భువనేశ్వరి చెప్పిన 'నిజం గెలిచిందా'? చంద్రన్నకి ఈడీ క్లీన్ చిట్ అదేనా!
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో ఆయన భార్య భువనేశ్వరి చేపట్టిన 'నిజం గెలవాలి' ఉద్యమం గెలిచినట్టేనా?
By : The Federal
Update: 2024-10-16 08:45 GMT
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో ఆయన భార్య భువనేశ్వరి చేపట్టిన 'నిజం గెలవాలి' ఉద్యమం గెలిచినట్టేనా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇచ్చిన క్లీన్ చిట్ సంకేతం అదేనా? ఇకపై ఏపీ సీఐడీ, ఏసీబీలు చంద్రబాబుపై దాఖలు చేసిన కేసుల కొట్టివేతకు మార్గం సుగమం అయిందా? అంటే దాదాపు అయిందనే చెప్పాలంటున్నారు న్యాయనిపుణులు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పడానికి తగిన ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ ఆవేళ చెప్పిన దానికి అనుగుణంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. ఆ తర్వాత ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
ఈడీ గుర్తించిన ప్రాధమిక సాక్ష్యాధారాల ప్రాతిపదికన ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ను 2023 సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు. 371 కోట్ల రూపాయల మేర స్కిల్ డెవల్మెంట్ సంస్థ నిధుల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించిన సీఐడీ దర్యాప్తు ఆధారంగా చంద్రబాబును అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో రెండు ప్రశ్నలు వచ్చాయి. ఒకటి తన అరెస్ట్ అన్యాయమని, ముందస్తు నోటీసు ఇవ్వకుండా గవర్నర్ కి చెప్పకుండా అరెస్ట్ చేశారన్నది ఒకటి కాగా ఈ కేసులో తనకు ఏ ప్రమేయమూ లేదన్నది రెండోది. ఈ రెండూ ఏసీబీ కోర్టులో వీగిపోయాయి. 53 రోజుల పాటు తాను కట్టించిన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. అక్టోబర్ 31న ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. దాంతో బయటకు వచ్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్ ఓడిపోయి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.
కేసు ప్రారంభంలో హైదరాబాద్ లోని ఈడీ అధికారులు డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరికొన్ని సంస్థల ఆస్తులను సీజ్ చేశారు. వాళ్ల పేర్లను పేర్కొన్నారు. వాళ్లు వాళ్ల ఆస్తుల్ని విడిపించుకునే క్రమంలో ఈడీ చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చింది.
నిబంధనలు ఏమి చెబుతున్నాయి...
ఎవరిపైనైనా ఆరోపణలు వచ్చినపుడు నిబంధనల ప్రకారం ఈడీ అధికారులు ప్రాధమిక విచారణ జరుపుతారు. ఆరోపణలకు తగ్గట్టుగా ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నట్టు గుర్తిస్తే ఆ సంస్థల ఆస్తులను ఆటాచ్ చేయడమో సీజ్ చేయడమో చేస్తారు. ఆ తర్వాత విచారణకు పిలిచి తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమని చెబుతారు. ఈడీ నిబంధనల ప్రకారం నిందితుడే తానేమీ తప్పు చేయలేదని నిరూపించుకోవాలి.
అదే కోర్టుల్లో అయితే ఎవరు కేసు పెట్టారో వాళ్లు నిరూపించారు. అంటే ప్రాసిక్యూషన్ నిరూపించాలి. నిధుల దారిమళ్లింపును నివారించే క్రమంలో ఆనాడు సుమారు 23.5 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది.
ఇప్పుడు చంద్రబాబు వ్యవహారంలో ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది. సెమెన్స్ భాగస్వామ్యంతో చేపట్టిన ప్రభుత్వ స్కిల్, యాజమాన్య అభివృద్ధి సంస్థ నిధుల దుర్వినియోగం, బదలాయింపు వ్యవహారంలో చంద్రబాబుకు ఎటువంటి సంబంధం లేదని ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది. చంద్రబాబు అధికారంలోకి రావడానికి రెండు నెలల ముందు ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయనతో పాటు మరికొందరిపై చార్జిషీట్ దాఖలు చేశారు.
ఇప్పుడు ఆ చార్జిషీట్ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. స్కిల్ డెవలప్మెంట్ పేరిట చంద్రబాబు, మరికొన్ని సంస్థలు నిధులు దారిమళ్లించాయని చెప్పడానికి వీలైన సాక్ష్యాధారాలు ఏమీ లేవని తేల్చారు. సీఐడి అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్ లో పేర్కొన్నట్టుగా చంద్రబాబుకు ఈ కేసుతో సంబంధం లేదని నిర్దారించారు. ఈడీకి సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చినందున చంద్రబాబు పాత్ర లేదని తేల్చారు. దీంతో చంద్రబాబు.. తాను ఎటువంటి నిధుల దుర్వినియోగానికి, దారి మళ్లింపునకు పాల్పడలేదని నిరూపించుకున్నట్టయింది.
స్కిల్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది. జగన్ ప్రభుత్వం హయాంలో ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేస్తోంది. అయితే ఈ కేసులో తాజాగా ఈడీ చేసిన ప్రకటన కీలకంగా మారింది. ఈడీ తాజా విచారణ తర్వాత సీఎం చంద్రబాబుకు ఈ అంశంలో ఎలాంటి ప్రమేయం లేదని రుజువైంది. ఈడీ విచారణ ప్రకారం నిధుల డైవర్షన్ విషయంలో చంద్రబాబు ప్రమేయం లేదని నిరూపణ అయింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై వైసీపీ నేతలు చేసిన అసత్య ప్రచారాన్ని ఈడీ వర్గాలు తప్పు పట్టాయి.
ఈ కేసులో తాజా సమాచారం ప్రకారం వినాయక్ ఖాన్వెల్కర్, సుమన్ బోస్ నాయకత్వంలో కొందరు బోగస్ ఇన్వాయిసులు సృష్టించి దుర్వినియోగానికి పాల్పడినట్టు గుర్తించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఈడీ స్టేట్‌మెంట్‌లో ఒక్కమాటా లేదు. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబుకు సంబంధించి ఆరోపణలు ఏమీ లేవు. దీంతో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు సమాచారం.
2023, సెప్టెంబర్ 9వ తేదీన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును నంద్యాలలో పోలీసులు అరెస్ట్ చేశారు. బస్సులో విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తరలించారు. కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దాంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తీసుకు వెళ్లారు. 52 రోజుల అనంతరం చంద్రబాబునాయుడు బెయిల్‌పై విడుదలయ్యారు.
ఆసందర్భంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి "న్యాయం గెలవాలి" అనే పేరిట ఉద్యమాన్ని ప్రారంభించారు. అనేక జిల్లాలు తిరిగారు. మహిళలోకాన్ని కదిలించారు. ఆమె చేపట్టిన పోరాటానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మద్దతు పలికారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి మొదలు పెట్టి ఆరేడు జిల్లాలలో పర్యటించారు. ఆమె సోదరుడు బాలకృష్ణ సైతం ఆమె ఉద్యమానికి అండగా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నారా భువనేశ్వరి ఇల్లు వదిలి ప్రజల మధ్యకు రావడం అదే మొదటిసారి కావడంతో ఒకింత రాజకీయ సానుభూతి కూడా తోడైంది. భువనేశ్వరి చంద్రబాబును జైల్లో కలిసి ఆయన క్షేమ సమాచారాన్ని ప్రజలకు తెలియజేసేవారు. చంద్రబాబు అరెస్ట్ తో చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చి వారికి ఆర్ధిక సాయం చేశారు.
ఇప్పుడేం జరుగబోతోంది?
ఈడీ అధికారులు చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయనపై పెట్టిన కేసులు ఏమవుతాయిన? అనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఈడీ సూత్రప్రాయంగా కనిపెట్టిన సాక్ష్యాల ఆధారంగా ఏపీ సీఐడీ అధికారులు కేసులు పెట్టారు. ఇప్పుడా ఈడీయే చంద్రబాబుకు ఈ కేసుతో సంబంధం లేదు, నిధుల దుర్వినియోగానికీ ఆయనకు సంబంధం లేదు అని చెబుతోంది. అంటే దేని ప్రాతిపదికగానైతే కేసు పెట్టారో ఇప్పుడా సాక్ష్యం లేకుండా పోతోంది. కోర్టులు సాక్ష్యాలు కోరుకుంటాయి తప్ప నైతికతలు, ఆరోపణలతో సంబంధం ఉండదు. ఈడీ వ్యవహారంలో నిందితుడే తనపై వచ్చిన ఆరోపణలను రుజువు చేసుకోవాలి. ఈడీ చట్టప్రకారం సీజ్ చేస్తుంది. నిందితుడు నిరూపించుకోవాలి. కానీ కోర్టుల్లో అలా జరగదు. ప్రాసిక్యూషన్ నిరూపించాలి.
ప్రభుత్వం మారింది గనుక ఆనాటి ప్రభుత్వ న్యాయవాదులు, ఏజీ, అడిషినల్ ఏజీలు మారిపోయారు. కోర్టు ప్రొసీడింగ్స్ లో ఏసీబీ తరఫున సాక్ష్యులెవరూ ముందుకు రాకపోవచ్చు. అనుకూల, ప్రతివాదనలు జరిగినా ప్రాసిక్యూషన్ కు గట్టి సాక్ష్యాధారాలు లేకపోతే కోర్టులు చట్టప్రకారం ఏమి చేయాలో ఆలోచించి అందుకు తగ్గ తీర్పులు ఇవ్వవచ్చు. మూలాధారాలే లేనప్పుడు కేసు ముందుకు సాగుతుందని ఊహించలేమని సీనియర్ న్యాయవాది చైతన్య అన్నారు.