మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ.. గాంధీ ఇజాన్ని ఆచరించకపోతే వీర రాఘవరెడ్డి లాంటి వాళ్లు పెరుగుతారని, కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టవద్దని, ప్రజల ఐక్యతే సమాజానికి మేలు చేస్తుందని వంద సంవత్సరాల క్రితమే మహాత్మా గాంధీజీ ఉద్భోదించారన్నారు. నేడు గాడ్సే వాదులు మత విద్వేషాన్ని రెచ్చగొడుతూ ముస్లింల పట్ల వ్యతిరేకతను పెంచుతూ రాజకీయ లబ్ధి కోసం గాంధీజీ పట్ల ద్వేష భావాన్ని ప్రజలలో పెంచుతున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే మహిళలు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల పట్ల విద్వేష భావాలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. మనిషిని కుల, మతాల పేరుతో ద్వేషించడం ప్రారంభిస్తే సమాజం ధ్వంసం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ .. నేడు మతోన్మాద శక్తులు గాంధీజీ, నెహ్రూల పట్ల ద్వేష భావం పెంపొందిస్తున్నారని అన్నారు. సోషల్ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా విద్వేష ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీజీ ఆనాడు మద్యపానం మానమని, ప్రభుత్వం మద్యం అమ్మకాలను ఆదాయ వనరులుగా చూడటం పాపమని ఉద్భోదిస్తే, నేడు ప్రభుత్వాలు మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ, ఆదాయ వనరులుగా మారుస్తూ, ప్రజలు తూలుతూ ఉంటే ప్రభుత్వాలు నిలబడతాయని భావిస్తున్న సమయం ఆసన్నమైందన్నారు. గాంధీజీ ఆశయాలకు తూట్లు పొడుస్తూ గ్రామ స్వరాజ్, అభివృద్ధి, అధికార వికేంద్రీకరణకు తూట్లు పొడుస్తున్నాయన్నారు. గాంధీయే మార్గం పుస్తకాన్ని ఆచార్య నాగార్జున విద్యాలయ విశ్రాంత రిజిస్ట్రార్ రావెల సాంబశివరావు సభికులకు పరిచయం చేసి, వ్యాస సంకలనాల రచయితల మనోభావాలను చక్కగా వివరించారు.
ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డిఎఆర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. గాడ్సే వాదులు గాంధీజీ హిందూ వ్యతిరేకి అని, ముస్లింల జాతి పిత అని విష ప్రచారం చేస్తున్నారని, గాంధీజీ భావాల ఫలితంగానే భారతదేశం నేడు ఐక్యంగా ఉండగలుగుతుందని తెలిపారు. గాంధీయే మార్గం అనే నినాదం నేడు ఆచరణ యోగ్యంగా ఉందన్నారు. ‘గాంధీయే మార్గం సిద్ధాంతాలు– ప్రభావాలు– పరిష్కారాలు’ అనే 4వ సంపుటిని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆవిష్కరించారు. తొలి ప్రతిని స్వీకరించిన విశ్రాంత తెలుగు ఆచార్యులు వావిలాల సుబ్బారావు మాట్లాడుతూ.. సంకుచిత జాతీయ వాదానికి ప్రతీక గాడ్సే అని వివరించారు. బుద్దుని అనంతరం ప్రపంచానికి సత్యం, అహింస, రాజకీయ విశ్వసనీయత లాంటి విలువలను ప్రపంచానికి అందించిన మహా మనీషి మహాత్మా గాంధీజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నేస్తం సహ వ్యవస్థాపకులు టి ధనుంజయరెడ్డి, సెర్చ్ ఎన్‌జివో అధ్యక్షులు హనుమ ప్రసాద్, మాదిగ జనసేవా సమితి నేతలు దాసరి జాన్ బాబు, పరంగి సత్యరాజు, కందుల ప్రసాద్, బీసీ సంక్షేమ సంఘ నేత తాడికొండ నరసింహారావు, ప్రముఖ సాహితీ పరిశోధకులు పారా అశోక్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.