రేషన్ బియ్యం అక్రమంలో ఐపీఎస్‌ల పాత్ర..

కాకినాడలో జరిగిన రేషన్ మాఫియాలో ఐపీఎస్‌ల పాత్ర కూడా ఉందని మంత్రి నాదెండ్ల ఆరోపించారు. అంతేకాకుండా ప్రజలకు నాణ్యమైన నిత్యావసరాలను రాయితీపై అందిస్తున్నట్లు ప్రకటించారు.

Update: 2024-07-11 10:30 GMT

కాకినాడలో రేషన్ బియ్యం మాఫియా పెట్రేగిపోతోందని, వందల టన్నుల బియ్యాన్ని బోర్డర్ దాటిచ్చేస్తోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇటీవల చేసిన తనిఖీల్లో ఆరు గోదాముల్లో అవకతవకలను గుర్తించినట్లు కూడా ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగానే ఆన అధికారులపై కూడా మండిపడ్డారు. ఈ రేషన్ బియ్యం అక్రమాల గురించి వారికి తెలియదా.. లేకుంటే తెలిసినా మౌనం పాటిస్తున్నారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా ఈ రేషన్ అక్రమాల్లో ఐపీఎస్ అధికారులు పాత్ర కూడా ఉందంటూ మరో సంచలన ప్రకటన చేశారు. ఈ అంశాన్ని తాము సీరియస్‌గా తీసుకున్నామని, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించనున్నామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇప్పటి వరకు కాకినాడలో 43,249 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశామని వెల్లడించారు.

పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టించడం అత్యంత హేయమైన చర్య అంటూ మండిపడ్డారు. ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై, ఇందుకు సహకరించిన వారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయని, ఏ ఎక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు. అంతేకాకుండా రైతులకు చెల్లించాల్సిన రూ.600 కోట్లను అతి త్వరలోనే చెల్లిస్తామని, ఇప్పటికే ఈ చెల్లింపుల చర్చలు కూడా జరిగాయని చెప్పారు. ధరల స్థిరీకరణపై కూడా రీటైల్ వ్యాపారస్తులతో సమీక్షించినట్లు ఆయన వెల్లడించారు.

ఐపీఎస్ అధికారులు

రేషన్ అక్రమాల్లో నలుగు ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని మాకు తెలిసింది. ముందుగా వారి పాత్రపై సమగ్ర, శాఖా పరమైన విచారణ చేపడతాం అని ఆయన వివరించారు. వారి పాత్ర ఉన్న మాట వాస్తవమే అయితే చట్టప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చట్టం దృష్టిలో అందరూ ఒకరే అన్న సిద్ధంతాన్ని తామ ప్రభుత్వం అక్షర సత్యం చేస్తుందని, తప్పు ఎవరు చేసిన శిక్ష తప్పదని చెప్పుకొచ్చారాయన. అంతేకాకుండా రేషన్ మాఫియాను కూకటి వేళ్లతో సహా పెకలించే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని, మరోసారి రేషన్ మాఫియా జరగకుండా ఉండేలా కూడా చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు.

రేషన్‌ మాఫియాలో మాజీ ఎమ్మెల్యే

రేషన్‌ బియ్యం మాఫియాలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబ అవినీతి భారీగా ఉందని కూడా మంత్రి నాదెండ్ల మనోహర్‌ గతంలో ఆరోపించారు. గత ప్రభుత్వం కాకినాడ పోర్టును అక్రమ బియ్యం ఎగుమతులకు అడ్డాగా మార్చుకుందని మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్‌ మాఫియాను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కాకినాడ పోర్టుకు సమీపంలో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో రూ. 159 కోట్ల విలువైన 35,404 టన్నుల బియ్యాన్ని సీజ్‌ చేశామని వివరించారు.

రాయితీపై నిత్యావసరాలు

ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులను రాయితీపై అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే విజయవాడ ఏపీఐఐసీ కాలనీలోని రైతు బజార్లో నాణ్యమైన బియ్యం, కందిపప్పును రాయితీపై అందించడం ప్రారంభించిది ప్రభుత్వం. ఈ కౌంటర్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో సామాన్యులకు నాణ్యమైన నిత్యావసర సరుకులను రాయితీపై అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

‘‘హోల్ సేల్, రీటైల్ వ్యాపారస్తులు కూడా కిలో కందిపప్పు రూ.160కు, బియ్యం కూడా తక్కువ ధరకే అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో పంచదార సహా ఇతర వస్తువులను కూడా రైతు బజార్ల ద్వారా రాయితీపై పంపిణీ చేస్తాం. ఒక్కొక్కరికి కిలో కందిపప్పు, ఐదు కిలోల బియ్యం చొప్పుల అందిస్తాం. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి’’ అని సూచించారు.

Tags:    

Similar News