Kidnapping | తిరుపతిలో ఐదుగురి కిడ్నాప్ చేసి, రూ. రెండు కోట్లు డిమాండ్

తిరుపతిలో ఓ కుటుంబాన్ని కిడ్పాప్ చేశారు. వారిలో ఓ వ్యక్తి తప్పించుకున్నాడు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-03-29 10:03 GMT

తిరుపతి నగరం అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని జీవకోన వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఐదుగురిని కిడ్నాప్ చేశారు. వారిని వదలాలంటే రూ. రెండు కోట్లు డిమాండ్ చేశారు.

శుక్రవారం జరిగిన ఈ సంఘటన శనివారం అంటే కొద్దిసేపటి కింద వెలుగులోకి వచ్చింది. కిడ్నాపర్ల వాహనం నుంచి ఓ వ్యక్తి కిందికి దూకేశాడు. 100 సమాచారం ఇవ్వడంతో, వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తీవ్రంగా గాయపడిన ఈ వ్యక్తి తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు అలిపిరి ఎస్ఐ లోకేష్ చెప్పారు. ఈ ఘనటకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...
తిరుపతి నగరం జీవకోనం వద్ద విజయ, రాజేష్ దంపతులు మీసేవ కేంద్రం నిర్వహిస్తున్నారు. వారితో సహా కుటుంబంలోని ఐదుగురిని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం కిడ్పాప్ చేశారు. రెండు కోట్ల రూపాయలు ఇస్తే, వదులుతామని కిడ్నాపర్లు షరతు పెట్టారు.
"మా వద్ద ప్రస్తుతం అంత డబ్బు లేదు. చిత్తూరులో మా బంధువుల వద్దకు తీసుకుని వెళితే, డబ్బు తీసిస్తా" అని రాజేష్ కిడ్నాపర్లను దారి మళ్లించే యత్నం చేసినట్లు చెబుతున్నాడు. ఐదుగురిని కిడ్నాపర్లు చిత్తూరుకు కారులో తీసుకుని బయలుదేరారు.
తిరుపతి, చిత్తూరు మార్గంలోని ఐతేపల్లె వద్ద కారు ప్రయాణిస్తుండగా, కిందకు దూకేసిన రాజేష్, కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్నాడు. దీంతో స్థానికులు 100 నంబర్ కు కాల్ చేసి, చెప్పడంతో కిడ్నాప్ వ్యవహారం బయటపడింది. కారు నుంచి దూకేయడంతో గాయపడిన రాజేష్ ను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స తీసుకుంటున్న రాజేష్ నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్ఐ సునీల్ చెప్పారు.
"నా భార్య, పిల్లలు, తల్లిని కాపాడండి" అని వేడుకుంటున్నారు. ఈ వ్యవహారంలో అనేక సందేహాలకు ఆస్కారం కలుగుతోంది. మీసేవ నిర్వహించే వ్యక్తిని రెండు కోట్లు డిమాండ్ చేయడం ఒకటి. చిత్తూరులో డబ్బు తీసి ఇస్తామంటే, కిడ్నాపర్లు వారి అదుపులోని వారిని వెంట తీసుకుని బయలులేరుతారా? ఐతేపల్లి వద్ద కారు నుంచి దూకేస్తే, రాజేష్ తిరుపతికి ఎలా చేరాడు. అనే సందేహాలకు ఆస్కారం కల్పించాడు. పోలీసుల దర్యాప్తులో విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది.

Similar News