బూతులు, మద్యమే కొంప ముంచాయి: కాసు మహేష్ రెడ్డి

గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఓటమికి కారణాలను విశ్లేషించారు. నాసిరకం మద్యం, నోటికొచ్చినట్లు తిట్టటమే కారణమని అభిప్రాయపడ్డారు.

Update: 2024-06-23 12:28 GMT

మొత్తానికి వైసీపీలో ఆత్మపరిశీలన మొదలయింది. మాజీ ఎమ్మెల్యేలు ఒకరొక్కరే గొంతు విప్పుతున్నారు. జక్కంపూడి రాజా, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇప్పటికే తమ ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తి చూపగా, తాజాగా ఇవాళ గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఓటమికి కారణాలను విశ్లేషించారు. నాసిరకం మద్యం, నోటికొచ్చినట్లు తిట్టటమే కారణమని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో పాతిక శాతం మంది మందుబాబులు ఉంటారని, వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారని మహేష్ రెడ్డి అన్నారు. తక్కువ స్థాయి మద్యం బ్రాండ్లు వైసీపీ ఓటమికి కారణమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో మద్యం పాలసీని మార్చాలని సజ్జలకు, విజయసాయిరెడ్డికి చెప్పినా పట్టించుకోలేదని అన్నారు.

వైసీపీలోని కొందరు నేతలు, ముఖ్యంగా టీడీపీనుంచి వచ్చినవారు నోటికొచ్చినట్లు తిట్టారని, ఇది కూడా ఒక కారణమని చెప్పారు. పైగా చంద్రబాబు అరెస్ట్‌తో ఆయనలో, టీడీపీ నేతల్లో కసి పెరిగిందని అన్నారు. ఎవరైనా అవమానాలకు గురిచేస్తే కసితో రగిలిపోయి విజయం సాధిస్తారని చరిత్ర చెబుతోందని, ఈ ఎన్నికల్లో అదే జరిగిందని మహేష్ చెప్పారు. జగన్ కూడా ఇప్పుడు అదే పనితో చేయాలని అన్నారు.

ఇసుక విధానం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పేదలపైనా, ఇతర వర్గాల ప్రజలపైనా ప్రభావం చూపాయని మహేష్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News