రేపే ఎన్నికల నోటిఫికేషన్.. సిద్ధమవుతున్న నేతలు..

ఆంధ్ర ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. కానీ ఇప్పటివరకు ప్రధాన పార్టీ కీలక నేతలు తమ నామినేషన్‌లపై క్లారిటీ ఇవ్వలేదు.. ఎందుకు..

Update: 2024-04-17 08:21 GMT
Source: Twitter

సార్వత్రిక ఎన్నికలకు దేశం సన్నద్ధం అవుతోంది. వీటితో పాటు అసెంబ్లీ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలు రెడీ అవుతున్నాయి. దీంతో ఆంధ్రలో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు, 25 ఎంపీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. 2023 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేసుకున్న తెలంగాణ.. ఇప్పుడు ఆంధ్రతో కలిసి లోక్‌సభ ఎన్నికలకు రెడీ అవుతోంది. వీటి నోటిఫికేషన్‌లను విడుదల చేయడానికి ఎన్నికల సంఘం సిద్ధమయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల స్వీకరణకు రేపే నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

నోటిఫికేషన్ ఇలా..

ఏప్రిల్ 18న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజున నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఏప్రిల్ 25 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 26న దాఖలైన నామినేషన్ల పరిశీలన జరగనుంది. పోటీ తప్పుకోవాలని భావించే అభ్యర్థులు ఏప్రిల్ 29 వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఆ తర్వాత మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది.

రెడీ అవుతున్న అభ్యర్థులు

ఆంధ్రప్రదేశ్‌లో రేపు ఎన్నికల నగారా మోగనుంది. ఈ క్రమంలో అన్ని పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్‌లు వేయడానికి సిద్దమవుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే కొందరు పండితులను కలిసి నామినేషన్ వేయడానికి శుభ ముహూర్తాలు కూడా చూపించుకున్నారు. అనుకున్న ముహూర్తానికి నామినేషన్ వేయడానికి అన్ని పార్టీల నేతలు నామినేషన్ పత్రాలు చేతబట్టుకుని సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటికే కొందరు నేతలు నామినేషన్‌కు సిద్ధంగా ఉన్నట్లు బహిర్గతం చేస్తుండగా.. మరికొందరు కీలక నేతలు మాత్రం తమ నామినేషన్‌కు సంబంధించి ఎటువంటి అప్‌డేట్ ఇవ్వట్లేదు. వారిలో జనసేనాని పవన్ కల్యాణ్, చంద్రబాబు, జగన్, షర్మిల కూడా ఉన్నారు. వీరి నామినేషన్‌పై ఇప్పటివరకు ఊహాగానాలు వినిపించడమే తప్ప.. విశ్వసనీయ వర్గాల నుంచి కూడా సమాచారం రావడం లేదు.

ఇదంతా పార్టీల వ్యూహమేనా!

ఇప్పటివరకు నామినేషన్‌లపై ప్రధాన పార్టీల్లోని కీలక నేతలు క్లారిటీ ఇవ్వకపోవడంపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఆయా పార్టీల ఎన్నికల వ్యూహాల్లోని భాగమేనని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యర్థి పార్టీలు బరిలోకి దింపే నేతలను బట్టి ఇతర పార్టీల తమ అభ్యర్థులను మార్చాలని యోచిస్తుండొచ్చని, అందుకోసమే పార్టీ అధ్యక్షులు ఇప్పటివరకు నామినేషన్‌లపై స్పందించలేదని వారు వాదిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఎన్నికలకు ప్రతి పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని, ఎలాగైనా గెలిచి తీరాలని అధికార ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఆ వ్యూహాలను అమలు చేసే కసరత్తుల్లో భాగంగానే నామినేషన్‌లను కూడా వినియోగించుకుంటున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News