చడవడం లేదని ఇద్దరు పిల్లలను చంపేసిన తండ్రి
పోటీ ప్రపంచంలో రాణించలేరని ఇద్దరు పిల్లలను కాళ్లూ చేతులు తాళ్లతో కట్టేసి..నీళ్ల బకెట్లలో తలలు ముంచి చంపేశాడో తండ్రి.;
తానో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. సొంత ఇల్లు ఉంది. మంచిగా ఆస్తులు ఉన్నాయి. చక్కటి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చక్కగా సంసారం సాగి పోతోంది. అతనికి ఉన్న ఆస్తులతో అతని పిల్లలే కాదు తర్వాత తరం కూడా హాయిగా బతికేయొచ్చు. ఎలాంటి ఇరుకు ఇబ్బందులు లేకుండా చక్కగా జీవితాలు గడపొచ్చు. అయితే తన పిల్లలు సరిగా చదవడం లేదనే ఆలోచన అతని బుర్రలో జోరీగలాగా తిరగడం ప్రారంభించింది. దీంతో ఆ పిల్లలను పాఠశాల మార్పించాడు. అయినా ఆ ఆలోచనలలో మార్పు రాలేదు. చదువు అంటే ఏంటో కూడా తెలియని వయసు ఆ పసిబిడ్డలది. బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటే తల్లిదండ్రులు సంతోష పెట్టాలనే వయసు కూడా కాదు. ఒక బిడ్డ ఒకటో తరగతి చదువుతుంటే, మరొక బిడ్డ ఎల్‌కేజీ చదువుతోంది. ఆటాపాటలతో ఆడుకునే వయసు వారిది. ఒక వేళ ఇప్పుడు బాగా చదవలేక పోయినా.. పెద్ద పెరిగే కొద్ది బాగా చదివే వారేమో. ఇంత చిన్న వయసులోనే వారు బాగా చదవడం లేదని, దీంతో భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటారని, పోటీ ప్రపంచంలో రాణించలేరని ఎలా నిర్ణయిస్తాడు.
అలా చిన్నప్పుడు బాగా చదవక, పెద్ద పెరిగిన తర్వాత చదువు మీద ఇంట్రెస్టు పెంచుకొని బాగా చదుకుని జీవితంలో పైకొచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆ తండ్రికి అవేమీ గుర్తుకు రాలేదు. తన పిల్లలు సరిగా చదవడం లేదనే ఆలోచనలే అతని బుర్రలో తిరుగూతనే ఉన్నాయి. అవి క్రమంగా ముదిరి వారి మీద ద్వేషంగా మారాలే చేశాయి. దీంతో పసి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే వారి పాలిట కాలయముడిగా మారాడు. వందేళ్లు బతకాల్సిన ఆ పసిబిడ్డలను ఆరేడేళ్ల వయస్సులోనే వారి జీవితాలను చిదిమివేశాడు. కాళ్లూ చేతులను తాళ్లతో కట్టేసి, నీళ్ల బకెట్లలో తలలు ముంచి అత్యంత కర్కశంగా చంపేశాడు. తర్వాత ఆ తండ్రి కూడా ఆత్మహత్య చేసుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. అత్యంత హృదయ విదారకమైన ఈ దుర్ఘటన హోలీ నాడు కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. కాకినాడలోని సుబ్బారావునగర్‌లో జరిగిన ఈ దారుణం తీవ్ర విషాదాన్ని నింపింది.