ఎన్నికలపై కమిషన్ స్పెషల్ ఫోకస్

ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్బంగా ఎన్నికల కమిషన్.. బ్యాంక్ లావా దేవీలు, సోషల్ మీడియా పోస్ట్‌లపై కూడా ఫోకస్ పెట్టనున్నట్లు వెల్లడించింది.

Update: 2024-03-22 12:35 GMT
Source: Twitter

దేశమంతా ఎన్నికల హడావుడి నెలకొంది. అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లు అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ పార్టీకి చెందిన అభ్యర్థి కూడా హద్దుమీరి ప్రవర్తించకుండా ఉండటానికి ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసేసింది. పోస్టర్లు, కటౌట్‌లను తొలగించే ప్రక్రియను కూడా అమలు చేస్తోంది. ఇందులో ఏ మాత్రం అలసత్వం కనిపించినా సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పార్టీల అభ్యర్థులను ఎన్నికల ప్రవర్తనా నియమావళి విషయంలో హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ తమ ప్రసంగాల విషయంలో ఆచితూచి నడుచుకోవాలని, ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే చర్యలు తప్పవని తెలిపింది.

నగదు లావాదేవాలపై దృష్టి
ఎన్నికలు అతి చేరువలో ఉన్న నేపథ్యంలో బ్యాంకుల నుంచి జరిగే లావాదేవీలపై కూడా ఎన్నికల సంఘం దృష్టి సారిస్తోంది. రూ.లక్షకు మించి విత్‌డ్రా చేసినా, డిపాజిట్ చేసినా ఆ ఖాతాలపై నిఘా ఉంచాలని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. అంతేకాకుండా ఈ విత్‌డ్రా, డిపాజిట్‌ చేసిన వ్యక్తులపై ఆరా తీయాలని, ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించడానికి అధికారులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కమిషన్ సూచించింది. ఒకే బ్యాంకు బ్రాంచ్ నుంచి వేరువేరు ఖాతాలకు అధిక మొత్తంలో లావాదేవీలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై అధికారులు దృష్టి సారించి ఇటువంటి రూ.లక్షకు మించిన లావాదేవీలకు సంబంధించిన వివరాలను బ్యాంకుల నుంచి సేకరించి విశ్లేషించాలని ఆదేశించింది. రూ.10 లక్షలకు మించి లావాదేవీలు జరిగితే సదరు వివరాలను ఐటీ నోడల్ అధికారులకు అందజేయాలని కమిషన్ వెల్లడించింది.
సోషల్ మీడియా పోస్టులనూ వదలొద్దు
ఎన్నికల సమయంలో కేవలం బహిరంగ సభల్లో ఇచ్చే ప్రసంగాలు, మీడియా ముందు చేసే వ్యాఖ్యలే కాకుండా సోషల్ మీడియా పెట్టే పోస్టులపై కూడా నిఘా పెట్టాలని ఎన్నికల సంఘం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని తూర్పుగోదావరి జిల్లా ఎస్‌పీ జగదీష్ కూడా ధ్రువీకరించారు. అభ్యర్థులు, వారి అనుచరులు పెట్టే సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంటుందని, ఈ పోస్ట్‌లలో ప్రత్యర్థులపై వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. దాంతో పాటుగా వివాదాస్పదమైన, కులాల పేరిట పోస్ట్‌లు, ట్రోలింగ్, ఆన్‌లైన్ వేధింపులు, తప్పుడు వార్తల ప్రచారంపై ప్రత్యేక నిఘా ఉంటుందని ఎస్‌పీ జగదీశ్ వెల్లడించారు. ఇలాంటి పోస్ట్‌లకు వాట్సప్, ఫేస్‌బుక్ గ్రూప్‌లలో అడ్మిన్‌లదే బాధ్యత అని, ఇలాంటి పోస్ట్‌లు పెడితే సదరు గ్రూప్ అడ్మిన్‌పైనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
హింసకు ఉపేక్షించం
ఎన్నికల సమయంలో జరిగే హింసను తాము ఉపేక్షించమని, ఈ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని ఎన్నికల సంఘం అధికారులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రలో గిద్దలూరులో జరిగిన హత్యలు, మాచర్లలో ట్రాక్టర్లను తగలబెట్టిన ఘటనలపై అధికారులు సీరియస్ అయ్యారు. వీటితో పాటుగా ప్రకాశం, నంద్యాల, పల్నాడు ప్రాంతాల్లో రాజకీయ హింస జరగడంపై ఈసీ.. స్థానిక పోలీసు అధికారులపై మండిపడింది. ఎన్నికల టైంలో ఎటువంటి హింస జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఎక్కడైనా హింసాత్మక ఘటనలు జరిగితే ఆ పరిధి పోలీసు అధికారిదే బాధ్యత అవుతుందని, సదరు అధికారిపై చర్యలు ఉంటాయని, కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకుని తమ తమ పరిధిలో ఎటువంటి హింస జరగకుండా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది.


Tags:    

Similar News