వీటిపైన వివరణ ఇవ్వండి: పీవీ సునీల్‌కుమార్‌కు ఆదేశాలు

ఏపీ సీఐడీ మాజీ చీఫ్, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది.

Update: 2024-10-07 13:46 GMT

గత ప్రభుత్వంలో సీఐడీ చీఫ్‌గా వ్యవహరించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కేసు వ్యవహారంలో సునీల్‌కుమార్‌ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. అందులో భాగంగా ఆ కేసుకు సంబంధించి వచ్చిన అభియోగాలపై వివరణ ఇవ్వాలని సునీల్‌ కుమార్‌ను ఆదేశించింది. తనను అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా చిత్రల హింసకు గురిచేయడంలో నాడు సీఐడీ చీఫ్‌గా పని చేసిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించారని పేర్కొంటూ గుంటూరు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నగరపాలెంలో కేసు నమోదు చేశారు.

నగరంపాలెం పీఎస్‌లో నమోదైనర కేసుకు సంబంధించిన అభియోగాలపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. ఆ మేరకు జీఏడీ (రాజకీయ) కార్యదర్శి ఎస్‌.సురేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అభియోగాలపై వివరణ ఇచ్చే క్రమంలో, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చినా, అలాంటి ప్రయత్నం చేసినా, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సునీల్‌ కుమార్‌ తన వివరణను లిఖితపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags:    

Similar News