ఉరేసుకున్న మహిళా ఖైదీ..సస్పెండైన వార్డర్‌లు

భర్త హత్య కేసులో వారం క్రితమే రిమాండ్‌ ఖైదీగా జైలుకొచ్చింది.;

Update: 2025-03-31 06:15 GMT

ఏలూరు జైలులో దారుణం చోటు చేసుకుంది. భర్త హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్య వారం రోజుల క్రితం ఏలూరు జైలుకు రిమాండ్‌ ఖైదీగా వచ్చింది. ఆదివారం చున్నీతో కిటికీకి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఏలూరు జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టించింది.

వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పరిధిలోని తాటాకులగూడేనికి చెందిన గంధం బోసుకు తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేటకు చెందిన శాంతికుమారితో దాదాపు 12 ఏళ్ల క్రితం పెళ్లైంది. బోసు, శాంతికుమారి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో ఒక బాబు ఒక పాప ఉన్నారు. అయితే భార్య శాంతికుమారికి తెలంగాణ ప్రాంతానికి చెందిన సొంగా గోపాల్‌తో వివాహేతర సంబంధం ఉంది. వీరికి తన భర్త బోసు అడ్డుగా ఉన్నాడని, ఆ అడ్డును తొలగించుకోవాలని ప్రియుడు గోపాల్‌తో కలిసి భార్య శాంతికుమారి ప్లాన్‌ చేసింది.
అందులో భాగంగా మార్చి 18న భర్త బోసు మీద కొంత మంది వ్యక్తులతో దాడిచేయించి తీవ్రంగా గాయపరిచారు. దీంతో తీవ్ర గాయాలపాలైన భర్త బోసు ఖమ్మంలోకి కిమ్స్‌ అసుపత్రిలో అడ్మిట్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మార్చి 19న మరణించాడు. గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దాడికి గురై ప్రాణాలు పోయాయని భావిస్తారని భార్య శాంతికుమారి భావించింది. అయితే అది చివరికి భార్య శాంతికుమారి మెడకే చుట్టుకుంది. దీనిపైన పోలీసులు రంగంలోకి దిగారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భార్య శాంతికుమారి తన ప్రియుడు సొంగా గోపాల్‌తో కలిసి భర్త బోసు హత్యకు కుట్ర చేసిందని పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ప్రాథమికంగా తేలినట్లు ఒక నిర్థారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో భార్య శాంతికుమారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హజరు పరిచారు. విచారణ చేపట్టిన కోరు శాంతికుమారికి రిమాండ్‌ విధించింది. ఈ నేపథ్యంలో శాంతికుమారిని ఏలూరు జైలుకు వారం రోజుల క్రితం తరలించారు.
అయితే రాజకీయ నాయకుల నుంచి తన భర్త బోసును చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని, బోసు మీద దాడి జరిగిన రోజే శాంతికుమారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిని పోలీసులు పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో భర్త బోసును హత్య మరణంలో తనకు ఎలాంటి సబంధం లేదని, అయినా తన పాత్ర ఉన్నట్లు కేసులో ఇరికించి జైలు పంపారని భార్య శాంతికుమారి తమ బంధువుల వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో తీవ్ర ఆవేదనలో వారం రోజుల నుంచి జైలులో ఉన్న శాంతికుమారి ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయం తీసుకుంది. జైలు బ్యారక్‌లో కిటికీకి ఆదివారం తన చున్నీతో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. దీనిని గమనించిన జైలు సిబ్బంది వెంటనే శాంతికుమారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శాంతికుమారి మృతి చెందినట్లు ఏలూరు స్వజన ఆసుపత్రి వైద్యులు నిర్థారించారు.
మరో వైపు ఈ ఘటనపై జైలు అధికారులు సీరియస్‌ అయ్యారు. జైలులో మహిళా రిమాండ్‌ ఖైదీ ఆత్మహత్య చేసుకున్న విషయం బయటకు పొక్కడంతో అప్రమత్తమయ్యారు. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. మహిళా ఖైదీ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న బ్యారెక్‌ వద్ద ఆదివారం విధులు నిర్వహించిన హెడ్‌ వార్డర్‌ ఎల్‌ వరలక్ష్మి, వార్డర్‌ నాగమణిలను సస్పెండ్‌ చేశారు. ఆ మేరకు ఏలూరు జైలు సూపరింటెండెంట్‌ సీహెచ్‌ఆర్‌వీ స్వామి ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన శాంతికుమారి మృతదేహానికి పోస్టుమర్టం నిర్వహించేందుకు ఆమె డెడ్‌బాడీని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. అటు భర్త బోసు మరణం, ఇటు భార్య శాంతికుమారి ఆత్మహత్యకు పాల్పడి బలవంతంగా ప్రాణాలు తీసుకోవడంతో వారి పిల్లలు అనాధలుగా మారారు.
Tags:    

Similar News