ఓటింగ్‌ సరళిపై డేగ కన్ను

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా నిర్విరామంగా మోనటరింగ్‌. విధుల్లో 150 మంది అధికారులు, సిబ్బంది.

Update: 2024-05-13 00:00 GMT

నేడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో చోటు చేసుకునే ఎలాంటి పరిణామాలనైనా ఎప్పటికప్పుడు గమనించేందుకు ఎన్నికల కమిషన్‌ డేగ కన్ను వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 31,385 పోలింగ్‌ కేంద్రాలను వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా రాష్ట్ర స్థాయి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఎన్నికల కమిషన్‌ పర్యవేక్షిస్తుంది. 26 జిల్లాలకు సంబంధించి 26 టీవీ మోనిటర్ల ద్వారా పోలింగ్‌ కేంద్రాల్లో జరిగే ఓటింగ్‌ సరళిని పోలింగ్‌ కేంద్రం లోపల, బయట కూడా ఎన్నికల కమిషన్‌ ఈ వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా మోనటరింగ్‌ చేస్తుంది. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లో సుమారు 150 మంది అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తారు. రాష్ట్రంలో జీరో వైలెన్స్‌ లక్ష్యంగా 75 శాతం పోలింగ్‌ కేంద్రాలు ఈ వెబ్‌ క్యాస్టింగ్‌ పర్యవేక్షణలో ఉంటాయి.

రాష్ట్రంలో మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళలు, 3,421 మంది థర్డ్‌ జండర్‌ ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో 46,389 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేసింది. ఇందులో 12,438 పోలింగ్‌ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించి పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 25 పార్లమెంట్‌ స్థానాలకు 454 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 46,389 పోలింగ్‌ కేంద్రాల్లో 1.60లక్షల కొత్త ఈవీఎంలను ఎన్నికల కమిషన్‌ ఉపయోగిస్తోంది. అదనంగా మరో 20 శాతం కొత్త ఈవీఎంలను కూడా సిద్ధంగా ఉంచారు. మొదటిలో ప్రతిపాదించిన విధంగా 46,165 పోలింగ్‌ కేంద్రాలకు 1.45లక్షల ఈవీఎంలు సరిపోతాయి. అయితే అదనంగా ప్రతిపాదించిన 224 ఆక్జిలరీ పోలింగ్‌ కేంద్రాలకు మరో 15వేల ఈవీఎంలు సమకూర్చారు. మొత్తమ్మీద 1.60లక్షల కొత్త ఈవీఎంలను వినియోగిస్తున్నారు.
రాజ్యాంగం ప్రసాదించిన హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌ కుమార్‌ మీనా పిలుపినిచ్చారు. దృఢమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు ప్రశాంత వాతావరణంలో న్యాయంగా, పారదర్శకంగా, ఎన్నికలు జరగాల్సిన అవరసం ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో 79.84 శాతం ఓటింగ్‌ నమోదైందని, 2024 మే13న జరిగే ఎన్నికల్లో 83 శాతం తగ్గకుండా ఓటింగ్‌ నమోదు కావలని, ఆ విధంగా ఓటర్లను ఎన్నికల కమిషన్‌ చైతన్య పరచిందన్నారు. పురుషులకు, మహిళలకు, వృద్ధులు, దివ్యాంగులకు ఓట్లు వేసేందుకు వేర్వేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Tags:    

Similar News