‘బాబు వన్నీ డైవర్షన్ పాలిటిక్సే’.. మండిపడ్డ మాజీ మంత్రి కాకాణి

విపత్తు సమయంలో కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-09 10:23 GMT

విపత్తు సమయంలో కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరద నివారణ చర్యలతో పాటు సహాయక చర్యలు అందించడంలో, పరిస్థితులను అంచనా వేయడం, ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ప్రాణ నష్టాన్ని నివారించడం ఇలా ప్రతి అంశంలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. చంద్రబాబు 40ఏళ్ల అనుభవం ఇప్పడు ఏమైందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన తప్పులను, చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే వాళ్లంతా కలిసి వైఎస్ జగన్ విమర్శిస్తున్నారని, లేనిపోని అభాండాలు వేసి మరీ నిందిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాలు వస్తాయని ఐఎండీ ముందే హెచ్చరించినా ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రజలకు పునరావాస కేంద్రాలకు తరలించడం అసాధ్యమని ఆర్పీ సిసోడియా చెప్పడమే ఇందుకు నిదర్శనమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘బుడమేరుకు 1964లో భారీ వరద వచ్చింది. అప్పుడు 10మంది ప్రాణాలు కోల్పోయారు. రియల్ టైమ్ గవర్నెన్స్ అని మాట్లాడే చంద్రబాబు.. వరద తీవ్రతకు ఎందుకు గుర్తించలేకపోయారు. నీటిని విడుదల చేయాలన్న అధికారుల హెచ్చరికలను ప్రభుత్వం ఎందుకు పెడచెవిన పెట్టింది? బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడం అసాధ్యంగా ఎందుకు మారింది? సీఎం చంద్రబాబు కూడా తన ఇంటి నుంచి పునరావాస కేంద్రం కలెక్టరేట్‌కు వెళ్లారు. వరదలు తగ్గిన తర్వాత ఇంటికెళ్తానని అంటున్నారు. చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు చేరింది. అందుకే ఆయన కలెక్టరేట్‌లో ఉంటున్నారు. కానీ చెప్పుకోవడానికి మాత్రం ప్రజల కోసం ఉంటున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్‌లో హైడ్రా ఇప్పుడు వచ్చింది. కానీ జగనన్న అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అక్రమ కట్టాడలపై కన్నెర్ర చేశారు’’ అని చెప్పుకొచ్చారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.

కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని విమర్శించారు ఈ మాజీ మంత్రి. పచ్చ మీడియా మాత్రం చంద్రబాబు ఏం చేసినా ఆహా.. ఓహో అంటూ జాకీలు పెట్టి మరీ ఎలివేట్ చేస్తున్నాయంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు రైల్వే ట్రాక్ పక్కన నిలబడితే.. బాబుకు తప్పిన ప్రమాదమని, రైలు మూడు అడుగుల దూరంలోకి వచ్చి ఆగిందంటూ ప్రచారం చేశారని, వరద కారణంగా పోయిన ప్రాణాలను చంద్రబాబు చేసిన హత్యలుగానే పరిగణించాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News