కడప జైల్లో పుష్పాలు: అధికారులే స్మగ్లర్లకు సేవకులు!

జైలర్ సహా ఐదుగురిపై వేటు, విచారణలో విస్తుపోయే నిజాలు;

Update: 2025-07-22 11:41 GMT
Kadapa Central Jail
అదో జైలు.. లంచం ఇస్తే అందులో సిబ్బంది ఏమైనా చేస్తారు.. పోనీ వీళ్లు ఏమైనా చిన్నా చితకా ఉద్యోగులో కాదు.. సాక్షాత్తు అందరూ పెద్ద అధికారులే. సంస్కరణల కోసం ఉద్దేశించిన జైళ్లు విలాసకేంద్రాలుగా మారితే ఇక నేరస్థులకు అదుపు ఏముంటుందీ? ఈ కథేంటో చూడండి.

కడప జిల్లా కేంద్ర కారాగారంలో ఐదుగురు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్‌ కమలాకర్‌తో పాటు మరో ముగ్గురు జైలు వార్డర్లు సస్పెండ్ అయ్యారు. ఈమేరకు జైళ్ల శాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు.
అసలేమిటీ ఆరోపణలు...
వీళ్లందరూ ఉన్నతాధికారులే. జైల్లో వీళ్లు చెప్పిందే వేదం. కడప జిల్లా జైలులో ఖైదీలు కోరిన సదుపాయాలను వీళ్లు సమకూర్చుతున్నారన్నది అభియోగం. ఫోన్లతో పాటు ఖైదీలకు అవసరమైన తిండి కూడా సరఫరా అవుతోంది. దీనిపై చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లకు సెల్ ఫోన్లు అందిస్తున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి.
కడప అంటే వైసీపీ వాళ్లకు పెట్టని కోట అని భావిస్తారు గనుక సహజంగానే టీడీపీ ప్రభుత్వం ఈ ఆరోపణలను నిగ్గు తేల్చాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా డిఐజీ రవికిరణ్ విచారణ చేపట్టారు. నాలుగు రోజుల పాటు ఆయన కడప జైలుపై విచారించారు. ఆయన ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఈ ఐదుగురిపై సస్పెన్షన్ వేటు పడింది.సస్పెండ్ అయిన వారిలో జిల్లా కేంద్ర కారాగారంలో పనిచేస్తున్న జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్‌, మరో ముగ్గురు జైలు వార్డర్లు ఉన్నారు.
మనం పుష్పలాంటి సినిమాల్లో స్మగ్లర్ల వాహా చూశాం. నిజంగా ఇప్పుడు కడప జైల్లో కూడా బోలెడంత మంది పుష్పలు ఉన్నారు. పుష్ప అంటే పువ్వనుకుంటే పొరబాటే అని మరోసారి తేలింది.
నేరస్తులకు స్వర్గధామం?
ఒకవైపు దేశవ్యాప్తంగా జైళ్లను సంస్కరణ కేంద్రాలుగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వాలు ముందుకెళ్తుంటే, కడప కేంద్ర కారాగారం నేరస్థులకు విలాసవంతమైన వసతులు కల్పించే హబ్‌గా మారిందన్న ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. జైలులో ఉన్న ఖైదీలు తమ అవసరాల కోసం ప్రభుత్వ సిబ్బందినే ఆశ్రయించాల్సిన పరిస్థితి, కానీ ఇక్కడ మాత్రం ఖైదీలే అధికారుల పట్ల 'లంచాల బోనస్'తో శరణు పొందుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజకీయ కోణం
కడప – వైసీపీకి పటిష్ఠమైన కంచుకోటగా భావించే నియోజకవర్గం. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం, ఇటువంటి అవినీతిని వెలికితీసేందుకు ముందుకు వస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ వ్యవహారాన్ని పూర్తిగా నిగ్గు తేల్చి, సంబంధితులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజలకు న్యాయం జరిగిందన్న నమ్మకం కలుగుతుంది.
'పుష్పా' సినిమాలే నిజమైన కడప జైల్లో?
సినిమాల్లో చూపించిన స్మగ్లింగ్, పోలీసుల లంచాలు, బాహుబలితనాలే ఇప్పుడు నిజ జీవితంలో చోటు చేసుకున్నాయనిపిస్తోంది. “పుష్ప అంటే పువ్వు కాదు.. ఫైర్ ” అన్న డైలాగ్ గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు ఆ అగ్ని అధికారుల నైతిక విలువల్ని కాల్చేస్తున్నట్టు అనిపిస్తోంది.
Tags:    

Similar News