గురజాల వైఎస్సార్‌సీపీలో మంటలు

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం వైఎస్సార్‌సీపీలో రాజకీయ మంటలు మండుతున్నాయి

Byline :  The Federal
Update: 2024-01-02 13:14 GMT
Kasu Mahesh Reddy, MLA, Gurajala

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం వైఎస్సార్‌సీపీలో రాజకీయ మంటలు మండుతున్నాయి. నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ప్రజలకు నాయకులు ఏమి చేస్తున్నారనేది పక్కన బెడితే నాయకుల మధ్య పొరపొచ్చాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి మధ్య భగ్గుమంటున్నది.

ప్రజా సమస్యల కంటే రాజకీయంగా ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం నేతలు పావులు కదుపుతున్నారు. నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్క కొత్త కట్టడమైనా నియోజకవర్గంలో లేదు. కేవలం సచివాలయాలు కొన్ని నిర్మాణం జరిగాయి. ఉన్నతాధికారుల వద్ద ప్రధానంగా కలెక్టర్, ఎస్పీల వద్ద తమ మాట నెగ్గాలంటే తమ మాట నెగ్గాలంటూ నాయకులు పట్టుదలలకు పోయారు.
పట్టుదలలు పెరిగి పంతంగా మారాయి
వైఎస్సార్‌సీపీ బీసీ వర్గం నేతగా ఉన్న జంగా కృష్ణమూర్తి తన మాట నియోజకవర్గంలో నెగ్గాలని పట్టుబట్టారు. మూడు సార్లు గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే రెండు సార్లు విజయం సాధించారు. ఆ తరువాత జంగా వైఎస్సార్‌సీపీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు పార్టీలో చేరినా గురజాల టిక్కెట్‌ దక్కలేదు. నియోజకవర్గంలో రెడ్డి, కమ్మ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. వారు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ వారు గెలుస్తుంటారు. బీసీల ఓట్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే జంగా కృష్ణమూర్తి తనకు టిక్కెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. రెడ్డికి టిక్కెట్‌ ఇవ్వాల్సిందేనని స్థానికంగా ఉండే రెడ్డి సామాజిక వర్గం వారు పట్టు పట్టడంతో గత ఎన్నికల్లో కాసు మహేష్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ అధిష్టానం టిక్కెట్‌ ఇచ్చింది. అప్పట్లో టీడీపీపై ఉన్న వ్యతిరేకత వైఎస్సార్‌సీపీకి కలిసొచ్చింది.

Delete Edit
ఇద్దరి మధ్య పోరు
కొంత కాలం నుంచి ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి మద్య పోరు నడుస్తున్నది. జంగా కృష్ణమూర్తి ఎవరికైనా పనులు చేయాల్సిందిగా కలెక్టర్‌ లేదా ఎస్పీలతో చెబితే ఆ పనులను చేయకుండా అడ్డుపడుతున్నాడనేది జంగా ఆరోపణ. మహేష్‌రెడ్డి కంటే ముందు నుంచి నియోజకవర్గంలో ఉన్న వాడిని, తన వద్దకు ఎంతో మంది వస్తుంటారు. ఎమ్మెల్సీగా వారికి పనులు చేయించాల్సిన బాధ్యత నాపై కూడా ఉంటుందని ఎమ్మెల్యేకు చెప్పినా మహేష్‌రెడ్డి వినిపించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ అధిష్టానానికి జంగా ఫిర్యాదు చేశారు. అయితే అధిష్టానం నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీంతో జంగా బహిరంగంగానే వైఎస్సార్‌సీపీపై, మహేష్‌రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. సామాజిక సాధికార సభలను వేదికగా చేసుకుని బీసీలు ఇంకెంత కాలం పల్లకీ మోయాలంటూ వైఎస్సార్‌సీపీలోని అగ్ర నాయకత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇటీవల ఒక బీసీ సంఘం వారు ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడుతూ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. మహేష్‌రెడ్డిని ప్రశ్నిస్తే వచ్చే ఉపయోగం ఏమీ లేదని అనుకున్న జంగా పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఇటీవల టీడీపీ వారితో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని జంగా వద్ద ప్రస్తావించగా ఆయన కొట్టిపారేశారు. అటువంటిదేమీ లేదని అన్నారు.
నర్సరావుపేటకు వెళ్లాలనే ఆలోచనలో మహేష్‌రెడ్డి
కాసు మహేష్‌రెడ్డి నర్సరావుపేట టిక్కెట్‌ ఆశిస్తున్నారు. ఒక వేళ మహేష్‌రెడ్డి నర్సరావుపేటకు వెళితే జంగాకు గురజాల టిక్కెట్‌ ఇస్తారా? అంటే సందేహమనే చెప్పాలి. వైఎస్సార్‌సీపీ చేయించిన సర్వేల ప్రకారం రెడ్డి సమాజిక వర్గానికి చెందిన వారికే టిక్కెట్‌ ఇస్తే బాగుంటుంద వైఎస్సార్‌సీపీ భావిస్తున్నట్లు సమాచారం.
యరపతినేనికే టీడీపీ టిక్కెట్‌

Delete Edit

తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌ యరపతినేని శ్రీనివాస్‌కు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా పేరు సంపాదించారు. తిరిగి వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ వారు నిర్వహించిన సర్వేల్లో తేలినట్లు సమాచారం. ఇప్పటికే యరపతినేని శ్రీనివాసరావు గురజాల నుంచి పోటీ చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటుంటున్నారు. కమ్మ సామాజిక వర్గం ఓట్లు పూర్తి స్థాయిలో రాకపోయినా బీసీ సామాజిక వర్గాల నుంచి మంచి మద్దతు ఉంటుందని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నది. గత ప్రభుత్వంలో యరపతినేనిపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ ఒక్కటి కూడా నిరూపణ కాలేదు. పైగా జనానికి అందుబాటులో ఉంటారని నియోకవర్గ నాయకులు చెబుతున్నారు. అందువల్ల తిరిగి టిడీపీ టిక్కెట్‌ యరపతినేనికే ననే ధీమాలో ఆయన వర్గీయులు ఉన్నారు.
Tags:    

Similar News