దీక్షలో ఉండి కూడా ఇన్ని అబద్ధాలు చెబుతావా అని ప్రశ్నించిన జగన్
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలో ఉండి కూడా పచ్చి అబద్ధాలు చెప్పారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.
By : The Federal
Update: 2024-10-04 12:38 GMT
జనసేన నాయకుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలో ఉండి కూడా పచ్చి అబద్ధాలు చెప్పారని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అబద్ధాలతో తిరుమల విశిష్టతను దెబ్బతీశారని, ఆయన సనాతన ధర్మం ఇదేనా అని నిలదీశారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పినా అటు ముఖ్యమంత్రి చంద్రబాబుకి గానీ ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి పట్టింపులేకపోయిందన్నారు. కోర్టు తీర్పు తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ విషయంలో కూటమి నేతలు చెబుతున్నవన్నీ అబద్ధాలేనన్నారు.
"తప్పును గుడ్డిగా సమర్థిస్తూ సనాతన ధర్మమని చెప్పుకోవడం ధర్మమా?. ఇది అబద్ధమని తెలిసినా దానికి పవన్ రెక్కలు కట్టారు. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి విశిష్టతను దెబ్బతియడంలో పవన్ కూడా భాగమయ్యాడు. సనాతన ధర్మమంటే పవన్‌కు తెలుసా?. దేవుణ్ణి సైతం రాజకీయాలకు వాడుకునే బుద్ధి చంద్రబాబుకు ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామితో వీళ్లు ఆడుకుంటున్నారు. వాళ్లకు వెంకన్న స్వామే మొట్టికాయలు వేస్తారు. వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. తెలిసి తెలిసి వెంకటేశ్వర స్వామితో ఆటలా?" అన్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
భక్తుల మనోభావాలతో చంద్రబాబు ఆటాడుకుంటుంటే పవన్ కల్యాణ్ అన్నీ తెలిసి కూడా అందులో భాగం అయ్యారు. సీబీఐ అధికారులతో కూడిన సెట్ విచారణను పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. తప్పు చేసినపుడు భయపడాలి గాని చేయనప్పుడు భయపడాల్సిన పనేముందని జగన్ ప్రశ్నించారు. హిందూ మతానికి అసలైన శత్రువులు టీడీపీ, జనసేన నాయకులేనని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.