్ట్రంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదుల నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. అప్పటి నుంచి రెండు రోజుల క్రితం వరకు ఏమాత్రం ఖాతరు చేయని సీఎం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి "పైన దేవుడు ఉన్నాడు. ప్రజల చల్లని దీవెనలు ఉన్నాయి. ఇవి చాలు మంచి పరిపాలన మరింత సమర్థవంతంగా అందించడానికి’’ అని చెబుతూ మూడోసారి 2024 ఎన్నికల సంగ్రామానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు.

"ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత సీఎం డా. వైఎస్ఆర్ ఘాట్లో నివాళులు అర్పించిన అనంతరం " సిద్ధం" పేరిట ఇచ్ఛాపురం వరకు బస్సుయాత్రను నిర్విరామంగా సాగించారు. ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో జనం నుంచి నీరాజనాలు అందుకున్నారు. టికెట్ లభించక, అలకబూని, చెంతకు చేరిన టిడిపి సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలను కూడా సాదరంగా స్వాగతించారు. " తాను నినదించడమే కాకుండా, పార్టీ శ్రేణులతో కూడా వై నాట్ 175" మాటకు కట్టుబడేలా చేసి, ఎన్నికల బరిలో సైనికుల్లా పని చేయడానికి అవసరమేమి ధైర్యం ఇచ్చారు.

"జిల్లాస్థాయి అధికారులే కాదు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు కూడా ఎన్నికల సంఘం తప్పించింది. డీజీపీ రాజేంద్రనాథరెడ్డిని ఎన్నికల విధుల నుంచి తప్పించగానే.. వైఎస్. జగన్ స్వరంలో మార్పు కనిపించింది. తాను ఇంకా సీఎం హోదాలోనే ఉన్నాన్న విషయాన్ని మరిచి ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరుగుతుందని నమ్మకం లేదు" అని చేసిన వ్యాఖ్యలు పలు సందేహాల తావిస్తున్నాయి. "తాను సీఎంగా ఉండడం, మంత్రులు, ఎమ్మెల్యేలు, బలమైన నాయకత్వం, పటిష్టమైన నెట్వర్క్ ఉన్నదనే విషయాన్ని వైఎస్. జగన్ విస్మరించారా" అనే సందేహాలను సొంత పార్టీలో నాటారా అనే భావన కూడా వ్యక్తమవుతోంది.

 

సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై ఇటీవల జరిగిన దాడి తరువాత జెడ్ ప్లస్ కేటగిరి రక్షణ కల్పించారు. ఆక్టోపస్‌లో శిక్షణ పొందిన 30 మంది మెడికల్, యాంటీ టెర్రరిజంలో శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది కాపలాగా ఉంటారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ భద్రతా సిబ్బంది రక్షణ బాధ్యతలు చూసుకుంటారు. వీళ్ళకి అదనంగా రెగ్యులర్ పోలీసులు వెయ్యి మంది ఉంటారు. అయితే, " కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించిన సీఎం వైఎస్ జగన్.. ప్రజలకు మంచి చేస్తున్న తనను ఉండకుండా చేసేందుకు చేయాలనేది లక్ష్యం" అని ఆయన అభద్రతకు లోనవుతున్నట్లుగా బయటపడ్డారు. దీనివెనక పరమార్థం ఏంటి అనేది చర్చకు ఆస్కారం కలిపింది. అంటే అధికారం నుంచి దించి వేయడానికి వ్యూహాలు అమలు చేస్తున్నారా అనేది ఆయన మాటగా కనిపిస్తుంది.

రాష్ట్రంలో 2019లో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనాటి తన తండ్రి చూపిన తెగువను ప్రదర్శించారు అనడంలో సందేహం లేదు. సంచలన విజయాన్ని తగ్గించుకున్న ఆయన ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడంలో రాజీపడలేదు. అప్పులు పెరిగిపోయాయని, అభివృద్ధి జాడలేదని, శాంతిభద్రతలు సన్నగిల్లాయి. అనే ఆరోపణలను బలంగా ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ తాము అమలు చేసిన సంక్షేమ పథకాలు వైయస్సార్సీపిని ఆదుకుంటాయని ధైర్యంగా చెప్పడమే కాకుండా, తెగువతో అభ్యర్థులను కూడా రంగంలోకి దించారు.

బలహీనవర్గాలు, కలలో కూడా ఊహించని సామాన్యులకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. "విజయం మా పక్కనే ఉంది" అని బలంగా విశ్వసించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వరంలో ధ్వనించిన మాటలు సంచలనంగా మారాయి. " ల్యాండ్ టైటిల్ పై టిడిపి దుష్ప్రచారం చేస్తోంది. రైతులకు హక్కు భద్రత కల్పించడమే అని" సీఎం వైఎస్ జగన్ సమాధానం ఇచ్చారు.

ఎన్నికలకు ముందు నుంచే తలపోటు..

ఎన్నికల ప్రారంభానికి ముందే సొంత చెల్లెలు వైఎస్. షర్మిల పిసిసి అధ్యక్షురాలి హోదాలో ప్రత్యర్థిగా నిలిచారు. రాష్ట్రంలో టిడిపి- జనసేనతో కేంద్రంలోని ఉన్న బిజెపి కలిసింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై వెళ్లి ఫిర్యాదుల నేపథ్యంలో చర్యలు ఎక్కువయ్యాయి. ఈ సమయంలో తాను బలంగా విశ్వసించి, పదవుల్లో నియమించుకున్న అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విపక్షాల ఫిర్యాదుల నేపథ్యంలో వరుసపెట్టి చర్యలు తీసుకుంటున్నారు.

ఈ పర్యవసానం రాజధాని నుంచి పల్లెవరకు ఎన్నికల నిర్వహణలో ప్రభావం చూపుతుంది అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందేహిస్తున్నారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ లో వ్యతిరేక పవనాలు వేస్తున్నట్లు సంకేతాలు ఉన్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వరంలో మార్పు రావడానికి ఆస్కారం కలిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మరో వారం రోజుల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తికానుంది. ఎన్ని మలుపులు ఉంటాయి అనేది చూడాల్సిందే.

Tags:    

Similar News