మాజీ ఐఎఎస్ అధికారి జిఎన్ రావు మృతి

మూడురాజధానుల సమర్థిస్తూ నివేదిక ఇచ్చి వివాదంలో చిక్కుకున్న దళిత అధికారి;

Update: 2025-05-22 09:39 GMT
GN Rao

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాష్ట్ర రాజధానిని మూడు రాజధానులుగా డీ సెంట్రలైజ్ చేసే విషయం పరిశీలించేందుకు నియమించిన కమిటీ ఛీఫ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపిశెట్టి నాగేశ్వరరావు (జిఎన్ రావు) మృతి చెందారు. ఆలస్యంగా అందిన సమాచారం ప్రకారం బుధవారం నాడు హైదరాబాద్ కుందన్ బాగ్ లోని తన గృహంలో గుండెపోటుతో ఆయన కన్ను మూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. 2020లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ప్రత్యేకంగా మూడు రాజధానుల కమిటీ వేసి జి.యన్.రావును ఆ కమిటీకి చైర్మన్ గా నియమించారు. మూడు రాజధానులే రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయని జి.యన్.రావు ఆధ్వర్యంలో కమిటి నివేదిక సమర్పించింది.

సెక్రటేరియట్, చీఫ్ మినిస్టర్ క్యాంప్ కార్యాలయం, శీతాకాలఅసెంబ్లీ, ఒక హైకోర్టు బెంచ్ ని విశాఖ పట్నం మెట్రోపాలిటన్ రీజియన్ లో ఏర్పాటు చేయాలని రావు రికమెండ్ చేశారు. ఇలాగే, రాష్ట్ర అసెంబ్లీ, ఒక హైకోర్టు బెంచ్, రాజ్ భవన్, మంత్రుల నివాసాలు అమరావతి-మంగళగిరి కాంప్లెక్స్ ఉండాలని, అసెంబ్లీ బడ్జెట్ సెషన్ మాత్రం అమరావతిలోనే నిర్వహించాలని తన నివేదికలో పేర్కొన్నారు. కర్నూలు లో జ్యుడిషియల్ క్యాపిటల్ అనిపేర్కొంటూ, హైకోర్టు, ఇతర కోర్టులను అక్కడ ఏర్పాటు చేయాలని రావు కమిటి సూచించింది.

అంతేకాదు, ఆయన రాష్ట్రాన్ని నాలుగు జోన్లు గా విభజించాలని కూడా సూచించారు. అవి:విశాఖపట్నం-శ్రీకాకుళం-విజయనగరం (నార్త్ కోస్టల్ జోన్), ఈస్టు గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, (మధ్య కోస్తా), గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, (దక్షిణ కోస్తా), అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప (రాయలసీమ), ఇలాంటి జోన్లకు కమిషనర్లను నియమించాలని, ఈ విధానం కర్నాటకలో ఉందని చెప్పారు.

ఈ రిపోర్టు చంద్రబాబు నాయుడికి బాగా ఆగ్రహం తెప్పించింది. "ఎవరీ జిఎన్ రావు, రాజధాని కమిటికి నాయకత్వంవహించేంత అర్హతలు ఆయనకు ఉన్నాయా. నాదగ్గిర గ్రూప్ వన్ సర్వీస్ ఆఫీసరు. ఆయన సంగతి నాకు తెలియదా. ముఖ్యమంత్రి ఏమి నిర్ణయించాడో దాన్నే ఆయన రిపోర్టులో రాశాడు," నాటి ప్రతిపక్ష నాయకుడయిన చంద్రబాబు మండిపడ్డారు.

అంతేకాదు, తిరుపతి గర్జన సభలో జి.యన్.రావును ‘యూజ్ లెస్ ఫెలో’ అని తిట్టడారు. దళితుడు కాబట్టే చంద్రబాబు నాయుడు ఆయనని అలా తిట్టారని అపుడు బాగా విమర్శలు వచ్చాయి.

1988 బ్యాచ్ కు చెందిన గోపిశెట్టి నాగేశ్వరరావు గుంటూరు కలెక్టర్ గా ప్రస్థానం ప్రారంభించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక కీలక పోస్టుల్లో పని చేశారు. పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వేసుల శాఖ కార్యదర్శిగా చేశారు. రవాణా శాఖ, ఉన్నత విద్యా శాఖ, పౌర సరఫరాల శాఖ, టెక్స్ టైల్ శాఖ కమిషనర్ గా, సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేశారు. రిటైర్డ్ అయ్యాక అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆయన్ని శిల్పరామం స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు. ఎక్కడున్నా ఆయన తన ఉనికిని ఏదొక విధంగా చాటేవారు! ఆయనకు నచ్చినట్లుగా చేసేవారు! చాలాసార్లు ప్రభుత్వ నిర్ణయాలు నచ్చక నిర్లక్ష్యం వహించి కొరకరాని కొయ్యగా గుర్తింపు తెచ్చుకున్నారు. రేపు శుక్రవారం జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో వారి అంత్యక్రియలు జరుగుతాయి.

Tags:    

Similar News