షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎవరికి వారసుడు?
వైఎస్సార్ వారసత్వాన్ని కొనసాగించే సత్తా రాజారెడ్డికి ఉందా? ఏపీలో జెన్ జీ పాలిటిక్స్ కి రాజా రెడ్డి ప్రతినిధేనా?;
By : The Federal
Update: 2025-09-10 08:59 GMT
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ జెన్ జీ (1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన తరం) రంగ ప్రవేశం చేస్తోంది. ఇప్పటికే కొద్ది మంది రాజకీయ నేతల అవతారమెత్తగా ఇప్పుడు సరికొత్తగా వైఎస్ కుటుంబం నుంచి మరో యువకుడు రాజకీయ కేక వేయబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అతడే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజా రెడ్డి. ఆయన తొలిసారి 2025 సెప్టెంబర్ 8న కర్నూలులో తల్లితో కలిసి ఓ రాజకీయ వేదికపై తళుక్కున మెరిశాడు.
"తన కుమారుడు అవసరం వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తాడని" షర్మిల వ్యాఖ్యానించినా ఆయన డ్రస్ చేసుకున్న తీరు మాత్రం అచ్చం రాజకీయ నాయకుణ్ణి తలపించింది. మెడలో మూడు రంగుల కండువా, తెల్లచొక్కా, తెల్లప్యాంటుతో కర్నూలు ఉల్లి మార్కెట్ లో తల్లి షర్మిల పక్కన తొలిసారి కనిపించారు.
26 ఏళ్ల వయసున్న ఈ 6 అడుగుల బుల్లెట్ రాజకీయ ఆరంగేట్రం చేసినట్టుగా వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉండే వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పర్యటనకు ముందు ఆయన హైదరాబాద్‌లో విజయమ్మ (మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య) ఆశీర్వాదం తీసుకుని తల్లితో పాటు కారెక్కారు. ఇప్పుడిది ఓ పెద్ద సంచలనం, రాజకీయ కలకలం రేపింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వయానా మేనల్లుడు. అన్నాచెల్లెళ్లైన జగన్–షర్మిల మధ్య తీవ్రమైన కుటుంబ, రాజకీయ విభేదాలు కొనసాగుతున్న సమయంలో రాజా రెడ్డి ప్రవేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
కుటుంబ సభ్యుల మాటల్లో “జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలో పురుష సంతానం లేదు. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలగిన సత్తా ఉన్న తదుపరి వారసుడిగా రాజా రెడ్డి మాత్రమే.”
వైఎస్ జగన్ కి ఇద్దరూ కుమార్తెలే. జగన్ చెల్లెలు షర్మిలకి ఒక కొడుకు రాజారెడ్డి, కుమార్తె అంజలి.
జగన్, షర్మిల ఇద్దరూ వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని కోరుతున్నవారే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబం ఒక శక్తివంతమైన బ్రాండ్. వైఎస్ రాజశేఖర రెడ్డి కష్టపడి నిర్మించిన ఈ వారసత్వాన్ని ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు, కుటుంబ అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరుకున్న వేళ రాజారెడ్డి పేరు తెరపైకి వచ్చింది.
తల్లి షర్మిల కర్నూలులో ఉల్లి రైతులతో మాట్లాడుతుంటే, పక్కనే నిశ్శబ్దంగా నిల్చున్న రాజా రెడ్డి ముఖంలో ‘తరువాత నేను రానున్నాను’ అనే సంకేతం కనిపించిందని సీనియర్ జర్నలిస్టు రామమోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు.
ఈ దృశ్యాన్ని చూసిన రాజకీయ వర్గాలు ఆయనను వైఎస్ వారసత్వానికి కొత్త పురుష ప్రతినిధిగా చూడటం మొదలుపెట్టాయి. వైఎస్ కుటుంబం నుంచి మూడో తరం రాజకీయ ప్రవేశంపై ఇంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడినట్టేనని కర్నూలుకు చెందిన సీపీఎం నేత గఫూర్ అన్నారు.
ఇది యాదృచ్ఛికం కాదు. పర్యటనకు ముందు ఆయన అమ్మమ్మ వైఎస్ విజయమ్మ వద్ద ఆశీర్వాదం తీసుకోవడాన్ని బట్టి చూస్తుంటే ఈ ప్రవేశం కుటుంబ అనుమతితోనే జరిగిందని స్పష్టమవుతోందని గఫూర్ చెప్పారు.
రాజారెడ్డి ప్రస్థానం...
1998 డిసెంబర్ 17న జన్మించిన రాజారెడ్డికి ఆ పేరును తన తాత వైఎస్ రాజశేఖరరెడ్డే పెట్టారంటారు. రాజశేఖరరెడ్డి తండ్రి పేరు రాజా రెడ్డి. రాయలసీమ రాజకీయాల్లో ప్రత్యేకించి కడప జిల్లాలో వైఎస్ రాజారెడ్డికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. వైఎస్ రాజారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ, పులివెందుల మైనింగ్, భూవివాదాలు, స్థానిక సామాజిక సమీకరణాలపై “శాసించాడు” అనే పేరుండేది. ఆయన ఉనికే ఒక శక్తి. చివరికదే 1998లో ఆయన ఊపిరి తీసింది.
ఆ “ఫ్యాక్షన్ బ్రాండ్ ఇమేజ్”ను వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయంగా మార్పు చేసి, అభివృద్ధి, సంక్షేమం దిశగా మలిచారు. ఇప్పుడు ఆ వారసత్వం కోసం జగన్, షర్మిల పోటీ పడుతున్నారు. ఈ తరానికి ప్రతినిధిగా షర్మిల తన కుమారుణ్ణి దించబోతున్నారు. ఈ సందర్భంలో ఎదురవుతున్న ప్రశ్న ఏమిటంటే - మైనింగ్‌ను శాసించిన తాతలాగా, రాష్ట్ర రాజకీయాల్ని ఈ రాజారెడ్డి శాసించగలడా?. ఈ పోలికే ఆయన రాజకీయ భవిష్యత్తుకు మొదటి అంచనా.
పాత వారసత్వం పోకుండా వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్ రాజకీయాలు నడిపారు. ఆ ఇద్దరూ ముఖ్యమంత్రులయ్యారు. ఇది మూడో తరం.
హైదరాబాద్ ఓక్రిడ్జ్ స్కూల్లో చదివిన రాజారెడ్డి అమెరికాలోని డల్లాస్ యూనివర్శిటీలో ఎంబీఏ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అమెరికాలో ఉన్నప్పుడే ప్రేమించిన తన స్నేహితురాలు అట్లూరి ప్రియను వివాహం చేసుకున్నారు.
అట్లూరి ప్రియ ఆంధ్రప్రదేశ్ లో పలుకుబడి ఉన్న కమ్మ సామాజికవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, చట్నీస్ సంస్థల అధినేత అట్లూరి విజయ వెంకట వర ప్రసాద్ మనుమరాలు. ప్రసాద్ కుమారుడు అట్లూరి శ్రీనివాస్, మాధవిల కుమార్తె ప్రియ. వారికి అమెరికాలో కన్సెల్టెన్సీ ఉంది. అక్కడే రాజారెడ్డికి ప్రియ పరిచయం అయింది.
ఈ ప్రేమికుల వివాహం 2024 ఫిబ్రవరి 17న రాజస్థాన్ జోధ్‌పూర్ ప్యాలెస్ లో అట్టహాసంగా పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి మేనమామ వైఎస్ జగన్ వెళ్లలేదు. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 24న ఘనంగా జరిగిన రిసెప్షన్ వేడుకకు మల్లికార్జున ఖర్గే, కే.సీ.వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లూ భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు.
ఇప్పుడెందుకు ఎంట్రీ ఇచ్చారు..
కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం — వచ్చే ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నందున, రాజా రెడ్డి తల్లితో కలిసి పర్యటిస్తూ రాజకీయ అనుభవం సొంతం చేసుకుని తదుపరి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
తద్వార తన మేనమామ వైఎస్ జగన్ పెట్టిన వైసీపీకి పునాది వర్గంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలను తమవైపు తిప్పుకునేందుకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు వై.కోటిరెడ్డి అన్నారు. సీనియర్ నేతలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయని అన్నారు కోటిరెడ్డి.
వైఎస్ కుటుంబమంటే ఎప్పటినుంచో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక భావోద్వేగం ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పడం గమనార్హం.
రాజా రెడ్డి ఒక ఎవాంజలిస్ట్ కూడా కావడం వల్ల కలిసివచ్చే అవకాశం ఉందన్న పార్టీ సీనియర్ల వాదన. రాజారెడ్డిని ముందుంచడం ద్వారా రాష్ట్రంలో పట్టున్న రెడ్డి, కమ్మ (భార్య ప్రియ కులం) సామాజిక వర్గాలతో పాటు వైఎస్ కుటుంబం చరిత్ర, వారసత్వం, ఎవాంజలిస్టుగా తన తండ్రి అనిల్ (ఆయన బ్రాహ్మణ)కి ఎస్సీ, ఎస్టీ వర్గాలలో ఉన్న పేరు ప్రఖ్యాతలు, కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ కలిసి రావొచ్చునని అంచనా.
రాజా రెడ్డి ఆ బంధాన్ని కొనసాగించగలరా? లేక ఇది కేవలం ఒక ప్రయత్నమేనా? అన్నది 2029 నాటికి తేలదు. కానీ ఒక విషయం మాత్రం ఇప్పుడు స్పష్టమైంది- “వైఎస్ వారసత్వం ఇకపై వైఎస్ జగన్, షర్మిలకే పరిమితం కాదు, రాజా రెడ్డి కూడా రంగంలోకి వచ్చేశాడు. రాజకీయ క్రీడ మళ్లీ మలుపులు తిరగనుంది” అంటున్నారు వైఎస్ఆర్ అనుచరులు.
కర్నూలులో రైతులతో సమావేశమైన తర్వాత, మీడియా ఆయన రాజకీయ ప్రవేశంపై ప్రశ్నించగా, షర్మిల చిరునవ్వుతో, “అవసరమైనప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తారు” అని సమాధానం ఇచ్చారు.
షర్మిల మనసులో ఏముందో...
తన అన్న జగన్‌పై సీబీఐ కేసులు నమోదైన సమయంలో షర్మిల రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఆరంభంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున బలంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత అన్నతో విభేదించి, తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఫలితాలు రాకపోవడంతో ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
2024లో ఆమెను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమించారు. అనంతరం ఆమె తన అన్న జగన్‌పై ఘాటు విమర్శలు చేస్తూ, వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయాన్ని ప్రస్తావించారు. కడప ఎంపీగా పోటీ చేసినా ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో ఖాతా తెరవలేకపోయింది.
ఈ పరిస్థితుల్లో, అకస్మాత్తుగా రాజా రెడ్డి కర్నూలులో ఉల్లి రైతులతో కలిసి బహిరంగ వేదికపై కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన రాజకీయాల్లోకి రావడంపై ఊహాగానాలు మొదలయ్యాయి.
మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ వారసత్వం కొత్త మలుపు తిరుగుతోంది. షర్మిల తరువాత ఇప్పుడు ఆమె కుమారుడు రాజా రెడ్డి పేరే వినిపిస్తోంది. యూత్‌లో పట్టు సాధించేందుకు ఇది ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు.