అందుకే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో సినీ ప్రముఖుల భేటీ
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కలిశారు. సమస్యల పరిష్కరించాలని కోరారు.
Byline : The Federal
Update: 2024-06-24 12:31 GMT
ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో తెలుగు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. విజయవాడలోని పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఈ భేటీ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సారిగా తెలుగు చిత్ర పరిశ్రమ విజయవాడకు కదిలొచ్చింది. ప్రముఖ నిర్మాతలందరూ వచ్చి పవన్‌కల్యాణ్‌తో భేటీ కావడంతో ఆం్రధ్రప్రదేశ్‌లో కూడా తెలుగు చలన చిత్ర రంగ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకునేందుకు అడుగులు ముందుకు పడనున్నాయనే చర్చ సాగుతోంది. ఈ సారి తెలుగు సినిమా రంగానికి ఆంధ్రప్రదేశ్‌లో మంచి జరుగుతుందనే అభిప్రాయం ప్రముఖల్లో వ్యక్తం అవుతోంది.
రాష్ట్రం విడిపోయిన తర్వాత గత రెండు ప్రభుత్వాల్లో ఇలాంటి భేటీ జరగ లేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలి సారి ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కానీ, తర్వాత ఏర్పడిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం హయాంలో కానీ ఇంత మంది సినీ ప్రముఖులు వచ్చి భేటీ అయింది లేదు. సహజంగా సినీమా పరిశ్రమ అంతా హైదరాబాద్‌లో ఉండటం, అక్కడే సినీ ప్రముఖులంతా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వాన్ని కలవడం, సమస్యలపై చర్చించడం, పరిష్కరించుకోవడం జరుగుతుంది. ఏదైనా పెద్ద సినిమా విడుదల సమయంలో ఏపీకి రావడం, ఇక్కడ ప్రభుత్వ పెద్దలను కలవడం, టిక్కెట్లు విషయంలో మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ సారి ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఏర్పడటంతో తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దల్లో ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలను కలవాలనుకోవడం విశేషం.
పవన్ కల్యాణ్ సినిమా పరిశ్రమకు చెందిన వారు కావడం, మెగాస్టార్ చిరంజీవి సోదరుడు కావడం, తెలుగు అగ్ర నటుడుగా కొనసాగుతుండం, అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకంగా మారడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండటం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సైతం జనసేన నేత కావడంతో తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలు చర్చించి పరిష్కరించుకోవడం సులువు అవుతుందని భావించిన టాలీవుడ్ ప్రముఖులు కలిసేందుకు ఆసక్తి కనబరిచారు.
హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగిన తెలుగు సినీ నిర్మాతలు నేరుగా విజయవాడలోని పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అప్పుడే తొలి మంత్రి వర్గ సమావేశం ముగించుకొని క్యాంపు కార్యాలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్
సినిమా నిర్మాతలతో భేటీ అయ్యారు. చిత్ర పరిశ్ర అభివృద్ధి, చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, ఆంధ్రప్రదేశ్‌లో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలు, టిక్కెట్ల రేట్లు వంటి అంశాలపై చర్చించారు. సినీ పరిశ్రమ సమస్యలను పవన్ కల్యాణ్‌కు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అంశాలపై కూడా ప్రధానంగా చర్చించారు.
పవన్ కల్యాణ్‌ను కలిసిన వారిలో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, డి సురేష్‌బాబు, ఏఎం రత్నం, ఎస్ రాధాకృష్ణ, దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్, భోగపల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య, సుప్రియ, బన్ని వాసు, నాగవంశీ, వంశీకృష్ణ, రవిశంకర్, నవీన్ యర్నేని, టీజీ విశ్వప్రసాద్ వంటి ప్రముఖులు ఉన్నారు.
అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసేందుకు అప్పాయింట్‌మెంట్ కావాలని పవన్ కల్యాణ్‌ను కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన పవన్ కల్యాణ్ అప్పాయింట్‌మెంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు బదులిచ్చారు. పవన్ కల్యాణ్‌తో భేటీ అనంతరం అల్లు అరవింగ్ మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిసి సినీ పరిశ్రమ తరపున అభినందించినట్లు తెలిపారు. అందరం కలిసి సరదగా కాసేపు మాట్లాడుకున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఇప్పించాలని కోరినట్లు చెప్పారు. అప్పాయింట్‌మెంట్ ఫిక్స్ అయితే తెలుగు చిత్ర పరిశ్రమలోని అన్ని అసోసియేషన్లు కలిసి వచ్చి సీఎం చంద్రబాబును అభినందించేందుకు వస్తామన్నారు. సీఎం చంద్రబాబుతో కూడా తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యల గురించి చర్చిస్తామన్నారు. పరిశ్రమలో చాలా సమస్యలున్నాయని, టెక్కెట్ల రేట్లు పెంపుదల అనేది చాలా చిన్న విషయమని, ముఖ్యమంత్రిని కలిసినప్పుడు అన్ని సమస్యలకు సంబంధించిన అన్ని అంశాలను రెప్రెజెంటేషన్ రూపంలో తెలియజేస్తామని చెప్పారు.