బాధ్యత మరువద్దు.. కలెక్టర్లకు సీఎస్ సూచనలు

వెలగపూడి వేదికగా ప్రభుత్వం, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశం తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది.

Update: 2024-08-05 08:36 GMT

వెలగపూడి వేదికగా ప్రభుత్వం, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశం తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ పునఃనిర్మాణమే ప్రధాన అజెండాగా ఈ సమావేశం సాగింది. ఇందులో అధికారులకు సీఎం చంద్రబాబు, మంత్రులు కీలక సూచనలు చేశారు. అనంతరం ఈ సమావేశంలో సీఎస్ నీరభ్ కుమార్ మాట్లాడుతూ.. అధికారులు తమ బాధ్యతలు ఎప్పుడూ మరువకూడదని తెలిపారు. అధికారులు తమ బాధ్యతల నిర్వహణకు పెద్దపీట వేయాలని సూచించారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా వారు తమ విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. జిల్లాను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అంతిమంగా కలెక్టర్ పైనే ఉంటుందని, ప్రభుత్వం అందించే ప్రతి రూపాయి నిధిని, ప్రాజెక్ట్‌లను విజయవంతంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్‌దేనని గుర్తు చేశారు.

100 రోజుల ప్రణాళిక సిద్ధం

‘‘రానున్న 100 రోజుల్లో చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలకు ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేసింది. ఆ ప్రణాళిక ప్రకారం అన్ని కార్యక్రమాలకు నిర్వహించడంలో, అమలు చేయడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు పెద్దపీట వేయాలి. ఒకవేళ ఏదైనా సమస్య తమ పరిధిని మించి ఉంటే వెంటనే దానిని సంబంధిత ఉన్నతాధికారులకు సిఫార్సు చేయాలి. ప్రజల సమస్యలకు, ప్రభుత్వ పథకాల అమలును అధికారులు సరైన పద్దతిలో నిర్వహిస్తే రాష్ట్రాన్ని పునఃనిర్మించే బాధ్యత ప్రభుత్వానిదే. విధుల పట్ల అంకిత భావంతో పనిచేసిన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి’’ అని అన్నారు.

కలెక్టర్లకు అభినందనలు

‘‘ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో కలెక్టర్లు చూపిన చొరవను అభినందించాల్సిందే. ప్రతి లబ్దిదారుకు పింఛన్ అందేలా చర్యలు తీసుకున్నారు. యంత్రాంగంతో ఎంతో సమన్వయంతో పనిచేసి లబ్దిదారులు ఇబ్బంది పడకుండా కలెక్టర్లు వ్యవహరించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన కార్యక్రమాల్లో కూడా ముందుండి పనిచేయాలి. రానున్న రోజుల్లో అధికారులు మరింత అంకిత భావం చూపాలి. అంతిమంగా రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి’’ అని వివరించారు.

Tags:    

Similar News