తెలంగాణలో పథకాల పండుగ... ఏపీలో ఎందుకు లేదు...

ఆంధ్రప్రదేశ్‌లో పాలన ప్రారంభమై 40 రోజులైంది. ప్రజల్లో కొత్త ప్రభుత్వం తాలూకూ ఆనందం ఇప్పటి వరకు కనిపించ లేదు. పక్క రాష్ట్రమైన తెలంగాణ ప్రజల్లో ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

Update: 2024-07-19 09:53 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాయి. ఎప్పుడూ ఏ పార్టీకి ఇవ్వని మెజారిటీని ప్రజలు తిరిగి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి ఇచ్చారు. కూటమి శ్రేణుల్లో అంతులేని ఆనందం కనిపించింది. కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఆనందించ దగిన అంశాలలో ఒక్కటి కూడా అమలులోకి రాలేదు. దీంతో పక్క రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అమలు చేస్తున్న పథకాల గురించి ఏపీలోనూ చర్చ జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్నవాడేనని, అటువంటి వ్యక్తి అందరినీ ఆకర్షించే విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పథకాలు అమలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఏపీలో సూపర్‌ సిక్స్‌ హామీలతో ఎన్‌డీఏ గెలుపు సాధించింది. తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, బీజేపీలు సీట్లు సాధించి పలువురి దృష్టిని ఆకర్షించాయి. జనసేన పార్టీ పోటీ చేసి 21 అసెంబ్లీ స్థానాలు, 2పార్లమెంట్‌ స్థానాల్లోనూ ఘన విజయం సాధించింది.

తెలంగాణలో వరుసగా పథకాల అమలు
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం, రూ. 500లకే గ్యాస్‌ సిలెండర్‌ వంటి పథకాలు ఇప్పటికే అమలవుతున్నాయి. ఆరు నెలల కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ ప్రజలు ప్రతి పథకం అమలు సమయంలో పండగ జరుపుకుంటున్నారు. రైతు రుణమాఫీ పథకం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రెండు లక్షల లోపు రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ అమలు చేస్తూ గురువారం తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొదటి విడతగా ఆరు వేల కోట్ల రుణమాఫీ 11 లక్షల మందికి మొదటి లక్షలోపు రుణం తీసుకున్న వాళ్లకు రుణమాఫీ చేసింది. ఈ మేరకు రుణమాఫీ పథకం తెలంగాణలో అమలు చేశారు.
ఆగస్టులో ఆఖరి దఫా కింద రైతు రుణమాఫీ మొత్తాన్ని అమలు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. డిఎస్సీ నోటీఫికేషన్‌ కూడా విడుదల చేసింది. గ్రూప్‌–1, గ్రూప్‌–2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు జారీ చేశారు. గ్రూప్‌– 3 నోటిఫికేషన్‌ను సెప్టెంబరులో ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రూ. 500లకే గ్యాస్‌ సిలీండర్‌ పథకాన్ని అమలు చేసింది. ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చింది. ఈ పథకాల అమలుతో లక్షల మందికి లబ్ధి చేకూరింది. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల కాలంలో పథకాలను అమలు చేసి ప్రజలకు పండుగ వాతావరణం తీసుకొచ్చింది.
40 రోజులైనా కాన రాని పథకాల అమలు
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 40 రోజులైంది. ఇంత వరకు సూపర్‌ సిక్స్‌ పథకాల్లో ఒకటి కూడా అమలు కాలేదు. ఈ పథకాలు అమలు కావాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇటీవల చెప్పడం విశేషం. నిజానికి నిరుద్యోగ భృతి ఇవ్వడం అనేది పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్న క్యాంటీన్లు కొత్తగా తీసుకొస్తున్నవేమీ కావు. పింఛన్ల పథకం కూడా పాతదే. అయితే హామీలు ఇచ్చిన రోజు నుంచే పింఛన్లు పథకాన్ని అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం మూడు నెలలకు బకాయిలని చెబుతూ రూ. 3వేలు, జూన్‌ నెల పెన్షన్‌ రూ. 4వేలు కలిపి ఇచ్చి అదేదో కొత్త పథకంగా బిల్డప్‌ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అన్నారు. ఇంత వరకు దాని ఊసే లేదు. అధ్యయనం కోసం కర్నాటక, తెలంగాణకు అధికారులను పంపినట్లు చెప్పుకున్నారు. సబ్సిడీపై ఇస్తామన్న గ్యాస్‌ సిలీండర్లు ఇవ్వ లేదు. అమరావతి నిర్మాణాలు ఎప్పటిలోపు పూర్తి అవుతాయో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంత వరకు స్పష్టత ఇవ్వ లేదు. ప్రస్తుతం ఉన్న భవనాలకు మరమ్మతులు చేసి ఆ భవనాలు వినియోగంలోకి తెచ్చేందుకు నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టును ఏ విధంగా నిర్మాణం పూర్తి చేస్తారో ఇంత వరకు చెప్ప లేదు. ఏ ఒక్క హామీకి ఇంత వరకు సరైన రీతిలో స్పందించి అమలు చేస్తున్న దాఖలాలు లేవు. సూపర్‌ సిక్స్‌ పథకాలు ఎప్పటికి అమల్లోకి వస్తాయో తెలియదు.
కేంద్రం నుంచి ఒక్క హామీ లేదు
కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఒక శుభవార్త కూడా లేదు. రాష్ట్రంలో ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమిత్‌ షా మంచి స్నేహితుడు కూడా. అయినా అమిత్‌ షా నుంచి కానీ, ప్రధాని మోదీ నుంచి కానీ సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుకు సంబంధించి ఒక హామీని కూడా కేంద్ర పెద్ద నుంచి లేదు. నిజానికి సీఎం చంద్రబాబు దయా దాక్షిణ్యాలపై ఆధారపడి కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది. అయినా కేంద్రం నుంచి ఒక పథకాన్ని అమలుకు హామీ కూడా ఇంత వరకు తీసుకోలేక పోయారు. కనీసం అమరావతి నిర్మాణానికి గ్రాంటు ఇస్తామని కూడా మోదీ ప్రభుత్వం చెప్పలేక పోయింది. పోలవరానికి ఇవ్వాల్సిన నిధులపై కూడా హామీ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వక పోయినా, ప్రత్యేక ప్యాకేజీలైనా చంద్రబాబు తీసుకొస్తారని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రజలకు నిరాశలే మిగిల్చారు.
బాధ్యత చంద్రబాబుదే కాదు పవన్‌ కళ్యాణ్, బీజేపీలది కూడా
అధికారంలో ఉన్నది ఎన్టీఏ ప్రభుత్వం కావడం వల్ల కేవలం చంద్రబాబే అంతా చూసుకుంటాడనేది కూడా సరైంది కాదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రధాని మోదీ కనుసన్నుల్లో నడిచే జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, అలాగే 8 అసెంబ్లీలు, మూడు పార్లమెంట్‌ స్థానాలను గెలిచిన బీజేపీ ఏపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కూటమి తరపున కాకుండా వ్యక్తిగతంగా బీజేపీ పోటీ చేసి ఉంటే ఒక సీటు కూడా బీజేపీ గెలిచే పరిస్థితులు లేవనేది అందరూ చెబుతున్న మాట. పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి బీజేపీ, జనసేన, టీడీపీ ఎంపీలు ఉన్నప్పటికీ ఏపీకి ఎందుకు అనుకున్నది సాధించుకోలేక పోతున్నారనే ప్రశ్నలు ∙రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ప్రతిపక్షంలో ఉన్నా అమలు చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం
తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లినప్పుడు రాహుల్‌ గాంధీకి నమస్కారం పెట్టి రావడం తప్ప చేయగలిగిందేమీ లేదు. ప్రధాని మోదీని, ఇతర కేంద్ర పెద్దలను కలిసినా ఎన్డీఏ కూటమి భాగస్వాములకు ఇచ్చినంత దారాళంగా ఏ హామీని కాంగ్రెస్‌ ముఖ్యమంత్రికి ఇవ్వ లేదు. అయినా ఇచ్చిన హామీల ప్రకారం పథకాలన్నీ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఏపీలో శాంతి భద్రతలు సరిగా లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ చూసిన హత్యలు, దాడులు జరుగుతున్నాయి. ఏకంగా పార్లమెంట్‌ సభ్యులు మిథున్‌ రెడ్డి దాడి జరిగింది. అక్కడ డక్కడ పోలీసులపై కూడా అల్లరి మూకలు దాడులకు పాల్పడుతున్నారు. ఒక రకంగా చంద్రబాబుకు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలోను చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణలో ప్రజల సంతోషానికి అవధులు లేవు. ఆంధ్రప్రదేశ్‌లో సూపర్‌ సిక్స్‌ పథకాల అమలు ఎప్పుడు జరుగుతుందో అని ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఎప్పుడు ఏ విధమైన శుభ వార్త చెబుతుందో అని రాష్ట్ర ప్రజలు ఆతృతతో ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News