ఉత్కంఠకు తెరపడింది... యుద్ధానికి తెరలేచింది...
టీడీపీ-జనసేన పార్టీల చివరి సీట్ల భర్తీతో ఉత్కంఠకు తెరపడింది.ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరా? అనే ఎదురుచూపులకు పుల్ స్టాప్ పడింది.
By : The Federal
Update: 2024-03-29 13:51 GMT
(తంగేటి నానాజీ)
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలు ఉండగా... మూడు నియోజకవర్గాల అభ్యర్థుల ఖరారు విషయంలో మాత్రం టీడీపీ, జనసేనలు ఆపసోపాలు పడాల్సి వచ్చింది. తీవ్ర ఒత్తుడులు… కుల, రాజకీయ సమీకరణాలు.. కూలంకష చర్చల తర్వాత పార్టీ అధిష్టానాలు ఎట్టకేలకు ఆ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో ఇప్పటివరకు ఉన్న ఉత్కంఠకు తెరపడింది. సీటు కోసం కాసుకు కూర్చున్న సీనియర్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ జిల్లాలోని భీమిలి, విశాఖ దక్షిణ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక టీడీపీ, జనసేన పార్టీలకు తలనొప్పిగా మారింది. అయితే ఎట్టకేలకు అడ్డంకులు తొలగించుకుని ఆయా పార్టీల అధిష్టానాలు అభ్యర్థులను ప్రకటించాయి. విజయనగరం జిల్లాలోని రాష్ట్ర మంత్రి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్న చీపురుపల్లి నియోజకవర్గానికి కూడా టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. దీంతో ఉత్తరాంధ్రలోని ఈ మూడు నియోజకవర్గాల అభ్యర్థుల అంశంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
భీమిలిలో మోగిన 'గంట'...
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆశపడ్డ స్థానాన్ని దక్కించుకున్నారు. భీమిలి నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఎట్టకేలకు గంటా శ్రీనివాసరావు పేరు ఖరారు చేసింది. తొలుత గంటా శ్రీనివాసరావును బొత్స సత్యనారాయణపై చీపురుపల్లిలో పోటీ చేయమని అధిష్టానం ఆదేశించినప్పటికీ గంటా శ్రీనివాస్ దానికి ససేమిరా అనడంతో చివరకు భీమిలి స్థానాన్ని అధిష్టానం ఖరారు చేసింది.
నాడు మిత్రులు... నేడు ప్రత్యర్ధులు...
భీమిలి నియోజకవర్గంలో ఒకనాటి మిత్రులు నేడు ప్రత్యర్థులుగా మారారు. టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తుండగా… అధికార వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎన్నికల బరిలో ఉన్నారు. వీళ్లు ఒకనాటి స్నేహితులు... ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయిన తర్వాత టీడీపీలోకి కలిసి జంప్ చేశారు. ఆ తర్వాత గంటా శ్రీనివాసరావు.. టీడీపీలో ఉండిపోగా అవంతి శ్రీనివాస్ మాత్రం వైసీపీలో చేరి భీమిలి నుంచి గెలుపొంది మంత్రి పదవి చేపట్టారు. అయినప్పటికీ వీరి మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయని వీరి సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఇరువురూ వేరువేరు పార్టీల నుంచి పోటీ చేస్తుండడంతో వీరి మధ్య ఎన్నికల పోరు అనివార్యమైంది. గెలుపు ఎవరిని వరిస్తుందో ఓటమి ఎవరిని కౌగిలించుకుంటుందో వేచి చూడాల్సిందే.
దక్షిణంలో ఊపిరి పీల్చుకున్న వంశీ...
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వంశీకి ఊరట లభించింది. ఆ నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటల కారణంగా జనసేన అధిష్టానం అభ్యర్థిని ఖరారు చేయలేదు. అయినప్పటికీ జనసేన అధినేత పవన్ హామీ ఇచ్చారంటూ వంశీకృష్ణ యాదవ్.. దక్షిణ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ వచ్చారు. చివరకు జనసేన అధినేత పవన్ హామీ నిలబెట్టుకోగా... విశాఖ దక్షిణ అభ్యర్థిగా వంశీ ఖరారు అయ్యారు. దీంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి జనసేనకు వచ్చిన వంశీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి జనసేన ఆయనకు న్యాయం చేసింది.
బొత్సపై కిమిడి....
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో కూడా ఉత్కంఠకు తెరపడింది. బొత్సపై ఎవరు పోటీ చేస్తారా అంటూ టీడీపీ అధిష్టానం కూడా అభ్యర్థులను ఇప్పటివరకు వెతికింది. చివరకు టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావును ఖరారు చేసింది. దీంతో ఇప్పటి వరకు అక్కడ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న నాగార్జున తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఖరారు కావడంతో బొత్స కిమిడి కళా వెంకట్రావు మధ్య పోటీ షురూ కానుంది.