విశాఖలో టీడీపీకి 'గండి'

తెలుగుదేశం పార్టీకి విశాఖ నగరంలో గట్టి షాక్ తగిలింది. విశాఖ దక్షిణ స్థానం తనకే దక్కుతుందని ఆశించిన గండి బాబ్జికి సీటు దక్కకపోవడంతో పార్టీ నుంచి వైదొలిగారు.

Update: 2024-03-14 10:39 GMT
గండి బాబ్జి


తంగేటి నానాజీ


విశాఖపట్నం: టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల కారణంగా ఉత్తరాంధ్ర టీడీపీలో పలువురు సీనియర్ల సీట్లు గల్లంతయ్యాయి. దీంతో మనస్థాపం చెందుతున్న నేతలు ఒక్కరొక్కరుగా పార్టీ నుండి వైదొలుగుతున్నారు. మూడు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నుంచి విశాఖ పశ్చిమ సీటు ఆశించి భంగపడ్డ సింహాచలానికి చెందిన కాసర్ల ప్రసాద్ టీడీపీ నుంచి కాంగ్రెస్‌కు జంప్ అయ్యారు. తాజాగా విశాఖ దక్షిణ సీటు దక్కలేదని మనస్థాపంతో గండి బాబ్జీ పార్టీకి రాజీనామా చేశారు.


ఈ దారిలోనే మరికొందరు...


గండు బాబ్జి దారిలోనే మరికొందరు రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. తమకు సీటు రాలేదని కొందరు సీనియర్ నేతలు... తమ నేతలకు సీట్లు కేటాయించలేదని కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీకి దూరమవుతున్నారు. పెందుర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సీటు గల్లంతు కావడంతో ఆయన ఇంటి నుండి బయటకు రాలేదు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి సీట్ల సర్దుబాటు తెలుగుదేశం పార్టీలో ముసలానికి దారితీసింది. మరి కొంతమంది నేతలు రాజీనామా చేసే లోపు బుజ్జగింపు చర్యల్లో అధిష్టానం దిగింది.


'గంటా' దారెటు....


మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆది నుంచి అధిష్టానం వైఖరి పట్ల గుర్రుగానే ఉన్నారు. తనకు భీమిలి సీటు కేటాయించమనగా... కాదు కాదు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలంటూ అధిష్టానం ఆదేశించింది. అయినప్పటికీ గంటా శ్రీనివాస్ భీమిలి సీటు తనదేనన్న ధీమాతో ఉన్నారు. రెండో జాబితాలో కూడా తన పేరు లేకపోవడంతో ఋషికొండలోని ఓ రిసార్ట్‌లో ముఖ్య కార్యకర్తలతో రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్తు నిర్ణయంపై చర్చించేందుకని పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే గంటా కూడా పార్టీని వీడనున్నారా అన్న ప్రచారం కూడా సాగుతోంది. ఏది ఏమైనా టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టింది. అధిష్టానం దీన్ని ఎలా చక్కదిద్దుతుందో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News